సూర్య మరోసారి దర్శకుడు హరితో చేతులు కలిపాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. కొంపదీసి మరోసారి సింగం సీక్వెల్ వస్తుందా అని టెన్షన్ పడ్డారు. కానీ ఎలాంటి అనుమానాలు, భయాలు అక్కర్లేదని స్పష్టంచేశాడు సూర్య. దర్శకుడు హరితో ఓ కొత్త కథను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు.
సూర్య కెరీర్ లోనే విలక్షణం సింగం సిరీస్. అటు దర్శకుడు హరికి పేరుతో పాటు సూర్యకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమాలవి. అయితే ఎప్పుడైతే సింగం-3 సూపర్ ఫ్లాప్ అయిందో అప్పుడే ఆ సిరీస్ పై అందరికీ మొహం మొత్తింది. ఇలాంటి టైమ్ లో ఆ దర్శకుడితో సూర్య మరో సినిమా ఎనౌన్స్ చేసిన వెంటనే అంతా అవాక్కయ్యారు. కానీ అది సింగం సిరీస్ కాదని స్టుడియో గ్రీన్ క్లారిటీ ఇచ్చింది.
ఏప్రిల్ నుంచి హరి-సూర్య కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుంది. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో మరో కొత్త మాస్ అవతారంలో సూర్య కనిపించబోతున్నాడు. ఈ సినిమా పేరు అరువ. ఇమ్మాన్ ను సంగీత దర్శకుడిగా ప్రకటించారు.
ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. అది ఇలా రిలీజ్ అవ్వడం, హరి సినిమా స్టార్ట్ అవ్వడం వెంటనే జరుగుతాయి.