మొన్నటి వరకూ ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడిపోతోందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తంచేశారు. అది అర్థంలేదని ఆందోళన అని కాస్త ఎరిగిన వాళ్లంతా చెప్పారు. ఓడిపోయినవారు సాకుగా ఆ మాట చెబుతున్నారని స్పష్టమైంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు ఏ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అయినా బీజేపీలోకి చేరిపోతూ ఉండటమే ప్రజాస్వామ్యానికి పెద్ద అపహాస్యంగా మారింది. దేశంలో కమలం పార్టీ ఫిరాయింపుల రాజకీయం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులకు ప్రజలు పట్టంకట్టిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆ పార్టీనే అధికారం చేపడుతూ ఉంది.
కర్ణాటకలో తమకు స్పష్టమైన మెజారిటీ లేకపోయినా బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది! మెజారిటీని కలిగి ఉండిన సంకీర్ణ సర్కారు పడిపోగా.. మెజారిటీ లేకపోయినా బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రక్రియే! ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మధ్యప్రదేశ్ మీద గురి ఎక్కు పెట్టిందట బీజేపీ. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా. ఇదంతా జరిగి కొన్ని నెలలే అవుతోంది.
అయితే కాంగ్రెస్ కు బోటాబోటీ మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పరిణామాలను ఆసరాగా చేసుకుని అక్కడా ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి కమలం పార్టీ రెడీ అవుతోందట. బీజేపీ మిషన్ కర్ణాటకలో ముగిసిందని, మధ్యప్రదేశ్ లో మొదలు కాబోతోందని కమలం పార్టీ వాళ్లు గర్వంగా చెప్పుకుంటున్నారు!