మోదీ గ్రాఫ్ పైకి లేస్తోందా?

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పైకి లేస్తోందా ? ఇంత కరోనా విపత్తులోనూ జరగుతున్న విశ్లేషణ ఇది. కరోనా మహమ్మారి దేశం మీద దాడి చేస్తున్నప్పటినుంచి దేశంలో రాజకీయాలు మాట్లాడటం బందయ్యింది. రాజకీయ నాయకుల…

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పైకి లేస్తోందా ? ఇంత కరోనా విపత్తులోనూ జరగుతున్న విశ్లేషణ ఇది. కరోనా మహమ్మారి దేశం మీద దాడి చేస్తున్నప్పటినుంచి దేశంలో రాజకీయాలు మాట్లాడటం బందయ్యింది. రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలకు కళ్లెం పడింది. ఒకరినొకరు తిట్టుకోవడం మానేశారు.

దేశంలో ఎక్కడా రాజకీయ కార్యకలాపాల ఊసు లేకుండా పోయింది. దేశం మొత్తం లాక్ డౌన్ చేశారు. అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. దేశ జనాభాలో 90 శాతం మంది ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎవ్వరి నోటి నుంచీ రాజకీయాల మాటే రావడంలేదు.

కరోనా మహమ్మారి పడగ విప్పడానికి ముందు వరకు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్పీఆర్, ఎన్నార్సీ ని వ్యతిరేకిస్తూ దీర్ఘ కాలంగా దేశమంతా తీవ్ర ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీ అయితే అట్టుడికి పోయింది. షహీన్ బాగ్ ఆందోళనకారులకు నిలయంగా మారింది. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు ఆందోళనకారులను షహీన్ బాగ్ నుంచి బలవంతంగా పంపించారు.

పలు రాష్ట్రాలు సీఏఎ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేశాయి. అసలు దేశంలో మరో సమస్య ఏదీ లేనట్లుగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ మూడింటి మీదనే దేశాన్ని అట్టుడికించాయి. ప్రతిపక్షాల ఆందోళనలకు కొన్ని విదేశాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ ఆందోళనలు జరగుతున్న క్రమంలోనే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ప్రభ దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపించింది. ప్రధాని మోదీ పరపతి తగ్గుతున్న తీరు కనబడింది.

మోదీ పని ఇక అయిపోయినట్లేనని కొందరు మేధావులు, పాత్రికేయులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కలకలం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. భారతదేశం ఉష్ణ ప్రాంతమని, ఇక్కడ ఏమీ కాదని కొందరు ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు.

చివరకు నెమ్మదిగా ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఏకు మేకవుతోంది. దీంతో సోషల్ డిస్టాన్సింగ్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతుండటంతో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా బంద్ చేశారు. జనతా కర్ఫ్యూకు బాగా స్పందన వచ్చింది. ప్రజలు పూర్తిగా సహకరించారు.

ఇది చూసిన మోదీ మోడీ మూడు వారాల అంటే 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. ఇన్ని రోజులా అంటూ పెదవి విరిచిన కొందరు తీవ్రమవుతున్న కరోనా కాటును  చూసి మంచి పనే అంటున్నారు. దేశాన్ని లాక్ డౌన్ చేయడానికి అమెరికా వెనుకాడినా మోదీ వెనుకాడకుండా నిర్ణయం తీసుకున్నారని కొన్ని దేశాలు ప్రశంసించాయి. మోడీకి బద్ధ శత్రువు సోనియా గాంధీ సైతం ఇది మంచి నిర్ణయమన్నారు.

మోదీ ప్రసంగాలు కూడా ప్రజలను ఆలోచింపచేశాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మోదీ సరైన సమయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆయన చర్యలను మెచ్చుకుంటున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశాన్ని రక్షించుకోవడం కష్టమయ్యేదని చెబుతున్నారు. ఇటలీ, మరికొన్ని దేశాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. ఆ దుర్భర స్థితి మనకు రాకూడదని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు మోడీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. చాలా కాలంగా ఉద్యమాలతో అతలాకుతలమౌతున్న దేశంలో ఇప్పుడు ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. కరోనా త్వరలో దేశం నుంచి కనుమరుగైతే మాత్రం మోదీ రేంజ్ పెరగడం ఖాయం.

బన్నీ ఎంత ఇచ్చాడో తెలుసా

నిరుపేద కళాకారులకు నిత్యావసరాలు సరఫరా చేసిన రాజశేఖర్