‘యాంటీ కమలం’ తప్ప వేరే ఎజెండా లేనే లేదు!

ఎంతకాలం గడిచినా సరే వామపక్షాలకు ప్రజల్లో నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ప్రతి ఎన్నికల్లోనూ వారు ఆ సంగతి నిరూపించుకుంటూనే ఉంటారు. చాలా వరకు ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి…

ఎంతకాలం గడిచినా సరే వామపక్షాలకు ప్రజల్లో నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ప్రతి ఎన్నికల్లోనూ వారు ఆ సంగతి నిరూపించుకుంటూనే ఉంటారు. చాలా వరకు ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా, వారికి ఉపయోగపడటం ద్వారా కూడా తమ బలాన్ని నిరూపించుకుంటూ ఉంటారు!

అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక విషయంలో వామ పక్షాలు తెరాసకే మద్దతు ఇస్తున్నాయి. సిపిఐ, సిపిఎం రెండు పార్టీలు గులాబీకి మద్దతు ఇవ్వడం ఖరారైపోయింది. అయితే ఇందులో భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేక తప్ప మరొక ఎజెండా ఏది వారు చూపించకపోవడం గమనార్హం.

నల్గొండ జిల్లాలో సాధారణంగా వామపక్షాలకు కూడా గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక విషయంలో ఆ పార్టీలను తన జట్టులో పెట్టుకోవాలని గులాబీ దళపతి కేసీఆర్ వ్యూహరచన చేయడంలో తప్పేమీ లేదు. అది వారికి అవసరం కూడా. ఆగస్టు 20వ తేదీన మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించే సమయానికే సిపిఐ ఆయన వెంట నిలిచింది. సిపిఎం అప్పటికి తమ వైఖరిని స్పష్టం చేయలేదు. కానీ సభలో తన ప్రసంగంలో భాగంగా సిపిఎం కూడా మరికొన్ని రోజుల వ్యవస్థలో తమకు మద్దతు ప్రకటించబోతున్నదని కెసిఆర్ స్పష్టం చేసేసారు. డీల్ ఇంకా డిస్కషన్ల దశలోనే ఉన్నదని విమర్శలూ వచ్చాయి. సరిగ్గా పది రోజుల్లో తెలంగాణ సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మునుగోడు ఉపఎన్నికలో మద్దతు విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 

జాతీయ రాజకీయాలను గమనించినప్పుడు ప్రస్తుతానికి ఈ వామపక్ష పార్టీలు రెండూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో మునుగోడు ఎన్నిక వచ్చేసరికి టిఆర్ఎస్ జట్టులో చేరాయి. బిజెపితో సమానంగా కాంగ్రెస్ పార్టీని కూడా ద్వేషించడానికి దూరం పెట్టడానికి కేసీఆర్ తపన పడుతూ ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో వామపక్షాలు ఆయన తరఫున ఈ ఎన్నికల్లో పనిచేయడం కొంచెం చిత్రంగా అనిపిస్తుంది.

తమ ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, వారిని ఓడించడానికి ఎవరితోనైనా చేతులు కలుపుతామని వామపక్షాలు అంటున్నాయి. చూడబోతే బిజెపిని ఓడించడం తప్ప వారికి ఇంకొక ప్రజల ఎజెండా ఉన్నట్టుగా కనిపించడం లేదు. బిజెపి ఓడిపోవడమే ప్రజల ఎజెండా అని వారు నిర్వచించినా ఆశ్చర్యమూ కలగదు.

మునుగోడు ఎన్నికల్లో మద్దతు ఇచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని పేదల తరఫున పనిచేస్తూ ఉంటామని తమ్మినేని వీరభద్రం సెలవిచ్చారు. ఇదొక అర్థం కాని సమీకరణం! మునుగోడులో ప్రస్తుతం టీఆర్ఎస్ బిజెపి మధ్య మాత్రమే పోటీ జరగబోతున్నదని.. కాంగ్రెస్ తెరాస రెండు పార్టీలు తమను మద్దతు కోసం ఆశ్రయించినప్పటికీ… గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న దృష్ట్యా తెరాస వెనుక నిలబడదలచుకున్నామని ఆయన తేల్చి చెప్పారు.

కప్పగంతుల రాజకీయాలు మనకు కొత్త కాదు కానీ సిద్ధాంతాల పార్టీలైన వామపక్షాలు కూడా ఇలాంటి మాటలు చెప్పడమే కించిత్ ఆశ్చర్యం అనిపిస్తుంది.