ఇప్పుడు కాదట.. ఎప్పుడో ఎన్నికలకు ముందే తను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు రఘువీరారెడ్డి. మే 19నే తను ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా రఘువీరారెడ్డి ప్రకటించారు. అయితే అధిష్టానం తన రాజీనామాను అప్పటి నుంచి ఆమోదించడం లేదని రఘువీర చెప్పుకొచ్చారు.
తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. తన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని తను ముందు నుంచినే కోరుతున్నట్టుగా రఘువీర చెప్పుకొచ్చారు. అయితే అధిష్టానం తన రాజీనామాను పెండింగ్ లో పెట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అదే విషయంలో అధిష్టానం పెద్దలను కలిసినట్టుగా, తను రాజీనామా చేసినట్టుగా రఘువీరారెడ్డి ప్రకటించారు.
మరి ఇప్పుడు రాజీనామా చేసినట్టు అయితే, గతంలో చేసినదాన్ని ఏమనాలో రఘువీరారెడ్డికే తెలియాలి. ఎలాగోలా భారం దించుకోవాలని రఘువీరారెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బహుశా ఇప్పుడు పీసీసీ భారాన్ని ఆయన దించుకున్నట్టేనేమో.
రఘువీరారెడ్డి పార్టీ మారబోతున్నారనే వార్తలు కొన్నాళ్ల నుంచి వస్తున్నాయి. ఆయన బీజేపీలోకి చేరబోతున్నట్టుగా టాక్ వినిపిస్తూ ఉంది. అయితే ఆయన మాత్రం ఆ విషయంలో లేదు లేదంటూ ఉన్నారు. కానీ రఘువీర విషయంలో పుకార్లు మాత్రం ఆగడంలేదు!