వ్యవస్థలు ఏకపక్షం అయిన తేదీ జులై 17, 1985

ఆంధ్ర ప్రదేశ్ లో జులై 17 అంటేనే ఒక ఉద్వేగం. సంవత్సరం మర్చిపోతారేమో కానీ తేదీని కాదు. కొందరి బలిదానంతో దళిత ఉద్యమం పురుడుపోసుకున్న రోజు. అప్పటినుండి ఒక దశాబ్దం పాటు ఆంధ్ర ప్రదేశ్…

ఆంధ్ర ప్రదేశ్ లో జులై 17 అంటేనే ఒక ఉద్వేగం. సంవత్సరం మర్చిపోతారేమో కానీ తేదీని కాదు. కొందరి బలిదానంతో దళిత ఉద్యమం పురుడుపోసుకున్న రోజు. అప్పటినుండి ఒక దశాబ్దం పాటు ఆంధ్ర ప్రదేశ్ లో దళిత ఉద్యమం కదం తొక్కిన సందర్భం చూశాం.

కారంచేడు నుండి చుండూరు వరకు పాములకు చీమలు ఎదురు తిరిగిన కాలం. పులులకు, సింహాలకు లేళ్ళు, కుందేళ్ళు ఎదురెళ్ళి ఆత్మగౌరవంతో నిలిచిన కాలం అది.

అంటరానితనం పల్లెల్లో రాజ్యమేలుతున్న కాలంలో అక్కడక్కడా ప్రశ్నించడం మొదలేసిన దళితులు ఎదుర్కొంటున్న నిర్బంధం అది.

“దళితుల్ని చంపేయవచ్చు” అని భూస్వాములు స్థిరచిత్తంతో ఉన్నరోజులు. బీసీలు, ఓసీలు … మొత్తం సమాజం కూడా దళితుల్ని పురుగులకంటే హీనంగా చూసే రోజులు. చివరికి అడుక్కునే వాళ్ళు కూడా దళితులు అన్నం పెడితే తీసుకునేవారు కాదు. డబ్బులో, బియ్యమో, పప్పుగింజలో దానం చేయాల్సిన రోజులవి. అలాంటి రోజుల్లో కారంచేడులో ప్రశ్నించిన దళితులపై పాశవిక దాడి జరిగినరోజు ఇది.

దళితులకు మంచినీళ్ళే దొరకని రోజుల్లో ఆ ఊళ్ళో దళితులకోసం మంచినీటి చెరువు ఉండడం కూడా ఈ సమాజానికి ఒక సవాలుగానే నిలిచింది. ఆ చెరువు ఇచ్చిన నీళ్ళేనేమో 70 యేళ్ళ తేళ్ళ మోషే కర్రసాములో ఉద్దంఢుడయ్యాడు. ఒక్కరూ, ఇద్దరూ కాదు, పదులకొద్దీ దళితులు ధృఢకాయులు. పొలాల్లో పనిచేయడం వల్ల శరీర దారుఢ్యం కలిగి ఉండేవారు. ఆ మాటకొస్తే పల్లెల్లో వ్యవసాయ కూలీలుగా ఆరోగ్యంగాను, దారుఢ్యం కలిగి ఉండేవారు దళితులు.

అలాంటి వారిపై జులై 17, 1985 ఉదయం బాకులు, బరిసెల వేట జరిగింది. అరుపులు, కేకలతో పొలాల్లోకి పరుగెత్తిన దళితులు బరిసెలకు బలయ్యారు. ప్రాణభయంతో పరుగెత్తే మగవాళ్ళు, వెంటాడే పగవాళ్ళు. ఈ మధ్యలో భయంతో పిల్లలను సంకనేసుకుని పరుగెత్తే మహిళలను పట్టుకుని తుప్పల్లోకో, పొలం గట్ల చాటుకో ఈడ్చుకెళ్ళి మానభంగం చేసిన రాక్షసత్వం. మరికొందరు మహిళలను పరుగెత్తుతూనే వివస్త్రలను చేసిన పైచాచికం.

బాకులు, బరిసెలు, కత్తులు దళితుల శరీరాలపై విలయతాండవం చేసిన సందర్భం అది. మనుషులను మానవ మృగాలు కిరాతకంగా పొడిచి మట్టిలో తొక్కిపెట్టిన దుర్దినం అది.

“ఉదయం” దినపత్రిక లేకపోతే ఈ క్రూరత్వం ప్రపంచానికి తెలిసేది కాదేమో! నిజాలను తమకు అనుకూలంగా వక్రీకరించే “ఈనాడు”, “ఆంధ్ర జ్యోతి” పత్రికలు ఈ వార్తను లోపలి పేజీల్లో దాచిపెట్టాయి. కమ్యూనిస్టుల నేతృత్వంలో నడుస్తున్న “ప్రజాశక్తి”, “విశాలాంధ్ర” దినపత్రికలు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక మిగిలిన పత్రికల తీరూ అదే. ఆ తర్వాత యుద్ధం మొదలయ్యాక, కత్తి పద్మారావు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదనరంగాన దూకిన తర్వాత ఇతర పత్రికలు అతికష్టంమ్మీద వార్తను మొదటి పేజీకి తేక తప్పలేదు.

దళితులపై దాడిచేసిన వారిది, పత్రికల యాజమాన్యానిది, ప్రభుత్వానిదీ ఒకే సామాజిక వర్గం. ఈ మారణకాండను ఖండించడానికి కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావుకు కొద్దిగా సమయం పట్టింది. బహుశా కమ్యూనిస్టు ఉద్యమం కూడా అదే సామాజిక వర్గం “యాజమాన్యం”లో ఉండడం వల్లనే ఈ జాప్యం జరిగుండొచ్చు. ఆ సామాజిక వర్గంలో విప్లవకారులు, ఆదర్శవంతులు లేరని కాదు. త్యాగాలు చేసిన వారు లేరని కాదు. తమ జీవితాలను ప్రజలకోసం ధారపోసినవారు లేరని కాదు. కానీ వారంతా భారత దేశంలో కులం, అంటరానితనం వంటి జాడ్యాలను పక్కనపెట్టి కారల్ మార్క్స్ చెప్పిన “వర్గ సమూహాన్ని” వెతుక్కునే పనిలో ఉన్నారు. అందుకే వారికి కారంచేడు పంటపొలాల్లో పొడిచిన శవాలను “దళితులు, అంటరానివారు” అనాలా లేక “శ్రామిక వర్గం” అనాలా అని తేల్చుకోడానికి చర్చలు చేస్తున్నారు.

దళితులపై దాడి జరిగి కత్తి పద్మారావు, బొజ్జా తారకం నేతృత్వంలో ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తున్న రోజుల్లో, బాలగోపాల్, కన్నాభిరాన్ వంటి వారి గొంతులు మద్దతు పలికిన తర్వాత, 1985 ఆగస్టు 6న విజయవాడ నడిబొడ్డున కారంచేడు మారణహోమంపై భారీ నిరసనగళం వినిపించిన తర్వాత ఆగస్టు నాలుగో వారంలో ఈ మొత్తం మారణ కాండకు ప్రత్యక్ష సాక్షి అయిన దుడ్డు అలీశమ్మను (దళితులంతా సాక్షులు. దళితులంతా బాధితులే. అయినా కోర్టు భాషలో) భూస్వాములు చీరాలలో నరికి చంపడం మొత్తం వ్యవస్థలు దళితులే లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం.

ఇలాంటి వ్యవస్థల మధ్య నిఠారుగా నిలిచిన “ఉదయం” పత్రిక అన్నా, దాని యజమాని దాసరి నారాయణరావు, అప్పటి ఉదయం పాత్రికేయులు ఏ బి కె ప్రసాద్, కె రామచంద్ర మూర్తి, తాడి ప్రకాష్, కె శ్రీనివాస్, ఖాదర్ మొహిద్దీన్ అన్నా ఇప్పటికీ, ఎప్పటికీ గౌరవమే.

పార్టీలు, ప్రభుత్వాలు, పత్రికలూ… ఒక్కటేమిటి… అన్నీ ఒకపక్షం… ఏకపక్షం… అందుకే ఇంకా ఇలాంటి దాడులు దేశమంతటా జరుగుతూనే ఉన్నాయి.

మొన్ననే మధ్య ప్రదేశ్ లో పోలీసులు, ప్రభుత్వ అధికారులు కలిసి ఒక దళిత కుటుంబాన్ని దారుణంగా, అత్యంత క్రూరంగా హింసించడం చూశాం. వ్యవస్థలు ఏకపక్షం అయితే ఎక్కడో ఒక చోట నిత్యం కారంచేడు మారణహోమం జరుగుతూనే ఉంటుంది. దాడికి బలయ్యే దళితుల సంఖ్యే కాస్త అటూ ఇటుగా ఉంటుంది.

From Gopi Dora Face Book Page