మాస్ సినిమాల్లో హీరో ఉంటాడు. అతడేం చేసినా హీరోయిజమే. తన చేతిలో ఏమీ లేకపోయినా.. విలన్లను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు హీరో. ప్రేక్షకుల చేత ప్రతి సీన్ లోనూ జేజేలు కొట్టించుకుంటూ ఉంటాడు!
సినిమాల్లో హీరో ఎలాగో.. రాజకీయాల్లో ముఖ్య నాయకుడు కూడా అంతే, ప్రత్యర్థులకు పవర్ పంచ్ లు ఇవ్వాలి, వాళ్ల పని పట్టాలి, ప్రత్యేకించి అడ్డదారిలో వచ్చే వారిని హీరో ఆడుకోవాలి! కామెడీ చేసే విలన్ అయినా, విలనిజాన్ని చేయాలని చూసే కమేడియన్ ను అయినా హీరో ఓ పట్టు పట్టాలి!
అప్పుడే సినిమా హిట్టు అవుతుంది! సినిమాకే కాదు, రాజకీయంలోనూ సగటు ప్రేక్షకుడు, సగటు పొలిటికల్ పార్టీ అభిమాని కోరుకునేవి ఇవే! ఎవరిని ఎక్కడ, ఎలా కొట్టాలో.. హీరో అలా కొట్టాలనమాట. అదే సక్సెస్ ఫార్ములా, మాస్ ను ఆకట్టుకునే ఫార్ములా! అదే సూపర్ హిట్ ఫార్ములా!
ఆఖరి సీన్లో ఎలాగూ హీరోనే గెలుస్తాడు, అయితే.. చివరి వరకూ హీరోను చిన్న చిన్న విలన్లు కూడా తిప్పలు పెట్టడం, హీరో కొన్ని పొరపాట్లు చేయడం.. అన్నింటికీ మించి హీరో చాతుర్యం చూపకపోతే మాత్రం సినిమా సగంలో నిస్తేజాన్ని కలిగిస్తుంది! ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని గమనిస్తే.. ఇలాంటి నిస్తేజమే కలుగుతోంది సగటు ఫ్యాన్స్ లో!
కొన్ని ఏకులు మేకులై గుచ్చుకుంటున్నాయి. అవి గుచ్చుకోవడం కూడా లేదు కానీ, అవి చేసే రచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రొదగా మారుతోంది. చెప్పులోన రాయి, చెవిలోన జోరిగ.. అనే పద్యం గుర్తుకు వస్తుంది ఈ పరిణామాలను గమనిస్తే. అవి చెప్పులోని రాళ్లే.. పెద్దగా ఇబ్బంది కలగదు, కానీ వాటిని పెట్టుకుని అలాగే నడుస్తూ ఉంటే ఆ నడక ఎంత యాతనో తెలుస్తుంది.
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడకలో కొన్ని చెప్పులోని రాళ్లు, చెవిలోని జోరీగలు, కంటిలోని నలసులు, కాలిలోని ముళ్లు.. ఇలాంటివే డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా మనిషిని ఇవేం చేయలేవు, ఇబ్బంది పెట్టడం తప్ప. వీటిని తీసేసుకోవడం, తరమడం, తొలగించుకోవడం.. ఇవన్నీ చేతిలోని పనులే! అయితే సవ్యంగా చేసుకోవాలి.
రాజకీయంలో ఇలాంటి విషయాల్లోనే చాణక్యం ఉండాలి, చాతుర్యం చూపాలి! అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో అంత శ్రద్ధ వహిస్తున్నట్టుగా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాల్లో చాణక్యాన్ని ప్రదర్శించడం కానీ జరగడం లేదని స్పష్టం అవుతోంది. లేకపోతే.. ఏ మాత్రం జనబలం కానీ, ఒక మంచి ట్రాక్ రికార్డు కానీ లేని వ్యక్తులు.
సుమతీ శతకాలు చెప్పడం, వాటిని జనాలు వినాల్సి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భరించాల్సి రావడం ఏమిటో మరి!
ఒక నేత చెవిలో జోరీగ!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత బలంతో గెలిపించుకున్న ఒక నేత ఆ పార్టీ పాలిట చెవిలో జోరీగలా మారిన సంగతి ఇప్పటిది ఏమీ కాదు. ఈ జోరీగను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామ్ చేయలేకపోతోంది! ఒకవేళ దీన్ని పట్టించుకోకపోయి ఉంటే, అదో సంగతి. దాని మానన దాన్ని వదిలేసినట్టుగా ఉండేది. అయితే సగం కదిలించి, సగం వరకూ మాత్రమే దాన్ని కామ్ చేశారు. అయితే జోరీగ తన లక్షణాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంది!
వాస్తవానికి ఈ జోరీగ ఎంత అరిచినా ఎవరికీ ఇబ్బంది అయితే ఉండదు. కానీ చుట్టూ తిరుగుతూ ఉంటే అదో చికాకు. ఈ చికాకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తోంది. ఆ జోరీగ లాగేదీ లేదు, దాంతో తెగేదీ ఏమీ లేదు. కానీ నాన్ సెన్స్ డైలీ సీరియల్ గా మారింది. దాని రొదను పట్టించుకోనట్టుగా వ్యవహరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దాన్ని భరించలేనట్టుగా రియాక్షన్ ఇచ్చి మళ్లీ భరించాల్సిన పరిస్థితుల్లోనే ఉంది!
నిజమే.. జోరీగపై ఎవరూ అస్త్రాలను ప్రయోగించలేరు. ప్రయోగించినా దానికి అవి తగలవు కూడా. మరి అలాంటప్పుడు ఏం చేయాలో అది చేయాల్సింది. అదే కదా.. చాతుర్యం, అదే కదా చాణక్యం! జోరీగను తరిమే పద్ధతిలో దాన్ని తరిమి ఉంటే.. సరిపోయేదేమో! అయితే.. దాని ముందు విలువల గురించి ప్రవచనాలు చెబితే ఏం లాభం! దేనికి వేసే మందు దానికి వేయాల్సింది. అయితే ఇప్పటికీ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మందు వేయాలో అంతుబడుతున్నట్టుగా లేదు. అయితే సమయం కోసం వేచి చూస్తున్నట్టుగా చెప్పుకునేందు కూడా ఇక ఏమీ లేదు. ఇప్పటికే చాలా కాలాతీతం అయ్యింది!
ఇంకో మూడేళ్లకు ఎన్నికలు వస్తే.. అప్పుడు ఈ జోరీగలన్నీ ప్రజాతీర్పులో గల్లంతయిపోవచ్చు గాక, కానీ ఇంకా మూడేళ్ల పాటు ఇలాంటి జోరిగను భరించడమంటే మాత్రం ఏదో రకంగా అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనమే అవుతుంది! వ్యూహ లేమే అవుతుంది, చాతుర్యం లేకపోవడం, చిన్న జోరీగను డీల్ చేయలేకపోవడమే అవుతుంది. అంతే కాదు.. ఇంకా కొన్నాళ్లు ఈ జోరిగను చూసి మరికొన్ని తయారు కావొచ్చు.
ఎలాగూ అసంతృప్తులు ఉండనే ఉంటారు. ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ అలాంటివన్నీ లేస్తాయి. కాబట్టి ఇప్పుడు తెగ హడావుడి చేస్తున్న జోరీగ వీక్ పాయింట్లను మరింత శోధించో, పట్టో.. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా చేయలేకపోతే జగన్ కోటరి తన చేతగాని తనాన్ని ఒప్పుకోవడం కూడా! వ్యూహకర్తలు ఇలాంటి విషయాలను ఎందుకు పట్టించుకోరో మరి!
కాలిలో ముళ్లు గుచ్చుకుంటూనే ఉన్నాయి!
ఇక కోర్టు తీర్పులు.. జగన్ ప్రభుత్వం పాలిట కాలిలో ముళ్లు. చాలా గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇక గుచ్చుకుంటూనే ఉంటాయి తప్ప.. ఇక వేరేది లేదనట్టుగా మారింది పరిస్థితి. ఈ వ్యవహారం డెయిలీ సీరియల్ గా మారింది. జగన్ ప్రభుత్వంలో ఉన్న న్యాయనిపుణులు తమ వాదనను, ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించలేకపోతున్నారా, ఎంతగా సమర్థించే ప్రయత్నం చేసినా.. ఇంతేనా అనేది అంతుబట్టని అంశం అయ్యింది.
ప్రస్తుతానికి అయితే.. ఇకపై కూడా జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎలాంటి ఊరటలూ దక్కుతాయని ఎవ్వరూ అనుకోవడం లేదు! ఎందుకో అలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సామాన్యులకు కూడా ఈ విషయం ఎరుకలోకి వచ్చింది. అయితే ఈ విషయంలో జగన్ ప్రభుత్వంపై కొంత సానుభూతి కూడా ఏర్పడుతోందనేది వాస్తవం. కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి కలిసి రాదు.. అనే అభిప్రాయాలు సామాన్య ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు అనుకోవచ్చు కానీ, ముఖ్య నేతలు అనుకోకూడదేమో! తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అంటారు. అలాంటి ప్రయత్నాలు ఏ మేరకు జరుగుతున్నాయో మరి!
కంటిలోని నలుసు!
ఇక అమరావతి ఉద్యమం ఊపు పూర్తిగా నీరసించింది. అయితే రైతుల పేరుతో ఇంకా ప్రత్యర్థులు తమకు అవకాశం దొరికిప్పుడు జగన్ ప్రభుత్వంపై ఏదో బురదజల్లేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఇది కంటిలో దాగున్న నలుసులా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మూడు రాజధానులు
అంశం కోర్టుల్లో ఒక కొలిక్కి వచ్చే వరకూ ఈ వ్యవహారం మరుగున పడే అవకాశం లేదు. పాలన ఎక్కడ నుంచి సాగించాలనే అంశం ముఖ్యమంత్రి విచక్షాణాధికారం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల మళ్లీ తమ వాదనకు పదును పెంచారు. విశాఖ నుంచి పాలనకు ముహూర్తాన్ని ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో.. ఈ సారైనా తాము అనుకున్నది వారు చేయగలరా? లేక మళ్లీ చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతాయా? అనేది ఉత్కంఠగా మారింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైజాగ్ కు వెళ్లడానికి వీల్లేదని , అక్కడ నుంచి పాలన సాగడానికి వీల్లేదని ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మరి! అయితే స్థానిక ఎన్నికల్లో గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోకపోయి ఉంటే.. అమరావతి ఉద్యమం ఉందనడానికి ప్రతిపక్షానికి కూడా మరింత అవకాశం చిక్కేది.
అయితే గుంటూరు, విజయవాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడంతో.. తెలుగుదేశం పార్టీకి గొంతులో పచ్చి వెలగకాయ పడింది. అందులోనూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్పందిస్తూ.. గుంటూరులో వైఎస్ఆర్సీపీ గెలిస్తే, అమరావతిని రాసిచ్చేసినట్టే అంటూ ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడంతో టీడీపీ ఆ తర్వాత ఆ ఉద్యమంలో ఉనికి కోల్పోయింది.
చంద్రబాబు నాయుడు చేజేతులారా అమరావతి ఉద్యమానికి మంగళం పాడినట్టుగా అయ్యింది. ఈ విషయంలో మాత్రం చంద్రబాబుకే జగన్ మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే ఇంకా జగన్ కోరుకుంటున్న మూడు రాజధానుల ఫార్ములా అమల్లోకి రాలేదు. అది అమలు కానంత వరకూ కూడా ప్రజలు అంత మెజారిటీ ఇచ్చినా, తన అధికారాన్ని జగన్ ఉపయోగించుకోలేకపోయినట్టే అవుతుంది. ఈ విషయంలోనూ కుందేటి కొమ్మును సాధించే ప్రయత్నాలేవో చేయాలేమో!
చెప్పుల్లో మరిన్ని రాళ్లు..!
విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక సస్పెండెడ్ జడ్జి వ్యాఖ్యలపై ప్రభుత్వ స్పందన, మీడియాపై కేసులు.. ఇవన్నీ కూడా సామాన్యమైన రియాక్షన్లే అయినా, ఆపోజిట్ మీడియా వాటిపై అనుదినం రచ్చ చేస్తూనే ఉంటుంది! ఏ రోజుకారోజు బ్రహ్మాండం బద్ధలైపోయినట్టుగా వ్యతిరేక మీడియా గీ పెడుతూనే ఉంటుంది.
తాము ఎంత అడ్డగోలుగా అయినా వ్యవహరిస్తాం, తమ జోలికి వస్తే మాత్రం అరిచి మొత్తుకుంటామన్నట్టుగా జగన్ వ్యతిరేకులు తయారయ్యారు. తప్పులు కూడా చేసి దబాయించగలుగుతున్నారు! స్థానిక ఎన్నికల వ్యవహారాలు కూడా అలాగే సాగాయి. మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏడాది పాటు రచ్చ రచ్చ చేసి వెళ్లాడు. అయితే ఎన్నికల కమిషన్ వ్యవహారాలు జగన్ ప్రభుత్వానికి కాలికి వేస్తే వేలికి పడుతున్నాయి, వేలికేస్తే కాలికి పడుతున్నాయి.
గత ఎన్నికల కమిషనర్ ఉన్నప్పుడేమో ఆయన విచక్షణాధికారాల పేరుతో ఒక రచ్చ, కొత్త కమిషనర్ వచ్చాకా.. మళ్లీ విచక్షణాధికారాలే లేకుండా పోయి, విచక్షణే లేదనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం! ఇలాంటి చిక్కుముళ్లను జగన్ ప్రభుత్వం తేలికగా తప్పించుకోలేకపోతోంది. ఇవన్నీ జగన్ వ్యతిరేకులకు లడ్డూల్లా దొరుకుతున్నాయి. వ్యతిరేక మీడియా వీటితోనే వంట వండుకుని బతుకు సాగిస్తూ ఉంది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఎప్పుడూ ఇలాంటివేవో వెన్నాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉండటంతో.. ఏమిటదంతా.. అనే భావన ఏర్పడటంలో విచిత్రం లేదు.
పెద్ద విషయాలేం కాదు కానీ!
ఒక రాజకీయ పార్టీ అధికారంలోంచి దిగాలంటే.. జరగాల్సినవేవీ ఏపీలో ఇప్పుడు జరగడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై సామాన్యుల్లో వ్యతిరేకత లేదు. సంక్షేమ ఫలాలు ఎక్కువయ్యాయి! ఇప్పుడు లబ్ధి పొందని కులం, లబ్ధి పొందని వర్గం అంటూ ఏదీ లేకుండా పోయింది.
ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక పథకం లబ్ధి అందుతూ ఉంటే.. ప్రజలు ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకతపెంచుకుంటారు! వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడిరోడ్లపైకి వచ్చి అరిచి గీ పెట్టినా ఎవరూ రారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉనికి కోల్పోయింది. ఆ పార్టీ అధినేత హైదరాబాద్ లోని ఇల్లు దాటి బయటకు వచ్చేలా కనిపించడం లేదు.
లోకేష్ తో ప్రయోజనం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. అధికారంలోకి రాగానే చెప్పినవి చెప్పినట్టుగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న జగన్ పై ఎలాంటి వ్యతిరేకతా ప్రబలడం లేదు. ఒక పార్టీ అధికారంలోకి దిగేంత వ్యతిరేకత ప్రబలాలంటే.. ఒక బలమైన కాజ్ ఉండాలి. అలాంటిదేమీ ఇప్పటి వరకూ లేదు.
ఇక జగన్ కూడా ఈ రాజకీయాలను, ఈ థర్డ్ గ్రేడ్ కుట్రలను ఎదుర్కొనం గురించి అస్సలు ఆలోచించడం లేదేమో! ప్రజలకు చేయాల్సినవి, చెప్పినవి, కావాల్సినవి చేస్తున్నాం కాబట్టి.. ఇక ఎవ్వరేమైనా చేసుకోనీలే అనే తత్వం కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో. సగటు రాయలసీమ తత్వం ఇది. మనం చేయాల్సింది మనం చేద్దాం.. అన్నట్టుగా జగన్ ముందుకు సాగిపోతూ ఉన్నారు.
మరి చెప్పులో రాళ్లు, చెవిలోని జోరీగలు, కాలిలోని ముళ్ల పరిస్థితి ఏమిటనేది ముందు ముందు తేలాల్సి ఉంటుంది. వీటిని ప్రజలు రాజకీయ వినోదంగానే తీసుకుంటున్నారు. అదైతే స్పష్టం అవుతున్న అంశమే. అయితే.. ఇలాంటి చిన్న చిన్న చిక్కుముడులను తప్పించేసుకోకుండా ముందుకు సాగడం మాత్రం, నెమ్మది నెమ్మదిగా చేతకాలేదేమో అనిపించుకుంటుంది! ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాల్సి ఉంది.
ఇప్పుడు వినోదంగా తీసుకుంటున్న వారు కూడా.. ముందు ముందు, దీన్ని చేతగాని తనం అనుకోనూ వచ్చు. ఏదో ఉంది లేకపోతే ఎందుకు భరిస్తున్నట్టు అనే భావనా కలగవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్.. వీటిని పరిష్కరించుకోవాల్సిన అనివార్యతను ఎదుర్కొంటోంది.
జీవన్ రెడ్డి.బి