కుచ్ – కరోనా…రాజకీయం..

తెలుగు వాళ్ల మీద వెనకటికి ఓ చిన్న జోక్ లాంటి కథ వుంది. ఒకడు నిచ్చెన ఎక్కుతుంటే మరొకడు లాగుతుంటాడు అని. అందుకే దేశంలో తెలుగు వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగడం చాలా అరుదుగా…

తెలుగు వాళ్ల మీద వెనకటికి ఓ చిన్న జోక్ లాంటి కథ వుంది. ఒకడు నిచ్చెన ఎక్కుతుంటే మరొకడు లాగుతుంటాడు అని. అందుకే దేశంలో తెలుగు వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగడం చాలా అరుదుగా జరుగుతుంటుంది అని. లక్కీగా ఐటీ పుణ్యమా అని మన వాళ్లు విదేశాల్లో మాత్రం విజయాలు సాధిస్తున్నారు. కాంగ్రెస్ దేదీప్యమానంగా వెలిగినంత కాలం తెలుగునాట కాళ్లు లాగే కార్యక్రమం సాగుతూనే వుండేది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఈ లాగుడు పని తప్పింది. మోసే పని పెరిగింది.

మధ్యలో కాంగ్రెస్ వచ్చిన తరువాత గద్దె దింపేపని, కాళ్లు లాగే పనిని అధికారపక్షంలోని గిట్టని వారు, అలాగే ప్రతిపక్షంలోని నేతల కన్నా, మీడియానే ఎక్కువ తలకెత్తుకుంటూ వస్తోంది. తమకు కిట్టని ప్రభుత్వం వుండకూదని వాళ్లే కిందా మీదా అయిపోవడం కామన్ అయిపోయింది. ఎందుకంటే తమ అను'కుల' ప్రభుత్వం వస్తే, ఏడాదికి హీనంలో హీరో వంద కోట్ల విలువైన ప్రకటనలు ప్రభుత్వం నుంచి వస్తాయి కదా?

సరే ఇలా కాళ్లు లాగే కార్యక్రమం రాజకీయ వర్గాల నుంచి మీడియా తన భుజాల మీద వేసుకున్న తరువాత తొలి ఛాలెంజ్ ఆంధ్రలో ఎదురయింది. జగన్ రూపంలో ఓ కొరకరాని కొయ్య గద్దె మీద కూర్చుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వున్నా, ఏ సిఎమ్ వున్నా, అందరికీ పనులు జరిగిపోయేవి. మీడియా వాటా మీడియాకు దక్కేసేది. కానీ అలాంటిది తొలిసారి జగన్ ప్రభుత్వం మొండి ఎద్దు మాదిరిగా రోడ్డు మీద అడ్డంగా కూర్చుని కదలనంటోంది. దీన్ని కదిలించాలి. పక్కకు తప్పించాలి. అప్పుడే ఆ రోడ్డు మీద తమ ప్రయాణం, తమ ఇష్టం వచ్చినట్లు సాగిపోతుంది.

ఏదైనా ఇదే కర్తవ్యం

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకుండానే ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టేసారు. ప్రతి దానికీ ఎవరో ఒకరి చేత కొర్టులోఓ పిటిషన్ వేయించి మోకాలు అడ్డడం కర్తవ్యం అయిపోయింది. జగన్ ను అష్టదిగ్బంధనం చేసి, చేష్టలుడిగేలా చేసి లేదా అభాసుపాలయ్యేలా చేసి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు తప్ప సరైన నాయకుడు లేడు అని అనిపించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. అయినా జగన్ ముందుకే సాగాడు.

ఓ పక్క తమ వాళ్ల వ్యాపారాలు పోతున్నాయి. మరోపక్క తమది అనుకున్న రాజధాని కలల సౌథం కూలిపోతోంది. ఇలా అన్ని విధాలా రివర్స్ లో తామే అష్ట దిగ్బంధనం అయిపోతున్న వేళ కరొనా కల్లోలం వచ్చి పడింది. రాష్ట్రంలో మెజారిటీ వ్యాపారాలు గుప్పిట్లో పెట్టుకున్న తెలుగుదేశం అనుకూల వర్గం మరింత చిక్కుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఆ పార్టీకి వెన్నుదన్నుగా, ఆక్సిజన్ గా వున్న మీడియా కూడా తీవ్ర సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం కనిపించింది.

గతంలో అయదేళ్ల పాటు వందల కోట్లు ప్రకటనల రూపంలో దండుకున్న సదరు మీడియా ఇప్పడు నష్టాల పాలు కావడం కాదు, ఏకంగా మూతపడే పరిస్థితి కనిపించింది. ఇలాంటి టైమ్ లో కరోనా అనేది రెండు విధాల కనిపించింది.

ఒకటి జగన్ ప్రభుత్వాన్ని వీలయినంత అపఖ్యాతి పాలు చేసేందుకు అందివచ్చిన అవకాశం.

రెండవది వీలయితే జనాల్లో పలుచన చేసి, భవిష్యత్ లో ఏదైనా విపరీత పరిణామం సంభవిస్తే, జగన్ కు సానుభూతి లేకుండా చేయగలిగే బ్రహ్మాస్త్రం.

అందుకే అసలు సిసలు రాజకీయం ప్రారంభమైపోయింది ఆంధ్రదేశంలో.

ఒకే ఒక్క రాష్ట్రం

కరోనా టైమ్ లో రాజకీయాలు వినిపించే రాష్ట్రం, రాజకీయాలు కనిపించే పత్రికలు ఎక్కడ వున్నాయి అంటే అది ఆంధ్రలోనే. రాజకీయం చేసే ప్రతిపక్షం ఎక్కడ వుందీ అంటే ఆంధ్రలోనే. దేశంలోని మరే చోటా లేని విచిత్ర, విపరీత పరిస్థితి ఇది. దేశంలో ప్రతి చోటా ప్రతిపక్షాలు దాదాపు మౌనంగా వున్నాయి. కొన్ని చోట్ల సలహాలు ఇస్తే ఇస్తున్నాయి. లేదంటే అది లేదు. ఇలా చేయండి అని చెబుతున్నాయి తప్ప, నానా యాగీ చేయడం లేదు. కేవలం ఆంధ్రలో మాత్రమే నిత్యం ఇటు కుల మీడియా అటు ప్రతిపక్షం కలిసి కిందా మీదా అయిపోతున్నాయి.

చిత్రమేమిటంటే ప్రతిపక్ష నాయకులు అంతా ఇంట్లోనే వున్నారు. పూర్తిగా ఖాళీగా వుండడంతో, లేఖలు రాయడం, ట్వీట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆరంభంలో సరిగ్గా ఎదుర్కోవడం లేదన్నారు. తరువాత కేసులు దాస్తున్నారు అన్నారు. ఆపైన కేసులు ఎక్కువయ్యాయన్నారు. ఇప్పుడు చావులు దాస్తున్నారంటున్నారు. అసలు చావులు ఎక్కువ వుండాలి అని కోరుకునే ప్రతిపక్షం, మీడియా ఇదేనేమో?

మాటకారితనం

పక్క తెలుగు రాష్ట్రంలో ఒక్క ప్రెస్ మీట్ తో మీడియా నోటికి తాళాలు వేసారు అక్కడి సిఎమ్. దెబ్బకి కిక్కురుమనలేదు. మాట పెగలడం లేదు. అక్షరం కదలడం లేదు. ఇధే విధంగా జగన్ ఆంధ్రలో మాట్లాడి వుంటే, ఇదే విధంగా మీడియాను హెచ్చరించి వుంటే పరిస్థితి ఎలా వుండేది? ఏమయ్యేది? జగన్ మీద మొత్తం ప్రతిపక్షం, మీడియా విరుచుకుపడిపోయి వుండేవారు. కానీ తెలంగాణలో కేసిఆర్ కు వ్యతిరేకంగా ఒక్కరు మాట్లాడగలిగారా? ఎక్కడో గొణుగుళ్లు సణుగుళ్లు వినిపించినా, అక్కడి మీడియాలో కనిపించిందా? అదే తేడా.

జగన్ కరోనా విషయంలో మాట్లాడిన తీరు లో తేడా వుండి వుండొచ్చు. జనాల భయపడకుండా ధైర్యం చెప్పే విధంగా మాట్లాడడంలో జగన్ తడబడి వుండొచ్చు. ఫన్నీగా వుండొచ్చు. అంతమాత్రం చేత ఆంధ్రలో కరోనాను లైట్ తీసుకోలేదన్నది వాస్తవం. అలా లైట్ తీసుకుని వుంటే జనంలో జోక్ లు పేలేవి కాదు. భయం కనిపించేది. ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, మన బతుకులు ఏమవుతాయో అన్న భయం కనిపించేది.

ఇప్పుడు హ్యాపీగా ఉదయం ఆరు నుంచి పది లేదా పదకొండు గంటల వరకు సిటీ లిమిట్స్ లో తిరిగేస్తున్నారు. కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఎటొచ్చీ పనులు చేసుకోవడానికి వీలు కావడం లేదు. దానికి ప్రభుత్వం బాధ్యత ఏముంది? విశ్వవ్యాప్తంగా వచ్చిపడిన సమస్య. కనీసం జనాలు చచ్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.

ముందు టెన్షన్

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా అంకెలు చూసి జనం కలవరపడ్డారు. ప్రభుత్వాలు జాగ్రత్త పడ్డాయి. వేలకు వేలు కేసులు వచ్చి పడతాయని డిసైడ్ అయిపోయారు. సెకండరీ కాంట్రాక్టు, లోకల్ కాంట్రాక్ట్ కేసులు ఇబ్బడిముబ్బడి అవుతాయనుకున్నారు. కానీ ఆరేడు కోట్ల జనాభాకు రెండు వేలకు లోగా పాజిటివ్ కేసులు అంటే అది జనం చేసుకున్న అదృష్టం. సమయానికి ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్త ఫలితం. అప్పటికీ  ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా నియోజకవర్గాలనికి వెయ్యి పడకలు రెడీ చేసాయి. క్వారంటైన్ వార్డుల కింద. కానీ అంత ప్రమాదం ముంచుకు రాలేదు.

ఇదే ప్రతిపక్షానికి, కులబంధాల మీడియాకు మింగుడు పడడం లేదు. అందుకే ఏదో విధంగా రంధ్రాన్వేషణ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏదో విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మూట కట్టడానికి కిందా మీదా అవుతోంది.

ఖాళీ టైమ్ దొరికింది

ఇలాంటి టైమ్ లో జనాలకు కూడా ఖాళీ టైమ్ ఇబ్బడి ముబ్బడిగా దొరికింది. టెన్షన్ పడాల్సిన పని లేదు. సరుకులు అన్నీ దొరుకుతున్నాయి. రేట్లు మామూలుగానే వున్నాయి. పనులు లేవు. ఇంట్లో ఖాళీగా వుండి ఈ మీడియా మాటలు నమ్మి, సోషల్ మీడియాను తమ చమత్కారంతో నింపుతున్నారు.

కరోనా అంటే భయంపోయింది. కామెడీ అయిపోయింది. జోకులు, మీమ్ లు, వాట్సాప్ పోస్ట్ లు ఇలా ఒకటేమిటి. అంతా వినోదమే. కానీ ఇదే వినోదం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ భవిష్యత్ భయంగా కనిపిస్తోంది. ఐటి ఏమవుతుందో? ఉద్యోగాలు ఏమవుతాయో? కరోనా కాగానే ఖర్చులు చుట్టుముడతాయన్న భయం కనిపిస్తోంది. కానీ ఆంధ్రలో మాత్రం ఆ భయం స్థానంలో సరదా సందడులు జోకులు పేలుతున్నాయి. దీనికి లీడ్ ఇస్తున్నది మన ప్రతిపక్షం, దానితో చెట్టపట్టాలు వేసిన మన మీడియా.

కేసులు-పరిక్షలు

రాపిడ్ టెస్టింగ్ కిట్ లు రాక ముందు వరకు ఆంధ్రలో కేసులు అంతగా లేవు. వన్స్ టెస్టింగ్ కిట్ లు వచ్చాక ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. వందకు సగటున ఒకటి లేదా రెండు కేసుల వంతున వస్తున్నాయి. కానీ అదే సమయంలో తెలంగాణలో పరిక్షలు చేయడం తగ్గిపోయింది. ప్రభుత్వమే ఈ విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాం అని చెబుతోంది తప్ప, రాపిడ్ టెస్ట్ లు చేస్తాం అనడం లేదు. ఆంధ్రలో మాత్రం రోజుకు ఆరేడువేల పరిక్షలు చేస్తున్నారు. ఈ విషయాన్ని వేరే విధంగా జనాలకు చేరవేస్తోంది మీడియా.

తెలంగాణ లాటరీ

నిజానికి ఇదంతా లాటరీ. తెలంగాణ ప్రభుత్వం నెలన్నర లాక్ డౌన్ అయిపోతోంది. వుండే కేసులు వుంటే అవే బయటకు వస్తాయి. ట్రీట్ మెంట్ చేసేయచ్చు. అనవసరంగా టెస్ట్ లు చేసి, నెంబర్లు చెప్పి, కోరి ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వడం అన్న ధోరణిలో వ్యవహరిస్తోంది. కానీ ఇది పక్కాగా లాటరీ.

లాక్ డౌన్ ఎత్తేసే వేళకు సెకండరీ కాంట్రాక్టులు ఎవైనా బయటకు రాకుండా మిగిలిపోతే, మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం వుంది. జనం  దైర్యంగా తిరగడానికి కూడా భయపడతారు. అలాంటి సెకండరీ కాంట్రాక్టులు లేకుండా వుంటే ప్రభుత్వం ధైర్యంగా వుండొచ్చు. తమ ఘనతే అని చెప్పుకోవచ్చు.

మొత్తం మీద ఆంధ్రలో మితిమీరిన రాజకీయం, తెలంగాణలో ముకుతాడు వేసిన వైనం క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒక చోట ప్రతిపక్షం చెలరేగుతోంది. దానికి కుల మీడియా అండగా వుంది. మరోచోట అదే మీడియాకు ముకుతాడు పడింది. ప్రతిపక్షం వాయిస్ కూడా వినిపించకుండా పోయింది.

చిత్రం కదా?

-చాణక్య
[email protected]