గీతం మూర్తికి డాలస్లో ఘననివాళి

'గీతం విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల సంఘం' (గానం) ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు డాక్టర్‌.ఎం.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి, గీతం పాలకమండలి సభ్యులు శ్రీ వెలువోలు…

'గీతం విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల సంఘం' (గానం) ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు డాక్టర్‌.ఎం.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి, గీతం పాలకమండలి సభ్యులు శ్రీ వెలువోలు బసవ పున్నయ్య, గీతం హైదరాబాద్‌ అధికారిగా పనిచేస్తున్న శ్రీ.వి.పి. ఆర్చౌదరి(చిన్నా), గీతం విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు శ్రీ వీరమాచినేని శివప్రసాద్లకు ప్రవాసాంధ్రులు పుష్పాంజలితో ఘన నివాళులర్పించారు.

గీతం విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్టెక్సాస్‌ అర్లింగ్టన్లో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ఆనందు పుప్పాల తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకుంటూ గీతం తన భవిష్యత్తుకి చక్కని మార్గాన్ని చూపిందని, తాను ఇప్పుడు అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం కల్పించిందని, ప్రత్యేకంగా తనకు మూర్తిగారితో ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు.

గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్ధులు ప్రసాద్‌రెడ్డి గుజ్జు, చినసత్యం వీర్నపు మాట్లాడుతూ గీతం వల్లే ఈరోజు మాలాంటి వేలాదిమంది ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డామని, చదువు చెప్పిన గీతం విశ్వవిద్యాలయానికి, దాన్ని స్థాపించిన డాక్టర్‌. మూర్తి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు.

25 సంవత్సరాలకు పైగా తానుచేస్తున్న నిస్వార్ధసేవకు గుర్తింపుగా గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవడాక్టరేట్‌ అందుకున్న తొలి ప్రవాస భారతీయుడు డాక్టర్‌. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ మూర్తిగారు పారిశ్రామికవేత్తగా, రాజకీయనాయకుడిగా ఉన్నతశిఖరాలను అధిరోహించినప్పటికీ విద్యావేత్తగానే ఆయన ఎక్కువగా గుర్తింపుపొందడం, విద్యపై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు.

అకుంఠిత దీక్షతో, కఠోర పరిశ్రమతో గీతం విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక పెద్ద విద్యావ్యవస్థగా మూర్తిగారు తీర్చిదిద్దిన తీరు, ప్రతిసంవత్సరం ఇరవై రెండువేల మంది విద్యార్థులు విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు క్యాంపసుల్లో విద్యాభ్యాసం చేయడం గొప్ప విషయం అన్నారు.

అంతేగాక ప్రతిసంవత్సరం అనేకవందల మంది విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం నుండి దేశ, విదేశాలల్లో కార్పొరేట్‌ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.

ఒకగొప్ప మానవతావాదిని, దార్శనికుడిని కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఒకతీరని లోటు అని తోటకూర ప్రసాద్‌ తెలియజేస్తూ వీరిఆత్మలకు శాంతి కలగాలని, ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకడియాల వెంకటరత్నం (గాంధీ) త్వరగా కోలుకోవాలని ఆశించారు.

ఇంకా ఈ సంతాప సభలో డాక్టర్‌.ఉరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శేషారావు బొడ్డు, విజయమోహన్‌ మొదలైన వారు తమ ప్రసంగాల్లో మతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.