చంద్రబాబు వోటరు మీద అలిగారు!

చంద్రబాబుకు కోపం వచ్చింది. అలిగేశారు. రాష్ట్రంలో పాలక పక్షం మీద ఎప్పుడూ అలుగుతారు. ఇతర పక్షాల మీద కూడా అలిగేశారు. ఎప్పుడూ మెచ్చుకునే రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా అలిగేశారు. ఎన్నికల విధానం మీద…

చంద్రబాబుకు కోపం వచ్చింది. అలిగేశారు. రాష్ట్రంలో పాలక పక్షం మీద ఎప్పుడూ అలుగుతారు. ఇతర పక్షాల మీద కూడా అలిగేశారు. ఎప్పుడూ మెచ్చుకునే రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా అలిగేశారు. ఎన్నికల విధానం మీద అలిగేశారు. వోటర్ల మీద అలిగేశారు. మొత్తం బ్యాలట్ మీదే అలిగేశారు. జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికల మీదనే అలిగేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికలు తరువాయి, ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, అని ఎదురు చూసిన నేతే.. వరుసగా గ్రామ పంచాయితీల, పురపాలక సంఘాల ఎన్నికలు చూశాక, ఇప్పుడు ఈ ఏడాది (2011) ఏప్రిల్ లో జరిగిన ఈ ఎన్నికలకు ముఖం చాటేశారు.

‘ఊరక అలగరు మహానుభావులు!’ ఏదో అంతరార్థం వుండే వుంటుంది. పరాజయానికా? అబ్బే! జయాలే కాదు, అపజయాలకూ, అర్థజయాలకూ ఆయన కొత్త కాదు. (మనకి నేరుగా కాకుండా, పొత్తు పెట్టుకున్న పార్టీ వల్ల మనకు సంక్రమించిన జయాలను అర్థజయాల ఖాతాలో వెయ్యవచ్చు లెండి). పంచాయితీ ఎన్నిలకల్లో వచ్చింది పరాజయమే కావచ్చు. 

కాని దానిని ఒప్పుకోవాల్సిన అవసరం ఓడిన పార్టీకి వుండదు. ఎందుకంటే, అసలు ఆ ఎన్నికలు, పార్టీ ప్రాతిపదిక మీద జరగవు. మరీ సొంత జిల్లాలోనే స్వస్థానంలో ఓడితే తప్ప, అపజయాన్ని సులభంగా దాచవచ్చు. కానీ పురపాలక సంఘ ఎన్నికలలోనూ, పరిషత్ ఎన్నికలలోనూ ఆ పప్పులుడకవు. సైకిలంటే సైకిలే. పరుగెత్తినా, పల్టీలు కొట్టినా, పంక్చరయినా పార్టీ గుర్తుక‌. ఇది ఇటీవల జరిగన పురపాలక సంఘ ఎన్నికల్లో జరిగింది. 

తెలుగుదేశం పార్టీకి గెలిచిన వార్డులు కనిపించాయి కానీ, మునిసిపాలిటీలూ, కార్పోరేషన్లూ కానరాలేదు ఒక్క తాడిపత్రి తప్ప. ‘అబ్బే ఇదంతా గాలే’ అనబోయారు. కానీ ఆ గాలి అంతా ‘ఫ్యాను’దే, తనకూ,తనపార్టీకీ నమ్మదగ్గ, నిష్పాక్షిక ఎన్నికల అధికారిగా వున్న నిమ్మగడ్డ రమేషే ఈ విజయాలను ధ్రువీకరించారు. 

అంత మాత్రాన చంద్రబాబు డీలా ఎందుకు పడతారు? పక్కన బీజేపీ వుంది అది మరీ అల్లంత దూరాన వుంది. దాంతో పోల్చినప్పుడు  పవన్ కల్యాణ్ ‘జనసేనే’ మెరుగయిన ఫలితాలు వచ్చాయి. ఖాళీ డబ్బాలో కాసిన్ని నాణేలు పడ్డా, ఘల్లు ఘల్లు మంటాయి. వీరే, ఎంతో ఉత్సాహంగా తర్వాత వచ్చే ఎన్నికలకు సన్నాహమవుతుంటే, చంద్రబాబు యుధ్ధరంగంలో కత్తి కింద పెడతారా? డాలు బోర్లిస్తారా? కాదు. కానే కాదు. మరి?

నాడి తెలిశాక కూడా, ముంజేతిని పదే పదే నొక్కి చూడకూడదు. వరసగా జరిగిన పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో వోటరు నాడి తెలిసిపోయింది. అంటే వైసీపీకి వోటర్లు అనుకూలంగా వున్నారన్న విషయం మాత్రమే కాదు. ప్రతిపక్ష స్థానం అపహరణకు గురి కాలేదని కూడా తెలిసింది. అది ఇప్పటికీ తెలుగుదేశం దగ్గరే వుండిపోయింది. ఈ స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ లో అష్టకష్టాలు పడుతోంది. 

బీజేపీ తెలుగుదేశం పార్టీ కౌగిలి వీడింది, శాశ్వతంగా విడిపోవటానికి కాదు. తిరిగి మళ్ళీ కలవటానికి. బాహువులు గట్టి పడితేనే కానీ దృతరాష్ర్ట కౌగిలింత కు సాధ్యం కాదు. పొత్తు వున్నంత కాలమూ, బాబు కౌగిలిలోనే బీజేపీ నలిగి ముక్కలయ్యింది, ఆ పార్టీ వ్యూహకర్తల అనుమానం. ఈ సారి కలవటం అంటూ వస్తే, బాబే బీజేపీ కౌగిలిలో ముక్కలు కావాలని శపథం చేసుకుని కూర్చున్నారు. 

కానీ  పంచాయితీ, పురపాలక ఎన్నికలు రెండూ, బీజేపీ కన్నా బాబే బలంగా వున్నట్లు ధ్రువ పడింది. అందుచేత బీజేపీ, తెలుగుదేశం పార్టీని బలహీన పరచి, మొదటి ప్రతిపక్ష స్థానంలోకి ఇప్పట్లో రాలేదు. జనసేన మెరుగు పడింది కానీ, పోటీ ఇచ్చేటంతగా కాదు. ఇన్ని విషయాలు వోటరు తెలియచెప్పేశాక, మూడో మారు అతడి  నాడితో పనేముంది? అందుకని అలగటమే అన్ని విధాలా లాభసాటి చర్య.

బహిష్కరించాక వోటమి గురించి విననవసరంలేదు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ స్థానంలో వచ్చిన నీలం సాహ్ని నిష్పాక్షికత మీద నమ్మకంలేదని చెప్పవచ్చు. పదవీ స్వీకారం చేసిన వెంటనే, ఎన్నికల నగారా మోగించటం నచ్చటంలేదని చెప్పవచ్చు. ‘అంపైర్ నా వాడయితే తప్ప ఆట ఆడనని’ తెగేసి చెప్పవచ్చు. వచ్చేమిటి? అనేశారు. కేసును హైకోర్టు వరకూ వచ్చేలా చేశారు. సింగిల్ జడ్జి ‘నో’ అన్నారు. కానీ డివిజన్ బెంచ్ ముందుకు వెళ్ళ వచ్చని పచ్చ జెండా ఊపింది. తీర్పులు ప్రతీ సారి ఆశించనట్లు రావచ్చు, రాక పోవచ్చు. అది వేరే విషయం.

చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించే వరకూ వెళ్ళాల్సి రావటానికి ఇంతవరకూ, ఆయన అనుసరించిన వ్యూహమూ కారణమే. ‘రాష్ర్ట ఎన్నికల అధికారి’ అనే వ్యవస్థ కేంద్రంగానే ఆయన రాజకీయాలను నడిపారు. అప్పటి ఎన్నికల అధికారి, సర్కారు వద్దంటే జరుపుతానని అనేవారు. జరపమంటే, వాయిదా వేస్తానని అనే వారు. 

అంతే కాదు. తెలుగుదేశం పార్టీకీ, ఆయన ఒంటికీ పడని మతపరమైన వివాదాల్లో అనవసరంగా వేలు పెట్టారు. ఎంత బీజేపీతో కలసి ఊరేగినా, గతంలో ఇలాంటి ముద్రలేదు. కానీ,దేవాలయాల్లో విగ్రహ విధ్వంసంలో ‘న్యాయాన్ని’ కాకుండా, ‘మత రాజకీయాన్ని’ వెతికారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను అనతి కాలంలో వూహించారు. ఈ రెండూ  ఆయనకు ప్రతి కూలమయ్యాయి. కాబట్టే ఈ బహిష్కరణను ఆశ్రయించాల్సి వచ్చింది. 

సతీష్ చందర్