మనిషిని నమ్మే ముందు జాగ్రత్త!

బెంగళూరులో ఒక క్యాబ్‌ డ్రైవర్‌ చేసిన ఘాతుకం ఇంగ్లిష్‌ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. ఒక ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ను నమ్మి ఒక యువతి తన జీవితాన్ని కోల్పోయింది. ఆమె ఒక ఈవెంట్‌ మేనేజర్‌…

బెంగళూరులో ఒక క్యాబ్‌ డ్రైవర్‌ చేసిన ఘాతుకం ఇంగ్లిష్‌ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. ఒక ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ను నమ్మి ఒక యువతి తన జీవితాన్ని కోల్పోయింది. ఆమె ఒక ఈవెంట్‌ మేనేజర్‌ కమ్‌ మోడల్‌. తనది కోల్‌కతా. పని విషయంలో బెంగళూరుకు వచ్చింది. తన ఈవెంట్‌ ప్లేస్‌ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు ఒక క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది, ఆ సమయంలో క్యాబ్‌ డ్రైవర్‌తో ఆమె సంభాషించింది.

వాడు ఇంకా యుక్త వయసులో ఉన్నవాడే. రాత్రిపూట హోటల్‌ వద్ద తనను డ్రాప్‌ చేశాకా, తను ఉదయమే కోల్‌కతా వెళ్లాలని, తెల్లవారుజాము నాలుగున్నరకు తనను ఎయిర్‌ పోర్టుకు తీసుకెళ్లడానికి రమ్మని ఆమె పిలిచింది. మళ్లీ యాప్‌ ద్వారా క్యాబ్‌ బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఏదో పరిచయం అయ్యాడని ఉదయమే రమ్మంది. వాడు వచ్చాడు. ఆమెను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లాల్సిన సమయంలో దారి మళ్లించాడు.

తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బు కోసం బెదిరించాడు. డబ్బు తీసుకుని ఆమెను వదిలి వేయలేదు. ఆమెను తీవ్రంగాకొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా వాడి కసి చల్లారలేదు. ఆమెను ఎయిర్‌పోర్ట్‌ అవతల ఒక పల్లెటూరి వద్ద దారుణంగా హతమార్చాడు. తనకేం తెలియనట్టుగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమె ఎవరో కనుక్కోవడం కూడా కష్టం అయ్యింది. మిస్సింగ్‌ కేసులన్నీ పరిశీలించగా అసలు విషయం అంతా బయటకు వచ్చింది. ఆమె కోల్‌కతా నుంచి వచ్చిన మోడల్‌ అని నిర్ధారించి, పోలీసులు ఆమె ఫోన్‌ నుంచి చివరిసారిగా వెళ్లిన కాల్స్‌ లిస్టును పరిశీలించగా.. క్యాబ్‌ డ్రైవరే ఘాతుకానికి పాల్పడ్డాడు అని నిర్ధారణ అయ్యింది.

ఆమె దగ్గర తనకు ఐదువందల రూపాయలు మాత్రమే దొరికిందని ఆ రాక్షస క్యాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు చెప్పాడట. ఇరవై ఒక్క యేళ్ల ఒక యువతి జీవితాన్ని ఐదువందల రూపాయల కోసం చిద్రంచేశాడు ఒక రాక్షసుడు. ఇందులో ఆమె పొరపాటల్లా అపరిచితుడిని నమ్మడం. క్యాబ్‌ డ్రైవర్‌ అని అతడిని నమ్మి.. పిలిస్తే అంతటి ఘాతుకానికి ఒడికట్టాడు. ఇలాంటి సంఘటనలు మీడియాలో అగుపిస్తుండటం.. మనిషిని నమ్మడం ఎంత ప్రమాదకరమో చాటిచెబుతూ ఉంది.
-ఎల్‌.విజయలక్ష్మి