మ‌త విద్వేషానికి ఆర్కే ఆజ్యం

‘కరోనా కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో ముస్లింలు, హిందువులకు మధ్య అపోహలు, అపార్థాలు చోటుచేసుకున్నాయి. ముస్లింల కారణంగానే దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న అభిప్రాయాన్ని హిందువులలో వ్యాపింపజేశారు. ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోదీ…

‘కరోనా కారణంగా దేశంలోని పలు ప్రాంతాలలో ముస్లింలు, హిందువులకు మధ్య అపోహలు, అపార్థాలు చోటుచేసుకున్నాయి. ముస్లింల కారణంగానే దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న అభిప్రాయాన్ని హిందువులలో వ్యాపింపజేశారు. ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా లాభిస్తుంది’

ఒక వైపు క‌రోనా ముస్లింలు, హిందువుల‌కు మ‌ధ్య అపోహ‌లు, అపార్థాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చెబుతూనే, మ‌రోవైపు వాళ్ల మ‌ధ్య విద్వేషాన్ని రెచ్చేగొట్టే వాళ్ల‌ను ఏమ‌నాలి? ఆర్కే అని పిల‌వాలేమో! ఆర్కే రాత‌లు తెలుగు స‌మాజంలో మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండైనా మందు క‌నుక్కుంటారు. కానీ క‌మ్యూన‌ల్ వైర‌స్‌కు ఎవ‌రూ మందు క‌నుక్కోలేరు. అపార్థాల‌ను తొల‌గించేలా జ‌ర్న‌లిజం ఉండాలే త‌ప్ప‌, వాటికి మ‌రింత ఆజ్యం పోసే రాత‌లు, చేష్ట‌లు స‌మాజానికి ఎంత మాత్రం మంచిది కాదు.

ఈ వారం ఆర్కే ‘కరోనా కళ్లు తెరిపించేనా?’ శీర్షిక‌తో రాసిన కొత్త ప‌లుకు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంది. ఆర్కే రాసిన ప్ర‌తి అక్ష‌రం వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. ముస్లిం మ‌తాన్ని కేంద్రంగా చేసుకుని ఆయ‌న రాసిన రాత‌లు, ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌ను టార్గెట్ చేయ‌డ‌మే. మ‌రోవైపు ముస్లింలంటే అంటరాని వారిగా చూస్తున్న బీజేపీకి మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డానికి క‌రోనా క‌లిసొచ్చిన గొప్ప అవ‌కాశంగా ఆర్కే భావిస్తున్న‌ట్టుంది.

స‌హ‌జంగా నిజానిజాలు ఏమైన‌ప్ప‌టికీ మతం కోణాన్ని బ‌హిరంగంగా రాయ‌డంలో మీడియా స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డాన్ని ఇంత కాలం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ల‌క్ష్మ‌ణ రేఖ‌ను  తెలుగు జ‌ర్న‌లిస్టు చెద‌పురుగు ఆర్కే దాటేశాడు. స‌మాజం, ముస్లింల జీవితాలు త‌న‌కు ముఖ్యం కాద‌ని త‌న రాత‌ల‌తో తేల్చి చెప్పాడు. కేసీఆర్‌, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిల‌ను దెబ్బ‌కొట్ట‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పాడు.

తెలంగాణ‌లో కేసీఆర్‌, ఆంధ్రాలో జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ముస్లింలు అండ‌గా నిలుస్తున్నారు. వాళ్లిద్ద‌రూ అధికారంలోకి రావ‌డానికి ముస్లింల ఓట్లు క్రియాశీల‌క పాత్ర పోషించాయి. వివిధ కార‌ణాల రీత్యా భ‌విష్య‌త్‌లో కూడా కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌కు ముస్లిం ఓట‌ర్లు అండ‌గా నిలిచే అవ‌కాశాలే ఎక్కువ‌. ప్ర‌స్తుత క‌రోనా వ్యాప్తికి ముస్లింలే కార‌ణ‌మ‌నే మెసేజ్‌ను స‌మాజంలోకి బ‌లంగా చొప్పించ‌డం ద్వారా ముస్లిం వ‌ర్సెస్ నాన్ ముస్లిం అనే విభ‌జ‌న తీసుకొచ్చి రాజ‌కీయంగా ఇద్ద‌రు నేత‌ల‌ను అణ‌గ‌దొక్కాల‌నే రాజ‌కీయ కుట్ర ఆర్కే కొత్త ప‌లుకులో ప్ర‌తిబింబించింది.

‘దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మర్కజ్‌ సమావేశానికి వెళ్లినవారు స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చారు. దీంతో ఈ మహమ్మారి ఒక్కసారిగా జూలు విదిల్చింది. మర్కజ్‌ సమావేశానికి ఇండోనేషియా, ఇరాన్‌ తదితర దేశాల నుంచి వచ్చినవారు హాజరవ్వడంతో మనవాళ్లకు కరోనా వ్యాపించింది. వీళ్లు స్వరాష్ట్రానికి చేరుకుని ఈ వైరస్‌ని వ్యాప్తి చేశారు’…అని ఆర్కే నిర్ధారించ‌డం వెనుక బీజేపీ, ఆర్కే ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు స్ప‌ష్టంగా క‌ళ్ల‌కు క‌ట్టాయి.

‘కరోనా నివారణకు ప్రధాని తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సానుకూల ధృక్పథంతోనే ఉన్నారు. ఈ కారణంగానే ఈనెల 5వ తేదీన ఇళ్లల్లో లైట్లు ఆర్పివేసి, బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ప్రజలు స్పందించారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో మాత్రం ఈ పిలుపును పెద్దగా పట్టించుకోలేదు. నరేంద్ర మోదీ దేశానికే ప్రధాని అన్న విషయాన్ని విస్మరించకూడదు. అయినా ఇలాంటి ధోరణుల వల్ల ప్రజల మధ్య అంతరం మరింత పెరిగి, అంతిమంగా భారతీయ జనతా పార్టీకే ప్రయోజనం చేకూరుతుంది’…ఇలాంటి రాత‌లు హిందూ, ముస్లింల మ‌ధ్య మ‌రింత అంత‌రాన్ని పెంచ‌వా?  

ఢిల్లీలో మ‌ర్క‌జ్ తబ్లీగి జమాత్ జ‌రిపిన ప్రార్థ‌న‌ల వ‌ల్ల క‌రోనా వ్యాప్తి విస్తృతమైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే త‌బ్లీగి జ‌మాత్ సిద్ధాంతాల‌తో ఏ మాత్రం ఏకీభవించని ముస్లింలు ఉన్నార‌ని ఆర్కేకు తెలుసా? త‌బ్లీగీని షియాలు, సున్నీలు, బరెల్విలు, ఎహ్ల్ హదీస్, వహాబీలు వ్య‌తిరేకిస్తారు. ఆర్కేలాంటి బాధ్య‌తా ర‌హిత రాత‌లు నిజ‌మేన‌ని నమ్మే  సామాన్య ప్రజలు ముస్లింలు అమ్మే వ‌స్తువుల‌ను బహిష్కరిస్తున్నారు. అంతేకాదు ముస్లింలను తిడుతున్నారు, కొన్ని చోట్ల కొడుతున్నారు.

క‌రోనా వ్యాప్తికి ఏ మాత్రం సంబంధం లేని ముస్లింల‌కు ఈ శిక్ష ఏంటి? కరోనా వ్యాప్తిని మత కోణంలో చూడకూడదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పడం కూడా ఆర్కేకు ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు.  మ‌హ‌మ్మారిని మ‌తం కోణంలో చూసి ఉంటే ఈ రోజు వెల్ల‌డైన కేసుల్లో ఎక్కువ‌గా మ‌ర్క‌జ్‌తో లింక్ ఉన్న‌వ‌ని ప్ర‌భుత్వాలు ఎలా చెబుతాయ్‌?  

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రికార్డు కాక‌పోవ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాద‌ని ఆర్కే అంటున్నాడు. ఆ రెండు జిల్లాల్లో ముస్లింలు అతి త‌క్కువ‌గా ఉండ‌టం, మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చిన వారు ఇద్ద‌రు ముగ్గురికి మించి లేక‌పోవ‌డం, ఆర్థిక వెనుక‌బాటుత‌న, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వాళ్లు కూడా పెద్ద‌గా లేర‌ని ఆర్కే చెప్పుకొచ్చారు. అంటే క‌రోనా వ్యాప్తి వెనుక ఇన్ని అంశాలు ముడిప‌డి ఉంటాయ‌న్న మాట‌. మ‌రి ఇదే క‌లం సుయోధ‌నుడు మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చిన వాళ్ల వ‌ల్లే తెలుగు స‌మాజం పూర్తిగా క‌రోనాతో క‌మ్మేస్తోంద‌ని ఎలా రాశాడు?

ముస్లింల వ‌ల్లే క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌నే అనుమానం రేకెత్తించే రాత‌లు బాధ్య‌త గ‌ల జ‌ర్న‌లిజం అనిపించుకుంటుందా? క‌రోనా ఒక మ‌తానికో, కులానికో సంబంధించిన వైర‌స్ అయితే మ‌రి అమెరికా, ఇట‌లీ, స్పెయిన్‌, బ్రిట‌న్‌, చైనా దేశాల్లో సృష్టిస్తున్న విధ్వంసం మాటేమిటి? 

కేసీఆర్‌, జ‌గ‌న్‌లను క‌ట్ట‌డి చేయ‌డానికి, బీజేపీ అంట‌కాగ‌డానికి ద‌య‌చేసి క‌రోనాను మాత్రం అవ‌కాశంగా తీసుకోవ‌ద్ద‌ని ఆర్కేకు చేతులెత్తి  వేడుకుంటున్నాం. ఎందుకంటే మ‌నుషులుగా మ‌నమెవ‌ర‌మూ కూడా శాశ్వ‌తం కాదు. కానీ మ‌నం ఈ క్షేత్రంలో ప్రేమానురాగాల విత్త‌నాలు నాటితే అవి పెరిగి పెద్ద‌వై మ‌హావృక్షాలుగా ప‌ది మందికి ఆ ఫ‌లాల‌ను అందిస్తాయి. ఒక‌వేళ విద్వేష విత్త‌నాలు వేస్తే…అవే ఫ‌లాలు మ‌న భ‌విష్య‌త్ త‌రాల‌కు ద‌క్కుతాయి. కావున తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం మ‌త విద్వేష రాత‌ల‌ను ఆర్కేనే కాదు ఎవ‌రు రాసినా త‌ప్పే. ప్ర‌స్తుతం విప‌త్తు నుంచి బ‌య‌టప‌డే మార్గాల‌ను అన్వేషించాలి.

చివ‌రిగా ఆర్కే మాట‌ల‌తోనే ముగిస్తా. మానవాళి వినాశనానికి మ‌త‌మ‌నే విద్వేషాన్ని అభివృద్ధి చేసే జ‌ర్న‌లిజం మానవత్వం కాజాలదు! ఎందుకంటే క‌మ్యూన‌ల్ వైర‌స్‌ను వ్యాప్తి చేసేలా ఆర్కే రాత‌లున్నాయి. క‌నీసం క‌రోనాతో అయినా ఆర్కే క‌ళ్లు తెరిస్తే…ఆయ‌న‌తో పాటు స‌మాజానికీ మంచిది.

సొదుం