ప్చ్…నోరెత్తడానికి వీల్లేదు. భార్యల్లో కరోనా ఓ విప్లవాన్ని తీసుకొస్తోంది. తిరుగుబాటుదారులుగా తయారు చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొగుళ్లకే మొగుళ్లలా భార్యలను తీర్చిదిద్దుతోంది. ఇంతకూ ఈ పెళ్లాం, మొగుడు గోలేందంటారా? కరోనా వైద్య పరీక్షలు చేయించుకునేంత వరకు మొగున్ని ఇంట్లోకి రానివ్వని ఓ భార్య గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తి నెల్లూరులో బంగారు దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్‌డౌన్ విధించడంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో సొంత జిల్లాలోనే నెల్లూరు నగరం నుంచి స్వస్థలమైన వెంకటగిరికి వెళ్లేందుకు అతనికి సాధ్యం కాలేదు. కొన్ని రోజుల తర్వాత భార్యాపిల్లల్ని చూసేందుకు నానా తిప్పలు పడి అతను వెంకటగిరి వెళ్లాడు.
నెల్లూరు నుంచి అనేక అడ్డంకులు తప్పించుకుని ఇంటికి చేరుకున్న అతనికి భార్య షాక్ ఇచ్చింది. భర్తను గడప దాటి ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. అతను ఎంతో ప్రాథేయపడినా కుదరదే కుదరదని తేల్చి చెప్పారామె.
ముందు తనకు పిల్లలు, ఊరు, ఆ తర్వాతే భర్త అని ఆమె తెగేసి చెప్పింది. వెంటనే నెల్లూరు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని కొవిడ్-17 లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలని భార్య ఆదేశించింది. తానిప్పుడు ఉన్నట్టుండి ఎక్కడికి పోవాలని భర్త దయనీయంగా ప్రశ్నించగా…సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉండాలని సలహా ఇచ్చింది. అలాగే వలంటీర్లకు ఫోన్ చేసిన తన భర్తకు వైద్య పరీక్షలు చేయించి తీసుకురావాలని ఆమె కోరింది.
దీంతో వలంటీర్ల సమాచారం మేరకు ఆరోగ్య సిబ్బంది ఆమె ఇంటి వద్దకెళ్లి అతన్ని ఓ వాహనంలో నెల్లూరు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే అతన్ని తీసుకొచ్చి ఇంట్లో విడిచిపెట్టారు. దీంతో కథ సుఖాంతమైంది. సహజంగా భర్త అంటే దైవంగా భావించే సంస్కృతి మనది. అలాంటిది కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దూరంగా ఉంటున్న భర్తకు వైద్య పరీక్షలు చేయించాలనే ఆమె పట్టుదల ప్రశంసలు అందుకుంటోంది.