ఏ చిన్న అవకాశం చిక్కినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ముందు వరుసలో ఉంటారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాల పాలిట షర్మిల పార్టీ ఆరో ఫింగర్గా తయారైంది.
వైఎస్సార్టీపీపై మౌనం పాటించడం ద్వారా షర్మిల రాజకీయ ఉనికి గుర్తించకుండా చేయాలనే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. అయితే తెలంగాణలో అన్ని రకాల వ్యతిరేక పరిస్థితుల మధ్య రాణించేందుకు షర్మిల ప్రయత్నిస్తుండడాన్ని అభినందించాల్సిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణలో గోదావరి వరదల వెనుక అంతర్జాతీయ కుట్రలున్నాయని సీఎం కేసీఆర్ అనుమానించడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ సాగుతోంది. ఇదే విషయమై కేసీఆర్‌పై ట్విటర్ వేదికగా షర్మిల బరస్ట్ అయ్యారు. ఓ రేంజ్లో కేసీఆర్‌ను షర్మిల విమర్శించారు. షర్మిల ట్వీట్ ఏంటంటే…
“ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్,
ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్,
తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్,
జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది,
ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్.
ఒక్క వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్ మన KCR దొర గారికి”
అంటూ ఘాటైన సెటైర్ విసిరారు. గోదావరి వరదతో భద్రాచలం జలమయమైన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడి వరద తాకిడికి ప్రాణ నష్టం సంభవించింది. పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతలకు గురై, రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రాంతాలను సీఎం కేసీఆర్ సందర్శించిన సమయంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానాల్ని వ్యక్తం చేయడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.
తెలంగాణ, ఇండియా దాటి ఇప్పుడు అంతర్జాతీయ కుట్రలను రాజకీయ స్వార్థానికి తెచ్చావా? అని కేసీఆర్‌ను నిలదీయడం గమనార్హం. కేసీఆర్ కుట్ర ఆరోపణలను ప్రత్యర్థులు ఆయుధంగా ఎంచుకుని తిరిగి ఆయనపైనే ప్రయోగిస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది.