ఎన్ని ప్రభుత్వాలు మారినా టాలీవుడ్ కు వరాలు ఇచ్చేవే కానీ, ముక్కుపిండి పన్నులు వసూలు చేసే వ్యవహారం ఎప్పుడూలేదు. నట్టి కుమార్ లాంటి నిర్మాతలు ఎన్నోసార్లు గోలపెట్టారు. సినిమా రంగం నుంచి పెర్ ఫెక్ట్ గా పన్నులు వసూలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వాలకు బోలెడు ఆదాయం వస్తుందని నట్టికుమార్ ఎప్పటికప్పుడు చెబుతూనే వున్నారు.
థియేటర్ల వద్ద రకరకాల డిసిఆర్ లు తయారవుతాయని, కలెక్షన్లు నలుపు-తెలుపుగా మారతాయని, దానివల్ల ప్రభుత్వానికి టాక్స్ సరిగ్గా రావడం లేదని గుసగుసలు వున్నాయి సినిమా టికెట్ ల వ్యాపారాన్ని పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించగలిగితే, పన్నులు కచ్చితంగా వస్తాయి.
దానివల్ల సినిమా రంగానికి కూడా మంచిదే. తప్పుడు కలెక్షన్ల రిపోర్టులు, టికెట్ లు కోసేసి, కలెక్షన్లు చూపించేసి, సినిమాలకు ఇబ్బడిముబ్బడి లాభాలుచూపించి, ఆపైన నిర్మాతల దగ్గర హీరోల రెమ్యూనిరేషన్ భయంకరంగా పెంచేయడం అనే పని ఇకపై వుండదు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను పక్కన పెట్టి, ప్రభుత్వం ఈ విషయాన్ని టేకప్ చేసే విషయం పరిశీలనలో వుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆయన ఇలా అనడానికి వెనుక కారణం ఏమై వుంటుందా? అన్నది అనుమానం.
ఎందుకంటే తలసానికి ఇండస్ట్రీ పెద్దలు అంతా మంచి సన్నిహితులే. ముఖ్యంగా ఎగ్జిబిషన్ రంగాన్ని కూడా తమ గుప్పిట్లో వుంచుకున్న బడా నిర్మాతలు అంతా ఆయనకు మంచి సన్నిహితులే. కానీ మరి వాళ్లకు కిట్టుబాటు కాని నిర్ణయం తలసాని తీసుకుంటారా? లేదా తలసాని చెప్పిన మాటల వెనుక మరేమైనా అర్థాలు వున్నాయా? అసలు ప్రభుత్వం చేయబోతోంది ఏమిటో క్లారిటీగా తెలిస్తే, మిగిలినవి అన్నీ ఇట్లే అర్థం అయిపోతాయి.