చంద్రబాబు అధికారంలోకి వస్తే …ఆయనతో పాటు కరవు కూడా వస్తుందనే వాళ్లు. అందుకే బాబు పాలనలో రైతులు పంటలు పండక అల్లాడే వాళ్లు. బాబు అధికారంలోకి వస్తే పంటలు పండవని, కరవులు తప్పవనే సెంటిమెంట్ బలపడింది. బాబు, కరవు కవల పిల్లలని ప్రతిపక్షాలు విమర్శించే వాళ్లు. అదే వైఎస్సార్ అధికారంలో ఉన్నన్నాళ్లు సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ఒక సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు వరుణ దేవుడు తమ పార్టీ (కాంగ్రెస్)లో చేరారని చమత్కరించారు.
తాజాగా కరోనా, బాబు కవలలనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్‌ను తన పాలనానుభవంతో ఉద్దరిస్తాడనే నమ్మకంతో ప్రజలు అధికారం అప్పగిస్తే…తనతో పాటు సొంత పార్టీ నేతలు, జేబులో మనుషులుగా పేరున్న పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టాడు. అధికారం నుంచి దిగిపోతూ రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మిగిల్చాడు. అంతే కాదు రాష్ట్రానికి మోయలేని అప్పుల భారం దాదాపు రూ.3 లక్షల కోట్లు మిగిల్చాడు.
ప్రజలు ప్రతిపక్షంలో కూచోపెట్టిన తర్వాతైనా చంద్రబాబు మౌనందాల్చి రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నాడా అంటే…ఎంత మాత్రం లేదనే చెప్పాలి. కొన్ని వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి ఉపయోగించి ఏపీ అభివృద్ధికి చంద్రబాబు అడ్డు తగులుతూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద, దళిత, అణగారిన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ చదువు అందించాలన్న ఆశయానికి అమానవీయంగా అడ్డుపడ్డాడు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఈ పోటీ ప్రపంచంతో తలపడేందుకు ఇంగ్లీష్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న ఆశలను బాబు మొగ్గ దశలోనే తుంచేశారు.
మనిషి కనీస అవసరాలు ఉండటానికి ఇల్లు, కట్టడానికి బట్ట, తినడానికి తిండి అని అంటారు. ఏపీ సీఎం జగన్ ఉన్నతాశయంతో దళితులు, వెనుకబడిన కులాల వారికి రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాలను పంపిణీ చేసేందుకు సంకల్పించాడు. అందుకు తగ్గ కార్యాచరణ కూడా జగన్ సర్కార్ రూపొందించింది. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం వల్ల జగన్ సర్కార్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయం, తన సామాజిక వర్గం ఉన్న చోట బడుగులకు ఎట్టి పరిస్థితుల్లో స్థానం కల్పించకూడదనే వివక్ష…అన్నీ కలిసి వాళ్లను రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదలతో అన్నంత పని చేశాడు చంద్రబాబు.
తన అమరావతిలో, తన సామాజిక వర్గ సామ్రాజ్యంలో దళితులు, గిరిజనులు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన కులాల ఉనికినే బాబు భరించలేకపోయాడు. ఏ విధంగానైతే ఇంగ్లీష్ మీడియం చదువును దూరం చేశాడో…అదే విధంగా అంతకు ముందు సెంటు నివాస స్థలాన్ని కూడా వాళ్లకు దక్కకుండా చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నాడు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టడం చంద్రబాబుకు నచ్చలేదు. అమరావతిలో తన వాళ్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్వర్గధామంగా మలిచిన అమరావతి నుంచి మరో రెండు రాజధానులు ఆవిర్భవించడం చంద్రబాబు తట్టుకోలేకపోయాడు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులకు మండలిలో అన్యాయంగా సైంధవుడిలా అడ్డు నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష నేతగా అడుగడుగునా బాబు అడ్డు తగులుతూనే ఉన్నాడు.
కరోనా వైరస్ కంటికి కనిపించకుండా ప్రపంచాన్నే విధ్వంసం చేస్తోంది. కరోనాకు చంద్రబాబుకు దగ్గరి పోలికలున్నాయనే వాదన నిజమేననిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు కూడా సమాజ వినాశనానికే పనిచేస్తున్నాడు. బాబు మనసు వందలాది కరోనా వైరస్‌లతో నిండి ఉంది. ఆయన ఆలోచనలు ఎప్పుడూ తిరోగమనం వైపే ఉంటాయి. ఎందుకనో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలంటే ఇటీవల కాలంలో ఆయనకు ఎంత మాత్రం గిట్టడం లేదు.
బాబు స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలంటే అతని 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని తవ్వాల్సిన అవసరం లేదు. దళితులకు, గిరిజనులకు, బీసీలకు రాజధాని ప్రాంతంలో నివాస స్థలాలు, అలాగే వాళ్ల పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలనే ప్రభుత్వ ఆశయాన్ని అడ్డుకున్న తీరే అనేక వాస్తవాలను చెబుతోంది. కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకారి అని చెప్పడానికి ఇంత కంటే ఉదాహరణలు ఏం కావాలి? కరోనా, బాబు కవల పిల్లలనే ప్రచారంలో అబద్ధం ఏముంది?
తన ఓటమికి కారకులైన ఆ కులాల అంతు చూసేందుకు ఆయన ప్రతినబూనాడు. అందుకే వాళ్ల అభివృద్ధికి జగన్ సర్కార్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకానికి ఏదో రకంగా బాబు అడ్డు తగులుతూనే ఉన్నాడు. కరోనా వైరస్ వలే బాబు దుర్మార్గాలు కంటికి కనిపించవు. కానీ వాటి దుష్పలితాలు మాత్రం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే కరోనా, బాబు కవలలనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీన్ని కాదనేదెవరు?
-సొదుం