క్వారంటైన్ సెంటర్ నుంచి కోలుకుని బైటకు వచ్చే ప్రతి పేదవారికీ 2వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అధికారులు, మంత్రులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ అదనపు భారం ఎందుకని కొన్నివర్గాల వాదన.
క్వారంటైన్ సెంటర్లలో ఉన్న అనుమానితుల ఆహారం, వసతి కోసం ఇప్పటికే ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. దీనికి తోడు.. ఈ ఆర్థిక సాయం ఎందుకని అంటున్నారు కొంతమంది. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన వేళ, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతంలో కోతలు పెడుతున్న కష్టకాలంలో ఇది అదనపు భారం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే సీఎం జగన్ ప్రకటించిన సాయంపై కొంతమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది కరోనా భయంతో ఇళ్లలోనే కాలం గడిపేస్తున్నారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలున్నా కూడా ధైర్యంగా బైటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. వీరందరికీ భరోసా ఇస్తూ, వారే స్వచ్ఛందంగా బైటకు వచ్చేలా చేయాలంటే ఆమాత్రం ఆర్థిక భరోసా ఇవ్వడంలో తప్పేంలేదు. క్వారంటైన్ సెంటర్లలో అందే వసతి సౌకర్యాలపై చేస్తున్న ప్రచారం కూడా దీనిలో భాగమే.
కరోనా లక్షణాలున్నా కూడా ఆస్పత్రులకు వెళ్లడానికి ముందూ వెనకాడుతున్న చాలామంది ప్రభుత్వ నిర్ణయంతో బైటకొచ్చే అవకాశముంది. తాను పనిచేస్తేనే ఇళ్లు గడిచే పరిస్థితుల్లో ఓ కుటుంబ పెద్ద క్వారంటైన్ సెంటర్లలో 14 రోజులు ఎందుకుంటారు. కుటుంబానికి పెద్ద దిక్కు ఆస్పత్రిలో ఉంటే.. కుటుంబ సభ్యులకు దిక్కెవరు. ఇలాంటి సమస్యలన్నీ ఆలోచించే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ వర్గం ప్రశంసిస్తోంది.
క్వారంటైన్ సెంటర్లలో మంచి భోజనం, వసతి సౌకర్యంతో పాటు.. కోలుకున్న తర్వాత తిరిగి బైటకొచ్చే సమయంలో 2వేల రూపాయల ఆర్థిక భరోసా కూడా లభిస్తుందంటే.. పేదవారు భయపడకుండా ధైర్యంగా పరీక్షలు చేయించుకోడానికి ముందుకొస్తారు. అనారోగ్యంతో కుంగిపోకుండా, కరోనా వ్యాప్తికి పరోక్ష కారణం కాకుండా ఉంటారు. అందుకే ఏపీ సీఎం జగన్ ఇలాంటి సాహసోపేతమై నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక కష్టాలున్నా కూడా అన్నీ ఆలోచించే ఈ ముందడుగేశారు.