సినిమా రివ్యూ: పందెంకోడి 2

రివ్యూ: పందెంకోడి రేటింగ్‌: 2/5 బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ తారాగణం: విశాల్‌, రాజ్‌ కిరణ్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, అర్జయ్‌, రామ్‌దాస్‌, గంజాకరుప్పు తదితరులు సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా కూర్పు:…

రివ్యూ: పందెంకోడి
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
తారాగణం: విశాల్‌, రాజ్‌ కిరణ్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, అర్జయ్‌, రామ్‌దాస్‌, గంజాకరుప్పు తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
ఛాయాగ్రహణం: కె.ఏ. శక్తివేల్‌
నిర్మాత: విశాల్‌
రచన, దర్శకత్వం: ఎన్‌. లింగుసామి
విడుదల తేదీ: అక్టోబర్‌ 18, 2018

చిన్న స్టోరీ లైన్‌ని తీసుకుని పరుగులు పెట్టించే కథనంతో, అన్ని కమర్షియల్‌ అంశాలతో కనికట్టు చేయడం లింగుసామి ప్రత్యేకత. అతను దర్శకత్వం వహించిన తమిళ చిత్రాలు రన్‌, పందెంకోడి, ఆవారా తెలుగు వాళ్లని కూడా బాగా ఆకట్టుకున్నాయి. అయితే 'సికిందర్‌' చిత్రంతో బాగా నిరాశ పరిచిన లింగుసామి నాలుగేళ్ల విరామం తర్వాత 'పందెంకోడి' సీక్వెల్‌ విశాల్‌తో తలపెట్టాడు. 'పందెంకోడి' ఒక మంచి యాక్షన్‌ చిత్రమే అయినా కానీ దానికి సీక్వెల్‌ తీసేంత సరంజామా లేదు.

పదమూడేళ్ల తర్వాత విశాల్‌-లింగుసామి కలిసి చేసిన చిత్రానికి 'పందెంకోడి' సీక్వెల్‌ అనే పేరు పెట్టుకోవడం తమపై తామే ఒక భారాన్ని మోపుకున్నట్టు అయింది. 'పందెంకోడి'తో సంబంధం లేకుండా దీనినో ఇండివిడ్యువల్‌ సినిమాగా తీసి వుండొచ్చు. సీక్వెల్‌ అనడం వల్ల కొన్ని పరిమితులు, కొంత రాజీలు అవసరమయ్యాయి. జాతర నేపథ్యంగా సాగే ఈ సీక్వెల్‌ అంతా 'ఏడు రోజుల జాతర' సజావుగా సాగడం మీదే దృష్టి పెడుతుంది. దాంతో సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగింపు వరకు జాతర జరుగుతూనే వుంటుంది.

తమిళ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు తెలుగు వారికి అంతగా కనక్ట్‌ అవ్వవు. పట్నం నేపథ్యంలో ఎక్కువ తారతమ్యాలు లేకపోయినా తమిళ రూరల్‌ నేటివిటీకి, మనకీ అసలు సరిపడదు. సదరు తమిళ ఫ్యాక్షన్‌ని మన సీమ ఫ్యాక్షన్‌లా చిత్రీకరించడానికి అనువాద రచయితలు కృషి చేసినా కానీ, మరీ జాతర నేపథ్యం కావడం వల్ల ఎంత ప్రయత్నించినా మన అభిరుచికి తగ్గట్టుగా ఇది మారలేదు. నేపథ్యాన్ని విస్మరించి, నేటివిటీని పట్టించుకోకుండా ఎంజాయ్‌ చేయడానికి తగ్గ కథ, కథనాలు ఇందులో లేవు.

ఒక జాతర సమయంలో భోజనాల దగ్గర జరిగిన గొడవ కారణంగా భవాని (వరలక్ష్మి) భర్తని పోగొట్టుకుంటుంది. దాంతో అవతలి వాళ్ల ఇంట్లో ఒక్క మగాడు కూడా బతకకూడదని పంతం పడుతుంది. అందర్నీ చంపేస్తారు కానీ ఒక్కడు మాత్రం మిగిలిపోతాడు. అతడికి అండగా ఆ ఊరిపెద్ద రాజారెడ్డి (రాజ్‌ కిరణ్‌) నిలుస్తాడు. ఏడేళ్లుగా నిలిచిపోయిన జాతర మళ్లీ జరిపించి తమ పల్లెకి మంచి రోజులు తీసుకురావాలని అనుకుంటాడు.

కానీ ఈసారి జరిగే జాతర శత్రుశేషం మిగల్చకుండా చేసి పగ నెరవేర్చుకోవాలని భవాని బృందం కాచుకుని కూర్చుంటుంది. వాళ్ల ఎత్తులని చిత్తు చేస్తూ రాజారెడ్డి కొడుకు బాలు (విశాల్‌) తండ్రి మాటని నిలబెట్టడానికి కృషి చేస్తుంటాడు. లింగుసామి ఫామ్‌లో వుంటే రసవత్తరమైన యాక్షన్‌ చిత్రం తీయడానికి ఈమాత్రం స్టోరీ లైన్‌ చాలు. కానీ అతనిప్పుడు మునుపటి ఫామ్‌లో లేడు. అందుకే డెబ్బయ్‌ శాతం పాటు ఒకటే లొకేషన్‌లో, అదే బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

కొన్ని యాక్షన్‌ దృశ్యాల్లో మెరుపులు చూపించినప్పటికీ ఒకప్పుడు తనలోని 'మాస్‌ దర్శకుడిని' మళ్లీ మన ముందుకి తీసుకురాలేకపోయాడు. సీక్వెల్‌ కావడం వల్ల తండ్రి పాత్రకి రాజ్‌ కిరణ్‌నే తీసుకోవాల్సి వచ్చింది. పదమూడేళ్ల క్రితం ఆయనలో వున్న చురుకు ఇప్పుడు లేకపోవడంతో ఆయనపై తీసిన యాక్షన్‌ దృశ్యాలు యాంత్రికంగా తయారయ్యాయి. నిలబడ్డ చోట నుంచి కదలడానికి ఇబ్బంది పడుతుండడం వల్ల 'పందెంకోడి'లో పండిన ఆయన యాక్షన్‌ దృశ్యాలన్నీ ఈ చిత్రంలో పూర్తిగా తేలిపోయాయి.

మీరా జాస్మిన్‌ని పదమూడేళ్ల తర్వాత హీరోయిన్‌గా చూపించడం కుదరదు కనుక ఆమె పాత్ర ఆబ్సెంట్‌ అవడానికి రీజన్‌ ఇవ్వాలి. ఆ రీజన్‌ కూడా సరిగా తట్టలేదేమో… 'ఏదో జరిగింది' అన్నది మాత్రమే చెప్పి మిగతాది బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో కవర్‌ చేసేసారు. పందెంకోడి విజయంలో మీరా జాస్మిన్‌ పాత్ర చాలా ఎక్కువ కనుక ఈసారి కూడా హీరోయిన్‌ క్యారెక్టర్‌ అలాగే తీర్చిదిద్దారు. కీర్తి సురేష్‌ కొంతవరకు మీరాని తలపించినా కానీ అప్పుడు నేచురల్‌గా అనిపించిన క్యారెక్టరైజేషన్‌ ఈసారి బోర్డర్‌ దాటి అతి చేసిన భావన కలిగిస్తుంది.

క్లిక్‌ అయిన క్యారెక్టర్‌ కదా అని కాస్త ఎక్కువ కాన్సన్‌ట్రేషన్‌ పెట్టడం వల్ల వచ్చిన తలనొప్పి అది. ఇక పగతో రగిలిపోయే విలన్‌ ఇక్కడా రిపీట్‌ అయ్యాడు… సారీ అయింది. విలన్‌గా లేడీని పెట్టడమనేది తమిళ దర్శకుల్లో చాలా మందికి సరదా. కానీ అన్ని క్యారెక్టర్లూ 'నరసింహా'లో నీలాంబరి పాత్రల్లా కుదరవు కదా. కనీసం 'పొగరు' చిత్రంలోని శ్రియారెడ్డి పాత్ర మాదిరిగా కూడా ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్ర రూపొందలేదు. జుట్టు విరబోసుకుని, రెప్పలార్పకుండా కనుగుడ్లు ఇంతింత చేసి చూస్తూ, బిగ్గరగా అరుస్తూ… టిపికల్‌ క్యారికేచర్‌లా వున్న ఆ క్యారెక్టర్‌లో క్లూలెస్‌గా కనిపించిన వరలక్ష్మిని చూస్తే జాలేస్తుంది తప్ప ఆమె హీరోకి ఒక త్రెట్‌లా అనిపించదు.

ఈ పాత్ర తాలూకు పగ చుట్టూ కథ నడిపించాలని అనుకున్నపుడు దీనిని ఎంత బలంగా రూపొందించాలి? 'మీరు మగాళ్లేనా… మీకంటే పిల్లాడు నయం' లాంటి సూటి పోటి మాటలు బిగ్గరగా అనిపించడం వల్ల సదరు విలన్‌ కాస్తా సిల్లీగా కనిపిస్తుంది. దానికి తోడు వరలక్ష్మి శరత్‌కుమార్‌ సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ మెయింటైన్‌ చేయడానికి పడ్డ కష్టం వల్ల ఆమె పర్‌ఫార్మెన్స్‌ పరంగా కూడా భవాని పాత్ర తేలిపోయింది. ప్రథమార్ధంలో హీరోతో ఫైట్‌ చేయించడానికి జాప్యం చేయడం, హీరోయిన్‌తో అల్లరి లవ్‌ ట్రాక్‌ నడిపించడం, హీరో తండ్రికి సంబంధించిన కొన్ని పవర్‌ఫుల్‌ సన్నివేశాలుండడం వల్ల కథ ఎక్కడికీ కదలకపోయినా ఒక రేంజ్‌కి భరించగలిగేలా వుంటుంది.

సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి పైన పేర్కొన్న అంశాలకి ఇక స్కోప్‌ లేకపోవడం, పూర్తిగా యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లడంతో భరించలేని భారంగా తయారవుతుంది. తండ్రికి ప్రాణాపాయం వున్నా ఆ సంగతి ఊరికి తెలియనివ్వకుండా జాతర జరిపించే కొడుకు వల్ల ఎమోషన్‌ వర్కవుట్‌ అవుతుందని దర్శకుడు భావించాడు కానీ సదరు సన్నివేశాలన్నీ చాలా ఆర్టిఫిషియల్‌గా వుండడంతో కాలయాపన తప్ప ఏమీ ఒరగలేదు మరి. పతాక సన్నివేశానికి వచ్చే సరికి వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్రకి వెయిట్‌ పెంచడం కోసం 'నీ కన్నీళ్లతోనే ఈ ఊరికి మళ్లీ వర్షం వస్తుంది' అని చెప్పడం, అది అలాగే జరగడం పందెంకోడి పూర్తిగా నేలకొరగడానికి నాకౌట్‌ పంచ్‌లా పని చేసింది.

పందెంకోడి పొగరు చూడాలంటే ఒరిజినల్‌ ఇంకోసారి చూడవచ్చు కానీ కొత్త అనుభూతి కోసమని సీక్వెల్‌ కోడితో పెట్టుకుంటే తల అంతా ముక్కుతో పొడిచి పారేస్తుంది. తమిళ వాళ్ల సంగతేమో తెలియదు కానీ ఈ జాతరని తట్టుకోవడం మన ఊర మాస్‌ సినిమా ప్రియులకి కూడా పెను భారమే సుమీ.

బాటమ్‌ లైన్‌: అరవ జాతర!
– గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: హలో గురు ప్రేమకోసమే…

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి