ఇకపై పవన్ కొత్త సినిమాలపై పుకార్లు అక్కర్లేదు. అలాంటి ఊహాగానాలు వినిపించినా నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమాలు ఆపేస్తున్నారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు అదనంగా మరో సినిమా చేసి పవన్, సినిమాలకు విరామం ప్రకటించాలనుకుంటున్నారు. ఈ మేరకు కీలకమైన జనసేన నేతల నుంచి లీకులు మొదలయ్యాయి. ఇంతకీ పవన్ ఎందుకు సినిమాలు ఆపేయాలనుకుంటున్నారు? దీనికి వెనక మెగా ప్లానింగ్ గురించి అందరికీ తెలిసిందే!
ఎన్నికల సన్నద్ధం కోసమేనా..!
మరో మూడేళ్లలో ఎన్నికలొస్తాయి. వాటికి సన్నద్ధం అవ్వాలంటే మినిమంలో మినిమం రెండేళ్లయినా టైమ్ కావాలి. పవన్ లాంటి బిజీ హీరోకైతే కనీసం ఏడాదిన్నరైనా టైమ్ కావాలి. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తిచేయగలిగితే, పవన్ కు మిగిలే టైమ్ అదే కావొచ్చు. ఈ తక్కువ టైమ్ లోనే ఆయన మరోసారి పార్టీని సన్నద్ధం చేసుకోవాలి. క్షేత్రస్థాయి నుంచి మళ్లీ పనులు చక్కబెట్టాలి. కుదిరితే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటించాలి. ఇంకా చెప్పాలంటే ఈ టైమ్ పవన్ పాలిటిక్స్ కు సరిపోదు. అందుకే ఆయన కొత్త సినిమాలకు కాల్షీట్లు కేటాయించే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని అంటున్నారు జనసేన నాయకులు.
బీజేపీతో సర్దుబాట్లు తప్పవు
అటు రాజకీయాలు, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న పవన్ కల్యాణ్ కు భవిష్యత్ లో రాజకీయాలకు సంబంధించి సమయం తన చేతిలో ఉండదు. తను అనుకున్నట్టు అన్నీ ప్లాన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది. ఆ పార్టీ ఆదేశాల మేరకు పవన్ నడుచుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు నుంచే పవన్ రాజకీయాల వైపు వచ్చేయాలని బీజేపీ ఇప్పట్నుంచే పరోక్షంగా సూచనలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కమలదళం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. నెగ్గకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా నిలవాలనేది ఆ పార్టీ ఉబలాటం. ''ఏమో గుర్రం ఎగరావచ్చు'' అనే రీతిలో పవన్ తో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చినా రావొచ్చంటూ మరికొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు భ్రమపడుతున్నారు కూడా. ఓవైపు వీళ్ల ఆశలు, భ్రమలు ఇలా ఉంటుంటే.. మరోవైపు పవన్ సినిమాలతో కాలక్షేపం చేయడం బీజేపీ అధిష్టానానికి రుచించడం లేదు. 2022 తర్వాత కూడా పవన్ సినిమాలు చేస్తానంటే బీజేపీ ఒప్పుకోకపోవచ్చు.
నియోజవర్గం వెదుకులాటలు
అటు పవన్ కల్యాణ్ కు కూడా వీలైనంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చేయాలనే ఉంది. ఎందుకంటే, పవన్ ముందు రెండు టార్గెట్స్ ఉన్నాయి. దీర్ఘకాలిక లక్ష్యంగా సీఎం కుర్చీని టార్గెట్ చేసిన జనసేనాని, స్వల్పకాలిక లక్ష్యంగా ఎమ్మెల్యే పదవిపై గురిపెట్టారు. ముందుగా ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా జరగాలంటే తనకంటూ ఓ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఆ నియోజకవర్గంపై వ్యక్తిగత స్థాయిలో దృష్టిపెట్టాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం రెండేళ్లైనా కావాలి.
గత ఎన్నికల్లో కేవలం సామాజిక వర్గ సమీకరణాలు, కులం ఓట్ల లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని ఎంచుకొని బోల్తాపడ్డారు పవన్. ఈసారి అలా కాకుండా కనీసం ఏడాది ముందు నుంచే ఎంపిక చేసిన నియోజకవర్గంలో పర్యటలు చేపట్టాలని, ప్రజలతో మమేకం అవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం సినిమాల స్టేటస్ ఏంటి?
ఇవన్నీ జరగాలంటే కనీసం రెండేళ్ల ముందు సినిమాలు ఆపేయాలి. ఈ లెక్కన చూసుకుంటే, ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న టైమ్ అటుఇటుగా ఏడాదిన్నర మాత్రమే. ఈ 18 నెలల్లోనే అన్ని సినిమాలు పూర్తిచేయాలి. మరి పవన్ టార్గెట్ అందుకుంటారా? ఆయన సినిమాలు ఏ స్టేజీలో ఉన్నాయి?
పవన్ చేతిలో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఉంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు పెద్దగా టైమ్ పట్టదు. ఎందుకంటే ఇది మల్టీస్టారర్. రానా కూడా ఉన్నాడు. కాబట్టి త్వరగానే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది.
అటు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం సెట్స్, గ్రాఫిక్స్, బాలీవుడ్ నటీనటుల కాల్షీట్ల సర్దుబాటు లాంటి ఎన్నో వ్యవహారాలున్నాయి. కాకపోతే అక్కడున్నది క్రిష్ కాబట్టి పని తొందరగానే పూర్తవుతుందనే నమ్మకం పవన్ లో ఉంది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాలి. అదింకా సెట్స్ పైకి రాలేదు. ఆ సినిమాకు కనీసం 3-4 నెలలు టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత పవన్ మరో సినిమా చేసే వీలుంటుంది. సురేందర్ రెడ్డి, అనీల్ రావిపూడి లాంటి పేర్లు తెరపైకొచ్చినప్పటికీ.. అసలు ఇంకో సినిమా చేయాలా వద్దా, సమయం సహకరిస్తుందా లేదా అనే విషయాలపై పవన్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
కరోనా వల్ల పవన్ లెక్కలు, ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. దీంతో ఆయన అదనంగా మరో సినిమా చేసే అవకాశం లేదంటున్నారు జనసేన నేతలు. ఏదేమైనా 2023లో కూడా పవన్ సినిమా సెట్స్ పైనే ఉంటే, ఆయన పెద్ద రిస్క్ చేస్తున్నట్టే లెక్క.