ఇంటెలిజెంట్, మేధస్సు.. ఈ పదాలు చాలా వరకూ చదువులోనే ఉపయోగిస్తూ ఉంటారు మన జనాలు. మ్యాథ్స్ లోనో, సైన్స్ లోనో బాగా మార్కులు తెచ్చుకున్న వారు, లేదా పోటీ పరీక్షలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం పొందిన వారిని ఇంటెలిజెంట్స్ గా పిలుస్తూ ఉంటారు. సదరు వ్యక్తిని ఇంటెలిజెంట్ అంటూ కీర్తిస్తూ ఉంటారు. అయితే.. వారి సంగతెలా ఉన్నా, తమ ఎమోషన్స్ ను మేనేజ్ చేసుకుంటూ, అవతలి వారిని అర్థం చేసుకుంటూ, మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసే వారే సిసలైన ఇంటెలిజెంట్స్ అని చెప్పవచ్చు. నువ్వే ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఆర్థికంగా – సామాజికంగా ఏ స్థితిలో ఉన్నావో నీ ఇంటెలిజెన్స్ ఏమిటనేది చెప్పదు, నీ మానసిక పరిస్థితి, అవతలి వారిని నువ్వు ట్రీట్ చేసే తీరే అసలైన ఇంటెలిజెన్స్. మరి నిజమైన ఇంటెలిజెంట్స్ ఎలా ఉంటారంటే..
ఇతరులను అర్థం చేసుకోగలిగాలి..
అవతలి వారి ఫీలింగ్స్ ఏమిటి, ఆ పరిస్థితుల్లో వారు ఏమనుకుంటున్నారో గ్రహించగలగడం గొప్ప మేధస్సు. అలాగని మనసులో ఉన్నది ఎవరూ చదివేయలేరు. అయితే.. తెలిసిన వారితో అయినా, అవతల వారి గురించి పూర్తిగా తెలియకపోయినా.. ఆ సందర్భానికి, పరిస్థితికి అనుగుణంగా అవతలి వారిని అర్థంచేసుకోవడం, అంతకు తగ్గట్టుగా ప్రవర్తించడం.. గొప్ప మేధో లక్షణం. చదువు, స్టేటస్ లేకపోయినా.. ఇలా అవతలి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించగల మనస్తత్వం కొందరిలో ఉంటుంది. ఎంత చదువుకున్నా, మరెంత స్టేటస్ ఉన్నా.. కొందరు అవతలి వారి పట్ల కాస్త ఎంపథీని, కొంత కంప్యాషన్ ను చూపించలేని వారు కోకొల్లలు.
జ్ఞాన తృష్ణ ఉండాలి..
చదువకూ, జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. చదువుకోవడం ముగస్తుందేమో కానీ, తెలుసుకోవడం ఎప్పటికీ ఆగిపోదు. చదువు మరెవరో చెబుతారేమో, తెలుసుకోవడం మాత్రం సొంతంగా చేయాలి. అది జీవితాంతం సాగుతూనే ఉంటుంది. మన చుట్టూ ఏం జరుగుతోంది.. అనేదాంతో మొదలుపెడితే, కొత్త కొత్త విషయాలను, విశేషాలను నిత్యం తెలుసుకునే వారు, సొంతంగా అధ్యయనం చేస్తూ ఉండే వారు సిసలైన ఇంటెలిజెంట్స్. ఇంటర్నెట్ రోజుల్లో ఇది చాలా సులభమైన విషయం. ఇగ్నోరెన్స్ ఇప్పుడు కేవలం ఒక చాయిస్ మాత్రమే! కొత్త విషయాలను తెలుసుకోవాలనే క్యూరియాసిటీని కలిగిన వారు నిస్సందేహంగా జ్ఞానులే!
స్వీయ నియంత్రణ..
ఏ సందర్భంలో అయినా, ఎలాంటి విషయంలో అయినా తనను తాను నియంత్రించుకోగలిగి, ఆవేశంతో కాకుండా ఆలోచనతో స్పందించేవారికి మించిన జ్ఞానాలు మరొకరు ఉండరేమో! అతిగా స్పందించడం, ఆవేశంగా స్పందించడం కాకుండా.. పరిస్థితులను అర్థం చేసుకుని, వ్యవహరించే వారు, ఏ బలహీనత విషయంలో అయినా తమను తాము మార్చుకోగలిగారు గొప్ప ఇంటెలిజెంట్స్.
గుడ్ మెమొరీ..
గుర్తుకు ఉంచుకోవడం కూడా ఇంటెలిజెంట్ లక్షణమే. అయితే మంచి విషయాలనే సుమా, గతాన్ని, అనుభవాలను గుర్తెరిగి వ్యవహరించడానికి మించిన మేధస్సు ఏముంటుంది?
గోయింగ్ విత్ ఫ్లో..
నిజమే, ప్రవాహానికి కొట్టుకుపోతున్న రీతిలో జీవితంలో సాగిపోయే వారే సిసలైన ఇంటెలిజెంట్స్. ఏదో లక్ష్యాన్ని పెట్టుకుని అది తప్ప మరోటి జీవితమే కాదన్నట్టుగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనే గొప్ప కాదు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన కొందరు ఆ ఎదుగుదల తప్ప మరోటి లేకుండా గడిపారంటూ వారి సక్సెస్ స్టోరీలను రాసే వాళ్లు చెబుతూ ఉంటారు. అలా అనుకున్నది సాధించవచ్చేమో కానీ, దాని వల్ల జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి రావొచ్చు. జీవితాన్ని ఆస్వాదించే అవకాశమే లేకపోవచ్చు. అలా కాకుండా.. లక్ష్యాలను కలిగి ఉండి కూడా, గోయింగ్ విత్ ఫ్లో.. గా వెళ్లే వాళ్లే కరెక్ట్. జీవితం ఎలాంటి పరిస్థితులను కనిపించినా.. వాటిని తగ్గట్టుగా మారుతూ ముందుకు వెళ్లడమే సిసలైన ఇంటెలిజెన్స్. మరి ఈ లక్షణాలు మీకు ఉంటే.. మీ ఇంటెలిజెన్స్ ను మీరే అభినందించుకోండి!