పక్క వాళ్ల భార్యల్ని బూతులు తిడుతున్న తెలుగు ట్రావెలర్

కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా కాదేదీ వినోదానికి అనర్హం. ఇద్దరు కలిసుంటే అది స్నేహం. ఇద్దరు కొట్టుకుంటే అది వార్త. Advertisement వార్తల్ని వినోదంగా చూసే సమాజంలో గత కొన్నాళ్లుగా రగులుతున్న తెలుగు ప్రపంచ యాత్రికుల…

కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా కాదేదీ వినోదానికి అనర్హం. ఇద్దరు కలిసుంటే అది స్నేహం. ఇద్దరు కొట్టుకుంటే అది వార్త.

వార్తల్ని వినోదంగా చూసే సమాజంలో గత కొన్నాళ్లుగా రగులుతున్న తెలుగు ప్రపంచ యాత్రికుల మధ్యలోని రగడ ఇప్పుడు వినోదం మార్కు దాటి చిరాకు పుట్టించే స్థాయికి చేరుకుంటోంది. 

తెలుగు వ్లాగ్స్ చూసే వాళ్లకి పరిచయం అక్కర్లేదు కానీ ఇక్కడ ప్రధానంగా చర్చలోకి వచ్చే పేర్లు ఐదు. 

1. ఉమ తెలుగు ట్రావెలర్
2: నా అన్వేషణ 
3. రవి తెలుగు ట్రావెలర్
4. యూ ఎస్ ఏ రాజా
5. రాజి రెడ్డి

ఈ ఐదుగురు చేసే పని ఒక్కటే..తాము తిరిగే ప్రపంచాన్ని వీడియోలు తీసి ఆకర్షణీయమైన సమాచారంతో యూట్యూబులోని తమ చానల్స్ లో పెట్టుకోవడం. అఫ్కోర్స్, దాని మీద వచ్చే ఆదాయన్ని పెంచుకోవడం. దాంతో బతకడం.  

అయితే వీళ్లు ఒక్కొక్కళ్లూ ఒక్కో టైపు. ఒకరు బజెట్ ప్రయాణాల గురించి చెబుతూ మధ్యతరగతికి దగ్గరైతే, ఇంకొకరు హై క్లాస్ సమాచరంతో ఒక వర్గాన్ని ఆకట్టుకుంటున్నారు, ఇంకొకరు మాస్ మసాలా వ్యాఖ్యానంతో ఏ దేశానికి వెళ్లితే ఆ దేశం అమ్మాయితో దాదాపు సహజీవనం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ట్రావెలోగ్స్ చేస్తున్నారు. ఇంకొకరిది దాదాపుగా అమెరికాలోని విశేషాలు చెప్పడమే పని.

వివరంగా వీరిలోని ప్లస్సులు మైనస్సులు చెప్పుకుందాం. 

1. ఉమ తెలుగు ట్రావెలర్:

ఇతనిది తెనాలి. కొన్నాళ్లు ఆఫ్రికా ఖండంలోని మాలి రాజధాని బమాకోలో పని చేసేవాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సాధారణంగా ప్రపంచయాత్ర అనగానే సగటు తెలుగువాడికి అమెరికానో, యూరోపో, జపానో గుర్తొస్తాయి తప్ప ఆఫ్రికా వెంటనే గుర్తురాదు. అందులో మళ్లీ కుగ్రామాలు, దయనీయ పరిస్థితిలో బతికే పేదలు అస్సలు గుర్తురారు. 

అక్కడే ఉమ స్కోర్ చేయగలిగాడు. 

అరుదైనా అఫ్రికా ట్రైబల్స్ తో కలిసి రెండు మూడు రోజులు జీవించడం, వాళ్లతో పాటు వేటకెళ్లి ఆ విశేషాలు చూపించడం, తోడేళ్లతో కలిసి తిరగడం మొదలైనవన్నీ తెలుగు యూట్యూబ్ వాచర్స్ కి కొత్తగా అనిపించాయి. పైగా అవన్నీ తెలుగువాడు చూపించడం, తెలుగులో వ్యాఖ్యానించడం మరింత ఆసక్తి గొలిపాయి. ఫలితంగా అతనికి సబ్స్క్రైబర్స్ గణనీయంగా పెరిగిపోయారు. టూరిజం లేదా ట్రావెల్ వీడియోల్లో ఉమ చేసినవి కచ్చితంగా అరుదైనవి. 

మర్యాదకరమైన భాష మాట్లాడతాడు. గౌరవప్రదంగా ఉంటాడు. 

అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్. దేశాలు పట్టుకు తిరగడమంటే డబ్బు కావాలి. ఎంత ఎకానమీలో తిరిగినా, ఎంత పొదుపుగా బతికినా ప్రతిరోజూ మీటర్ తిరుగుతూనే ఉంటుంది. ఉమకి తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన వీటికి సరిపోదు. పైగా నిరంతరాయంగా వ్లాగింగ్ చెయ్యాలంటే ఉద్యోగం కూడా అడ్డమే. ఎలాగో యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తోంది. దాంతో తన అభిరుచిని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆఫ్రికాలో ఉద్యోగం కూడా మానేసాడు. 

అయితే అవసరాలు, అవకాశాలు మనిషిని మార్చేస్తాయని చెప్పినట్టు ఉమ తన చానల్లో గ్యాంబ్లింగ్ సైట్స్ గురించి ప్రచారం చేయడం చాలామందికి నచ్చలేదు. అతను చెప్పాడని వాటిల్లో వేళ్లు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్లు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. 

అదే విధంగా గత పదిరోజుల్నుంచీ తిండి కూడా తినలేదని ఒక వీడియో పెట్టి డబ్బులడుక్కోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన పనితో ఒక స్థాయి కీర్తి పొందిన వాడు ఇలా అడుక్కోవడం దిగజారుడే. 

సినిమా తీసిన నిర్మాత డబ్బుపోయిందని ఏడిస్తే, “ఎవడు తీయమన్నాడు సినిమా” అని అంటారు తప్ప “అయ్యో” అని దానాలు చెయ్యరు కదా. ఇదీ అంతే. 

అయినా కూడా ఎవడికి తోచింది వాడు వందో, యాభయ్యో ఇచ్చినా కూడా చాలన్నట్టుగా ఉంది ఇతని డిస్పరేషన్. ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకున్నాడు. తన భార్య కూడా ఒక వ్లాగ్ తెరిచారు. ఒక అంచనా ప్రకారం వీరి కుటుంబ సంపాదన నెలకు 2 నుంచి 5 లక్షల దాకా ఉంటుందని వీరి చానల్స్ కి వచ్చే వ్యూవ్స్ ని బట్టి తెలుస్తోంది. అయినా కూడా పేద అరుపులు అరుస్తూ అప్పులున్నాయని, తిండి తినలేదని డబ్బులడుక్కోవడం బాగోలేదు. అది అతని ఇమేజ్ ని దెబ్బతీయడమే కాకుండా ఎంతో మంది వీక్షకులకి అతనిపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీసింది.

ఇలా అడిగేది అడిగి, పుచ్చుకునేది పుచ్చుకుని ఆ తర్వాత ఆ వీడియోస్ ని డిలీట్ చేసేసుకోవడం ఇతని పద్ధతి.  

2. రవి తెలుగు ట్రావెలర్:

ఇతను అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి. కీర్తి కాంక్ష మెండు. బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నానని అతను అనుకుంటున్నా తన శైలిలో సొంత డబ్బా సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. ఖరీదైన ఎయిర్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసి ఆ విషయాలు చెబుతున్నప్పుడు సగటు పాశ్చాత్య వ్లాగర్స్ లా కాకుండా తాను తప్ప ఆ ఘనకార్యం ఇంకెవ్వడూ చెయ్యలేడన్నట్టుగా చెప్పాడు. 

అలాగే పాకిస్తాన్ యాత్ర గురించి కూడా. ఏ తెలుగు వాడూ ఇంతవరకూ పాకిస్తాన్లో తనలాగ యాత్ర చెయ్యలేదని పదే పదే చెప్పుకోవడం ఇతనిలోని అస్థిత్వ పోరాటానికి మచ్చుతునక. అయితే పాకిస్తాన్ ఏ పాస్పోర్టు వాడి ఎలా వెళ్లాడనేది ఒక వివాదం నడుస్తోంది. దాని మీద ఒక నెటిజెన్ ప్రశ్న అడిగితే ఎందుకో వివరాలు చెప్పడానికి బెదిరినట్టుగా కనిపించి దాటేసాడు. 

ఇండియా వచ్చినప్పుడు తన సొంత ఊరు వైజాగులో ప్రెస్ వారిని పిలిపించుకుని ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచంలో అత్యధిక దేశాలు తిరిగిన తెలుగువాడిగా ప్రచారం చేసుకున్నాడు. అలాగే హైద్రాబాద్ వచ్చినప్పుడు ఒక యూట్యూబ్ చానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చి పెద్ద పేరు పొందే ప్రయత్నం చేసాడు. 

ఇతని ట్రావెల్ వీడియోస్ చూడ్డానికి బాగుంటాయి. చక్కని విషయముంటుంది. ఎకడమిక్ గా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి చెబుతున్నట్టే ఉంటుంది. కానీ ఉమా తెలుగు ట్రావెలర్ లాగ హంబుల్ నేచర్ తో మనసుల్ని గెలుచుకోవడంలో వెనుకబడ్డాడు. ఈయన కూడా తన ఛానల్ కి ఆడియన్స్ తగ్గకూడదని కొన్ని సార్లు అస్సలు ఆకట్టుకోని సినిమా రివ్యూలు కూడా చేసాడు. 

3. యూ ఎస్ ఏ రాజా:

ఇతని ఛానల్ చాలా ఫేమస్. పెట్టిన వీడియోలకి మిలియన్ల వ్యూవ్స్, అంతే రేంజులో సబ్స్క్రైబర్స్ ఉన్న చానల్ ఇతనిది. సహజమైన యాసలో చాలా ఆసక్తికరంగా యూ ఎస్ ఏ సంగతులు చెబుతుంటాడు. ఇండియాలో ఉన్న మధ్యతరగతి యువకులలో అమెరికాలో ఉన్న వాళ్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని క్యాష్ చేసుకోవడం ఇతని పని. 

అక్కడి వాళ్ల జీతాలెలా ఉంటాయి, ఎంత సేవ్ చేయగలుగుతారు లాంటి వీడియోలు చాలానే పెట్టాడితను. 

అలాగే ప్రపంచంలోనే పెద్దదైన క్రూయిజ్ షిప్ ఎక్కి ఆ విశేషాలని కూడా చూపించి ఆకట్టుకున్నాడు. రకరకాల దేశాల విషేషాల కన్నా ఇతని వీడియోస్ లో అన్నీ అమెరికా కబుర్లే ఉంటాయి. ఏం చెప్పినా ఆసక్తిగా ఉంతాయి కనుక ఫాలోవర్స్ ఉన్నారనుకోవాలి. ఏం చెప్పాడు అనే దానికన్నా ఎలా చెబుతున్నాడు అనే దాని మీద నెట్టుకొచ్చేస్తున్నాడు. 

నిజానికి ఇతని వీడియోస్ లో కాంట్రవర్సీలేవీ ఉండవు. 

కానీ ఒకానొక సంఘటనని ఇక్కడ చెప్పుకుంటున్న నా అన్వేషణ అనే వ్లాగర్ బయటపెట్టి రచ్చ చేసాడు. అదేంటంటే..యూ ఎస్ ఏ రాజా, ఆయన భార్య ఇండియా వచ్చినప్పుడు ఒక ఊరిలో సన్మానం చేసారు. అక్కడ సన్మానం చేసినవాళ్లు రాజాకి శాలువా కప్పి ఒక వేంకటేశ్వరస్వామి ప్రతిమని ఇవ్వబోయారు. వెంటనే రాజా భార్య వేదిక మీదకొచ్చి ఆ ప్రతిమ వద్దని విసురుగా వెనక్కిచ్చేసింది. అప్పటికి కానీ తెలియలేదు వీరు అన్యమతంలో ఉన్నారని. దీనిని ఎత్తి చూపుతూ నా అన్వేషణ చేసిన వీడియో చాలామంది హిందువులకి తగిలింది. ఆ రకంగా యూ ఎస్ ఏ రాజాని కాంట్రవర్సీలోకి లాగి తన ఫాలోవర్స్ కొంతమందిని గండి కొట్టాడు. 

4. నా అన్వేషణ:

ఇతనిదొక శైలి. హోటల్ మేనెజ్మెంటులో పని చేసి తర్వాత ప్రపంచయాత్రికుడయ్యాడు. యూట్యూబులో తనకంటూ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. పూర్తి మాస్ మసాలా పద్ధతిలో విశాఖ-ఉత్తరాంధ్ర యాసలో ఇతని వ్లాగులుంటాయి. ఇతని భాషకి అలవాటవడానికి టైం పడుతుంది. తర్వాత నచ్చుతాడు. ఫిల్టర్ అస్సలు ఉండదు. చాలా వరకు ఆసక్తికరంగానే సాగుతున్నా ఒక్కోసారి జుగుప్సాకరమైన పదజాలం వాడడం ఇతని వీక్నెస్. అది మాత్రం చిరాకు తెప్పిస్తుంది. పైగా ఏ దేశానికి వెళితే ఆ దేశం అమ్మాయితో దాదాపు లివిన్ రిలేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆడవాళ్ల గ్లామరుంటేనే జనాలు వీడియోలు చూస్తారని బలంగా నమ్మే వ్యక్తి ఇతను. కానీ ఇతనికున్న సబ్స్క్రైబర్స్ ఉమ తెలుగు ట్రావెలర్ కంటే తక్కువే. 

ప్రస్తుతమున్న అన్ని వివాదాలకి ఇతనే కారణం. తన తోటి వ్లాగర్లంతా కుట్రతోటి, మాల్ ప్రాక్టీస్ తోటి తనకంటే మెరుగైన స్థితిలో ఉన్నారని ఇతని ముఖ్యమైన ఆరోపణ. 

రవి తెలుగు ట్రావెలర్ 187 దేశాలు తిరగలేదని వాదిస్తాడు. అంతే కాకుండా యూ ఎస్ ఏ రాజాని, అతని భార్యని అగౌరవప్రదమైన మాటలతో నిందిస్తాడు. అది అతని ఫ్యాన్స్ లో చాలామందికి నచ్చుతున్నా ఎందరికో తెలియకుండా దూరమవుతున్నాడు. 

తన చానల్ కి సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవాలని అతని లక్ష్యం. పెంచుకోవడమంటే ఏదో పెంచుకోవడం కాదు. తన తోటి వ్లాగర్స్ ని దాటి పోయి నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లాలని అన్నట్టుగా ఉంటాయి అతని ప్రయత్నాలు. దీని కోసం చాలా కష్టపడ్డాడు. అత్యంత కష్టసాధ్యమైన అంటార్కుటికా యాత్ర కూడా చేసి అక్కడి విశేషాలు చూపించాడు. అయినా అతను కోరుకున్నంతగా సబ్స్క్రైబర్స్ పెరగలేదు. తన వీడియోలకి అనుకున్నన్ని వ్యూవ్స్ కూడా రాలేదని అతని అభిప్రాయం. దీనిని కారణం తన తోటి వ్లాగర్ల కుట్రలే అని అతని అనుమానం. బై హుక్ ఆర్ క్రూక్ తనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి. దాని కోసం ట్రావెలోగ్స్ పక్కనపెట్టి ఇప్పుడు వివాదాల్లోకి దిగాడు. ఇక్కడ పేర్కొన్న వారిలో ముగ్గురు వ్లాగర్స్ ని టార్గెట్ చేసి మాట్లాడుతుండడం ఇతని దినచర్య అయిపోయింది. 

వాళ్లు కూడా ఇతనికి సమాధానాలు చెబుతూ వీడియోలు చేయడం, జనానిని సంజాయిషీలు చెప్పడం లాంటివి చేసి తాము వీక్ వికెట్లమని నిరూపించుకున్నారు. 

5. రాజి రెడ్డి:

చివరిగా రాజి రెడ్డి. ఇతను పూర్తిగా వివదారహితుడు. నా అన్వేషణ కూడా ఇతనిని ఏ విషయంలోనూ ఎత్తి చూపడు. లో బజెట్లో విదేశాలు చుట్టి రావడమెలా అనే విషాయలు ప్రాక్టికల్ గా చేస్తూ చూపించడం ఇతని ప్రత్యేకత. పై వాళ్లతో పోలిస్తే ఇతనికి ఫాలోవర్స్ తక్కువున్నా ఉన్నవాళ్లంతా ఇతనిని అభిమానిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శంగా కనపడే ఏకైక తెలుగు వ్లాగర్ ఒక్క రాజి రెడ్డే.