వాళ్ళు చెప్పారు సరే… ఈ పని సాధ్యమా ..?

ప్రపంచమంతా ఎక్కడ చూసినా కరోనా ముచ్చట్లే. కరోనా ఎలా పుట్టిందనే  ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తున్నాయి. అనేకమైన పరిశోధనలు, అధ్యయనాలు సాగుతున్నాయి. గబ్బిలాల ద్వారా వస్తుందని ఒకరంటే, కాదు కుక్కల ద్వారా వస్తుందని పరిశోధనల్లో…

ప్రపంచమంతా ఎక్కడ చూసినా కరోనా ముచ్చట్లే. కరోనా ఎలా పుట్టిందనే  ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తున్నాయి. అనేకమైన పరిశోధనలు, అధ్యయనాలు సాగుతున్నాయి. గబ్బిలాల ద్వారా వస్తుందని ఒకరంటే, కాదు కుక్కల ద్వారా వస్తుందని పరిశోధనల్లో తేలిందని మరొకరు అంటున్నారు.

త్వరలోనే కరోనా మాయమైపోతుందని ఒకరంటే, కాదు మరో రెండేళ్లు పీడిస్తోందని మరొకరు అంటున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి. లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో కరోనా ఇంకా రెండేళ్లపాటు కొనసాగుతుందని చెప్పారు.

ఈ వైరస్ అంత తొందరగా వదిలేదికాదని, కొన్నాళ్ల తరువాత అది అణిగిపోయినట్లు కనబడినా దాని మూలాలు ఎక్కడో ఒకచోట ఉంటాయి కాబట్టి మళ్ళీ విజృంభిస్తుందని చెప్పారు. ఇక దీనికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు.

కొందరు ఏడాది పడుతుందంటే, కొందరు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుందని అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే మళ్ళీ యథా ప్రకారం జనం వ్యవహరిస్తారు కాబట్టి, కాలుష్యం పెరుగుతుంది కాబట్టి, మళ్ళీ రైళ్లలో, బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తారు కాబట్టి, మళ్ళీ మతపరమైన ఉత్సవాల్లో గుంపులుగా పాల్గొంటారు కాబట్టి కరోనా అదును చూసి కాటేస్తుందని కొందరు చెబుతున్నారు.

ఇలా ఎన్నో వాదనలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో అభిప్రాయాలు. ఎప్పుడో ఏదో అవుతుందని ఎల్లకాలం లాక్ డౌన్ ఉంచలేరు కదా. బస్సులు, రైళ్లు, విమానాలు నడపకుండా ఉండలేరు కదా. షాపులు, విద్యా సంస్థలు తెరవకుండా ఉండలేరు కదా.

కాబట్టి లాక్ డౌన్ ముందుగా కొన్ని నిబంధనలతో ఎత్తేస్తారు. అది కొన్నాళ్ళు కొనసాగాక పూర్తిగా ఎత్తేస్తారు. మళ్ళీ నగరాలు జనసంద్రాలు కాక తప్పదు. ఇది సహజం. ప్రస్తుతం చాలా చోట్ల లాక్ డౌన్ నిబంధనలు పాటించడంలేదు.

నిన్న తెలంగాణా ప్రభుత్వం పేదల ఖాతాల్లో 1500 రూపాయలు వేస్తే బాంకుల్లో జనం గుంపులుగా చేరారు. ఇక మొత్తం లాక్ డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్క మన దేశంలోనే కాదు. అన్ని దేశాల్లోనూ ఇలాగే ఉంటుంది.

ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారా అని జనం ఎదురు చూస్తున్న నేపథ్యంలో లండన్ శాత్రవేత్తలు ఓ కబురు చెప్పారు. ఇది మంచి కబురు కాదు, చావు కబురే. కరోనా ప్రభావం మరో రెండేళ్లవరకు ఉంటుందట. జిడ్డులాగా పట్టుకొని పీడిస్తుందట. 

అందుకని 2022 వరకు భౌతిక దూరం అంటే సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనన్నారు. అలా చేయకపోతే భయంకరంగా విజృంభిస్తుందట. వేసవిలో కరోనా వైరస్ తగ్గుతుందనే మాట నిజం కాదన్నారు. కరోనాకు మందు కనుక్కోకపోతే 2025 నాటికి మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని లండన్ శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణించారు. 

వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా కరోనా గురించి ఎవరేమి చెప్పినా వినాల్సిందే. కానీ 2022 వరకు సామాజిక దూరం పాటించడం సాధ్యమా ? అలా చేయాలంటే ఏ సౌకర్యాలు లేని, జనసంచారం తక్కువగా ఉన్న మారుమూల పల్లెటూళ్లకు వెళ్లిపోవాల్సిందే. పల్లెటూళ్ళ వారే పట్నాలకు చేరుతుంటే పట్నాలవారు పల్లెకు పోదాం చలో చలో అని వెళ్ళిపోతారా ? 

నీ మనవడు దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చేర్పించు