ఎంత గొప్ప మాట. ఆ చెప్పింది ఏ తత్వవేత్తో, రాజనీతిజ్ఞుడో కాదు. సుమతి శతకంలోనో, వేమన శతకంలో వల్లించిన సూక్తో కాదు. వజ్రంలాంటి మాట పలికిన ఆ గొప్ప వ్యక్తి బాలీవుడ్ అగ్ర హీరోయిన్. ఆమె అపురూప సౌందర్యం కంటే ఆమె సమాజానికి ఇచ్చిన సందేశాత్మక హితవు ఎంతో గొప్పది. సువర్ణాక్షరాలతో రాయదగ్గది. కరోనా సంక్షోభం నుంచి ఆవిర్భవించిన అమూల్యమైన సూక్తి రత్నావళి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే చందానా…ఆమె చెప్పిన ఆ మాటే మంత్రంగా పనిచేసి జీవితాన్ని మార్చుకునే వారు ఉండరని ఎవరు చెప్పగలరు. అందుకే వజ్రం లాంటి ఆ మాట గురించి తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి ఎంతో మందికి ఆకలిదప్పులు మిగిల్చింది. అయితే మనుషులే కాదు…పశుపక్ష్యాదులు కూడా ప్రాణులని గుర్తించడమే కాదు…వాటికి ఆకలిదప్పులుంటాయని గుర్తించి , వాటిని తీర్చాలని భావించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఒకరు. లాక్‌డౌన్ కారణంగా ఆహారం లభించక అలమటించే జంతువుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థకు శ్రద్ధాకపూర్ విరాళం అందించారు.
బాలీవుడ్ హీరోయిన్ దాతృత్వానికి ముగ్ధులైన సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు స్పందిస్తూ…మీరు మూగ జీవాల కోసం గొప్ప సహాయం చేశారంటూ ట్వీటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
అయితే మూగజీవాలకు సాయం చేయడం వెనుక శ్రద్ధా కపూర్ మానవీయ కోణం అబ్బురపరుస్తుంది. ఇతరుల బాధ ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే తప్ప తెలియదని, మనతో పాటు ఈ భూమ్మీద జీవిస్తున్న ప్రాణులపై సానుభూతి చూపడంతో పాటు జీవించేలా చేయాలని ఆమె కోరారు. మూగజీవాలపై ఆమె మమతానురాగాలు చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఇంకా ఆమె మనసు ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే ఈ మాటలు కూడా విందాం.
“భూమ్మీద చాలా జీవులు జీవితాంతం ఒంటరిగానే బతుకుతున్నాయి. ఆ బాధతో స్వయంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నాయి. ఏ జీవి నిర్బంధంలో బతకకూడదు. మనం భూమ్మీదకు వచ్చిన అతిథులం మాత్రమే…యజమానులం ఎంత మాత్రం కాదు” అని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఒంటరి జంతువుల ఫొటోను ఎర్త్ వెబ్‌సైట్ నుంచి తీసుకుని రీపోస్ట్ చేశారామె. మనుషుల గురించి ఆలోచించే వాళ్లే కరువైన కరోనా కాలంలో…మూగ ప్రాణుల గురించి ఆలోచిస్తున్న శ్రద్ధాకపూర్‌ను తప్పక అభినందించాల్సిందే.