బంగారు బాతుల్లాంటి ఆ నలుగురు హీరోలు

కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కేవలం కూడు కోసమే అని కాకుండా సుఖాల కోసం, మెరుగైన జీవితం కోసం, గౌరవం కోసం, దర్పం కోసం..ఇలా రకరకాల కారణాలతో సంపాదించడమే పరమావధిగా పెట్టుకుంటాం చాలామంది.…

కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కేవలం కూడు కోసమే అని కాకుండా సుఖాల కోసం, మెరుగైన జీవితం కోసం, గౌరవం కోసం, దర్పం కోసం..ఇలా రకరకాల కారణాలతో సంపాదించడమే పరమావధిగా పెట్టుకుంటాం చాలామంది. సంపాదన కోసం దేశం కూడా విడిచి డాలర్ల కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటాం. ఏం చేసినా అంతిమలక్ష్యం సంపాదనే. 

కానీ కళ్లు తిరిగేంత సంపాదన ఉండి కూడా కడుపు నిండని వాళ్లుంటారు. వాళ్లకి కావాల్సింది కీర్తి తప్ప డబ్బు కాదు. చేతిలో ఉన్న డబ్బుతో ఆ కీర్తిని కొనుక్కోవాలని ఉబలాట పడుతుంటారు. 

కీర్తి వల్ల డబ్బు రావొచ్చేమో గానీ డబ్బు వల్ల కీర్తి వస్తుందా? 

ఇదే నేటి వ్యాసం.ఈ విషయంలో మనం నలుగుర్ని తలచుకోవాలి. 

1. హరనాథ్ పోలిచెర్ల
2. డాక్టర్ కే వీ సతీష్ 
3. సచిన్ జోషి
4. శరవణన్ అరుళ్ 

వీరంతా కుబేరులు. కానీ అందరికీ తెర మీద హీరోగా మెరవాలనేది కామన్ కోరిక. 

తద్వారా అపరిమితమైన కీర్తిని పొంది ఎక్కడకు వెళ్లినా సెలెబ్రిటీ అనిపించుకోవాలని తపన. 

డబ్బు పారేస్తే సినిమాలు తీసేవాళ్లుండరా అనే ఆలోచన. 

మంచి పేరున్న వాళ్ల చేత బాగా డబ్బు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే జనం చూడకపోతారా అనే అంచనా. 

పెద్ద పెద్ద స్టార్లు కూడా తమ కన్నా ఆస్తిపాస్తుల్లో తక్కువే అయినప్పుడు ఆ మాత్రం స్థాయికి డబ్బు ఖర్చుపెట్టి వెళ్లలేమా అనే ధీమా. 

వయసు ముదిరితేనేం? విగ్గు పెట్టుకుని ఎంతమంది పెద్ద హీరోలు ఇంకా హీరోయిన్స్ తో స్టెప్సు వేయట్లేదు…ఆ మాత్రం రూపురేఖలు మాకు లేవా అనే తెగువ… 

ఇవన్నీ కలిపి వీళ్లని నిజంగానే సినిమా హీరోల్ని చేసేసాయి. 

బంగారు బాతుల్లాంటి ఈ హీరోల్ని సమయానికి చక్కగా ఉపయోగించుకుని నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు కొందరు కళాకారులు. 

ముందుగా హరనాథ్ పోలిచెర్ల. ఈయన అమెరికాలో పేరున్న న్యూరాలజిస్ట్. అంటే నరాల డాక్టర్. ఎందరికో నరాల బలహీనతల్ని తగ్గించిన ఈయనకి కూడా నరాల్లో ఒకానొక బలహీనత ఉంది. అది బలహీనత అని ఆయన సినిమాలు చూసిన వాళ్లు అనుకున్నా ఆయన మాత్రం దానిని బలంగానే పరిగణించారు. తనను తాను బలంగా నమ్మినవాడిని ఈశ్వరుడు కూడా ఆపలేడు. అందుకే చంద్రహాస్ పేరుతో 2007లో ఒక సినిమా నిర్మించి నటించారు. అయితే ఈయనని హీరోగా దర్శకత్వం చేసే వరం శివశక్తిదత్తా గారికి దక్కింది. ఈయన కీరవాణిగారి తండ్రి. మంచి కథకుడు. అయితే దర్శకత్వం కూడా వీరే వహించడం విశేషం. మొత్తానికి ఎంత ఖర్చుపెట్టారో తెలియదు గానీ పోలిచెర్ల గారి వల్ల దత్తాగారి జేబైతే నిండింది. హరనాథ్ గారి నటనావైదుష్యానికి మాత్రం ప్రజలు నిశ్చేష్టులైపోయారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు గానీ…ఉండుంటే మాత్రం అబ్బో…ఒక రకమైన ప్రచారం వచ్చుండేది. ఈ ఒక్క సినిమాయే కాకుండా రాజేంద్ర, కెప్టెన్ రాణాప్రతాప్ అనే సినిమాల్లో కూడా ప్రధాన పాత్రల్లో నటించి తనని తానే మెప్పించుకున్నారీయన. 

నెక్స్ట్ మనం చెప్పుకోవాలసింది డాక్టర్ కే వీ సతీష్ గురించి. ఇతను బడా రియలెస్టేట్ వ్యాపారి. తనని హీరోగా చూపించే దర్శకుడి కోసం ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో ఈయనకి రిటైరయ్యి చాలా కాలం అయిన ఎస్ వీ కృష్ణారెడ్డి గారిపై దృష్టి పడింది. ఆ దృష్టి కటాక్షంగా మారింది. కోరినంత ధనరాసులు కురిపించారు. ఒక సమాచారం ప్రకారం దాదాపు 23 కోట్ల రూపాయల దాకా సమర్పించుకుని యమలీల-2 తీయించుకున్నారని వినికిడి. ఆ మొత్తంలోంచి ఒక్క రూపాయి కూడా కథానాయక నిర్మాత జేబులోకి రాలేదట. అయినా పర్వాలేదు. కోరుకున్న ఫేమొచ్చిందా అంటే డీఫేమొచ్చింది. కొందరి నుంచి సానుభూతొచ్చింది. కృష్ణారెడ్డిగారింటికి మాత్రం లక్ష్మీకళొచ్చింది. కొత్తగా అపకీర్తి మూటకట్టుకోవడానికి ఆయనేమీ ఫాములో ఉన్న దర్శకుడు కాదు. ఆ సంగతి ఆయనకీ తెలుసు. వ్రతం చెడ్డా ఫలితం దక్కిందని సరిపెట్టుకున్నారు. 

ఇక మూడో మహానుభావుడు సచిన్ జోషి. ఈయనదొక తరహా. మాణిక్ చంద్ కంపెనీ అధినేత. వేలకోట్ల ఆసామి. 2002 నుంచి 2005 వరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాడు. పనవ్వలేదు. తర్వాత ఎన్నో సినిమా ఈవెంట్స్ కి స్పాన్సర్. ఎందరో హీరో హీరోయిన్స్ వంగి దండం పెడతారు. పెడతారు మరి. డబ్బున్న వ్యక్తిని ఎప్పుడూ తక్కువచేసి చూడరు సినీ జనం. ఈయనకి తాను అందగాడినని నమ్మకం. నిజానికి వికారైతే కాదు. పైగా ఆల్రెడీ మూడు సినిమాలు చేసి ఆకలి తీరక ఉన్నాడు. ఒక్క హిట్టు కొట్టి ఆకలి తీర్చుకోవాలనే కసి పెరిగింది. ఈయనకి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ఆ ఫాలోయింగ్ తనకా తన సంపాదనకా అనేది తెలుసుకోవడంలో కాస్త వీకై ఉండొచ్చు. వాళ్లే రెచ్చగొట్టారో లేక ఈయనలోనే మొగలిపొద రగులుకుందో తెలియదు కానీ మళ్లీ సినిమా హీరో అవ్వాలనే కోరిక కలిగింది.  వీరి కరుణాకటాక్షవీక్షణాలు ఒకరి మీద కాదు..పాపం ఈయనని అప్రోచైన వాళ్లందరి మీదా పడ్డాయి. సినిమా ఆడడం ఆడకపోవడంతో సంబంధం లేదు..డబ్బులు వెనకేసుకుంటే చాలు..తదుపరి సినిమా జీవితానికి లేకపోయినా పర్వాలేదు అనుకున్న కొందరు ఈయనతో సినిమాలు తీసేసారు. ఒకటి కాదు…2011 నుంచి దాదాపు 7-8 సినిమాల్లో హీరోగా నటించాడీయన. వాటిల్లో హింది, తెలుగు ఉన్నాయి. ఈయనకైనా ఫేమొచ్చిందా అంటే…వచ్చి సెంటర్లో నుంచుంటే ఒక్కరన్నా సెల్ఫీ అడుగుతారా అంటే అనుమానమే. 

ఇక లాస్ట్ బట్ లేటెస్ట్ కుబేరహీరో ఎవరంటే శరవణన్ అరుళ్. ఒక యాంగిల్లో చూస్తే స్ఫూర్తిదాయకం, మరొక యాంగిల్లో చూస్తే అదోరకం. తమిళనాడులోని శరవణన్ స్టోర్స్ అధినేత. ఫ్యామిలీ బిజినెస్ ని పదింతలు చేసిన మేధావి. కోట్లకు పడగలెత్తిన వ్యాపారి. లలితా జువెలర్స్ అధినేత మాదిరిగా తన కంపీకి తానే బ్రాండ్ అంబాజడర్. యూట్యూబులో చూస్తే ఈయన హన్సిక మోత్వాని వంటి నటీమణులతో నటించిన యాడ్స్ దర్శనమిస్తాయి. రజనీకాంత్ స్థాయి కాంఫిడెన్స్ తో అటుఇటు నడుస్తూ యాడ్స్ కి పోజులివ్వడం ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్. ఇప్పుడు తాజాగా “ది లిజెండ్” పేరుతో ఒక సినిమాలో నటించి నిర్మించారు. 52 ఏళ్ల వయసు. అయినా కూడా సన్నగా కుర్రాడిలా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నట శిక్షణ తీసుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. ఎందరికో లక్షలాది, కోట్లాది వేతనాలిచ్చి సినిమా తీయించుకున్నాడు. వెక్కిరించినవాళ్లు వెక్కిరించారు. అయినా డోంట్ కేర్. తన ప్యాషన్ తీర్చుకున్నాడు.  

వీళ్లల్లో స్వతహాగా ఉన్నది తమ మీద తమకి నమ్మకం. దాని వల్లే ముందుగా వాళ్ల రంగాల్లో ఎదిగారు. ఫేం కోసం కూడా అదే నమ్మకంతో ప్రయత్నించారు. కానీ అది అందని ద్రాక్ష అని తెలిసుండాలి. కీర్తియోగమనేది కొనుక్కుంటే వచ్చేది కాదు. ఎవరికెంత అర్హతుంటే అంత వస్తుంది. అయినా ఈ నలుగురూ వాళ్ల వాళ్ల రంగాల్లో కీర్తి పొందినవాళ్లే. కానీ సినిమాల్లోకొస్తేనే అసలైన ఫేం అనుకుని, తమ ట్యాలెంట్ మీద ధీమాయే తప్ప సరైన అవగాహన లేక వాళ్లు ఈ దారి పట్టారు. డీఫేమయ్యారు. అయితేనేం..పాపం వాళ్లు భంగపడ్డా ఎందరి కళాకారుల జేబులో నింపారు పని ఇచ్చి. వారి పుణ్యం ఊరికే పోదు. మరో రూపంలో వారికందాలని కోరుకుందాం. 

ఓరుగంటి ప్రభాకర్