చంద్రబాబు తీరు గురువింద గింజ తరహాయేనా

గురువింద గింజ తన నలుపు ఎరగదన్నది సామెత. ప్రతిపక్ష నేత,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇది బాగా అతుకుందనుకోవచ్చు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాని, ఇతరత్రా కాని చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు…

గురువింద గింజ తన నలుపు ఎరగదన్నది సామెత. ప్రతిపక్ష నేత,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇది బాగా అతుకుందనుకోవచ్చు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాని, ఇతరత్రా కాని చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఈ సామెతను గుర్తు చేస్తున్నాయి.

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఆయన తన సోదరి షర్మిలకు అన్యాయం చేశారని, తెలంగాణలో రోడ్డుపై పడేశారని అంటూ ఏవేవో మాట్లాడారు. పదవులు ఇవ్వలేదని, ఆస్తులు ఇవ్వలేదని ఆరోపణ చేస్తున్నారు. నిజంగా షర్మిల మీద సానుభూతితో ఈయన ఈ విషయాలు మాట్లాడలేదన్నది బహిరంగ రహస్యమే. జగన్ పై ఏదో రకంగా అపవాదులు వేయడానికి చంద్రబాబు ఈ విమర్శలు సాగిస్తున్నారు.

షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ తన అభిప్రాయం స్పష్టంగానే చెప్పారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎలాంటి విభేదాలు లేవని, అయితే తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టవద్దన్నది తన అభిప్రాయమని, ఈ అంశంలో ఇద్దరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఫెయిర్ గా చెప్పేశారు. అలాగే షర్మిల కూడా తనకు జగన్ తో ఇతర విభేదాలు ఏమీ లేవని , ఆయన ఇక్కడ రాజకీయ పార్టీ వద్దన్న భావనలో ఉన్నారని చెప్పారు. 

అంటే షర్మిల స్వయంగా తన రాజకీయ లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు. ఆమె మార్గం ఎలా ఉంటుంది?దాని ఫలితం ఎలా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అది వేరే విషయం. కాని ఇక్కడ చంద్రబాబు జోక్యం అవసరం లేదు. లేదా ఒక పద్దతిలో మాట్లాడితే అది వేరే సంగతి.కాని చంద్రబాబు ద్వేషంతో మాట్లాడుతున్నారు. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు తన సమీప బంధువుల నుంచి ఎలాంటి వ్యాఖ్యలు ,విమర్శలు,దూషణలకు గురయ్యారో ఆయనకు గుర్తు లేకపోయినా, చరిత్ర తెలియచెబుతుంది.

1994లో అసాధారణ మెజార్టీతో ఉమ్మడి ఎపిలో అదికారంలోకి వచ్చిన ఎన్.టి.రామారావును పది నెలల్లో చంద్రబాబు అధికారచ్యుతుడిని చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఎన్.టి.రామారావు చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. తాను చంద్రబాబుకు తండ్రితో సమానమని, కాని అతను మానవత్వం లేకుండా వ్యవహరించి ద్రోహం చేశాడని విమర్శించారు. మోసగాడని, తనకన్నా పెద్ద నటుడు అని..ఇలా రకరకాల దూషణలతో దుమ్మెత్తిపోశారు. 

తన అల్లుడే తనకు ద్రోహం చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. చివరికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తుతో పాటు,బ్యాంక్ లో ఉన్న డెబ్బై ఐదు లక్షల రూపాయలను కూడా చంద్రబాబే కైవసం చేసుకున్నారన్న ఆగ్రహం, ఆవేదనతో కన్నుమూశారు. షర్మిల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తన సొంత మామను ఏమి చేసినట్లు? చివరికి ఎన్.టి.ఆర్.ప్రాణాలే కోల్పోయారే? మరో విషయం. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడుకు 1999 లో చంద్రబాబు టిడిపి టిక్కెట్ ఇవ్వలేదు. తదుపరి కొంతకాలానికి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. 

ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ రామ్మూర్తి నాయుడు తన అన్న చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాక ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు పోటీచేస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి అన్నపై పోటీకి రెడీ అని కూడా సవాల్ చేశారు. కారణాంతరాల వల్ల 2004 లోఆయనకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. చంద్రబాబు తల్లి అమ్మణమ్మకు హైదరాబాద్ శివారులో ఐదు ఎకరాలు ఉంటే ఆ స్థలంలో తమ్ముడికి  భాగం పెట్టకుండా తన కుమారుడు లోకేష్ పేరున ఆయన రాయించేసుకున్నారని లక్ష్మీపార్వతి చెబుతుంటారు. మరి అది ఆస్తి వివాదం అవుతుందా? లేదా?

తన బావమరిది హరికృష్ణ 1999 ఎన్నికలకు ముందు అన్న టిడిపి పేరుతో రాజకీయ పార్టీని పెట్టి ఎన్నికలలో పోటీచేశారు. ఆయన గెలవలేకపోయారు. అది వేరే విషయం. అంతకుముందు ఎన్.టి.ఆర్.పై తిరుగుబాటు సందర్భంలో హరికృష్ణను చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నది అందరికి తెలుసు. ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతి వ్యతిరేకంగా హరికృష్ణ వివిధ ప్రాంతాలలో పర్యటించి తండ్రికి అప్రతిష్ట తెచ్చారు. 

తదుపరి తండ్రిని పదవి నుంచి దించడంలో హరికృష్ణ తనవంతు పాత్ర పోషించారు. దానికి ప్రతిగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేశారు.  ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సి ఉండగా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా హరికృష్ణకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే హరికృష్ణ సెంటిమెంటుతో ఒక నక్కను పెంచేవారట. దానిని ఆయన ఎవరిపై కోపం ఉంటే ఆ పేరుతో పిలిచేవారని, దానిని చూసిన వారు చెప్పేవారు.

ఇక లక్ష్మీపార్వతి కూడా సొంతంగా ఎన్.టి.ఆర్.టిడిపిని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరో నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా చంద్రబాబు వాడుకుని వదలివేశారన్న విమర్శ ఉంది. ఎన్.టి.ఆర్ .పై తిరుగుబాటు సందర్భంగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి హామీ ఇచ్చారని చెబుతారు.ఎన్.టి.ఆర్. ను పదవి నుంచి దించివేశాక దగ్గుబాటిని పక్కన పెట్టేశారు. ఆయా విషయాలను ఆయన తన పుస్తకంలో కూడా రాశారు.  తదుపరి దగ్గుబాటి ఎన్.టి.ఆర్.టిడిపి అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

ఆ తర్వాత బిజెపికి దగ్గరయ్యారు. తదుపరి టిడిపికి దగ్గరవడానికి ప్రయత్నించినా దరిదాపులకు కూడా రానివ్వలేదు. 2004లో దగ్గుబాటి తన సతీమణి పురందేశ్వరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే కాగా, పురందేశ్వరి ఎమ్.పిగా గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఎన్.టి.ఆర్.మరో కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి టిడిపికి వ్యతిరేకంగా పోటీచేశారు. ఇదంతా చరిత్ర. 

మరి ఇన్ని సన్నివేశాలు చూశాక ఎవరు తమ సొంతవారిని రోడ్డున పడవేశారు? ఎవరు తన సొంత మామను పదవిచ్యుతుడిని చేశారు? వీటన్నిటిని చంద్రబాబు విస్మరించి జగన్ పైన విమర్శలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విమర్శలు చేయడం తప్పు కాదు. కాని అవి కువిమర్శలు కాకూడదు. అవి తనకే తగులుతాయన్న విషయాన్ని వదలిపెట్టి ఎదుటివారిపై నిందలు వేస్తే ఉపయోగం ఏముంది? రాజకీయాలలో ఎవరి అబిప్రాయాలు వారికి ఉండవచ్చు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండడం కొత్త కాదు.అలాగే రాజకీయంగా వ్యతిరేకంగా ఉండడం ఆశ్చర్యం కలిగించేది కాదు.

ఉత్తరప్రదేశ్ లో మూలాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ తమ కుటుంబంలోని వారితో ఎలా వివాద పడింది తెలుసు. రాజకుటుంబీకులుగా పేరొందిన వసుందర రాజే రాజస్తాన్ ముఖ్యమంత్రి అయితే, ఆమె సోదరుడు మాధవరావు సిందియా మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్  ఎమ్.పిగా ఉండేవారు. మాజీ ప్రదాని ఇందిరాగాంధీ కోడళ్లు సోనియాగాంధీ కాంగ్రెస్ ఐ అధ్యక్షురాలు అయితే , మరో కోడలు మేనకా గాంధీ బిజెపిలో ఉన్నారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 

తమిళనాడులో దివంగత నేత కరుణానిధి కుమారులు స్టాలిన్, అళగిరిల మద్య విభేదాలు వచ్చాయి. ఎపిలో తిరువూరు నియోజకవర్గంలో 1952లోనే తండ్రి పేట బాపయ్య కాంగ్రెస్ పక్షాన, ఆయన కుమారుడు రామారావు కమ్యూనిస్టు పార్టీ పక్షాన పోటీచేశారు. తొలిసారి బాపయ్య ఓటమి చెంది, ఆ తర్వాత ఎన్నికలలో విజయం సాధించారు.

ఇలా అనేక ఉదాహరణలు చెప్పవచ్చు.అయితే వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయ విమర్శలకు పరిమితం అయితే చంద్రబాబు వయసుకు, ఆయన హోదాకు హుందాగా ఉంటుంది.లేకుంటే ఆయనకే  అప్రతిష్టగా ఉంటుంది. చంద్రబాబు ఇకనైనా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది. లేకపోతే ఆయన ఎప్పటికీ గురువింద గింజగానే మిగిలిపోతారు.

కొమ్మినేని శ్రీనివాసరావు

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జోగి బ్రదర్స్… జాతి రత్నాలు రివ్యూ