అవినీతి భారత్‌.. 81వ స్థానం..!

భారతదేశం చాలా గొప్పదని, ప్రపంచానికి జ్ఞానమార్గం చూపిందని, పవిత్రమైన వేదాలు పుట్టాయని, గొప్ప సంప్రదాయాలకు నిలయమని…ఇలా చాలా విషయాలు చెబుతూ పొగుడుతూవుంటారు. ఇవన్నీ నిజమే కావొచ్చు. కాని ఈ గొప్పతనం, ఘనత, పవిత్రత అంతా…

భారతదేశం చాలా గొప్పదని, ప్రపంచానికి జ్ఞానమార్గం చూపిందని, పవిత్రమైన వేదాలు పుట్టాయని, గొప్ప సంప్రదాయాలకు నిలయమని…ఇలా చాలా విషయాలు చెబుతూ పొగుడుతూవుంటారు. ఇవన్నీ నిజమే కావొచ్చు. కాని ఈ గొప్పతనం, ఘనత, పవిత్రత అంతా గతం. 'మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి' అన్నట్లుగా కథలు చెప్పుకుంటూ ఆనందపడుతుంటాం.

ఇప్పుడు ఆనందించాల్సినంత సీన్‌ లేదు. దశాబ్దాలుగా భారత్‌ అవినీతి దేశంగా, లంచగొండి రాజ్యంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఇందుకు ఉదాహరణగా అనేక ఘటనలను, కుంభకోణాలను చెప్పుకోవచ్చు. ట్రాన్స్‌పెరన్సీ ఇంటర్నేషనల్‌ ప్రతి ఏడాది విడుదల చేస్తున్న అవినీతి దేశాల జాబితాలో ఇండియా పేరు తప్పనిసరిగా ఉంటోంది.

తాజాగా విడుదల చేసిన 2017 జాబితాలోనూ షరా మామూలుగా భారత్‌కు చోటు దక్కింది. 180 దేశాల్లో దీనికి 81 ర్యాంకు దక్కింది. 2016లో 176 అవినీతి దేశాల జాబితాలో దీనికి 79వ ర్యాంకు ఇచ్చారు. తాజా జాబితాలో ట్రాన్స్‌పెరన్సీ ఇంటర్నేషనల్‌ భారత్‌ను 'వరెస్ట్‌ అఫెండర్స్‌ కంట్రీ'గా పేర్కొంది. మామూలు మాటల్లో తీవ్ర అవినీతిపరుల దేశంగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వ రంగంలో జరుగుతున్న అవినీతి ఆధారంగా ట్రాన్స్‌పెరన్సీ ఇంటర్నేషనల్‌ ఈ ర్యాంకులు ఇచ్చింది. ఏషియా పసిఫిక్‌ రీజియన్‌లోని కొన్ని దేశాల్లో అవినీతిని వెలికితీస్తున్న, అవినీతిపై ఉద్యమిస్తున్న జర్నలిస్టులను, కార్యకర్తలను, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను, నిఘా సంస్థల వారిని బెదిరిస్తున్నారని, హత్యలు చేయడానికి వెనకాడటంలేదని ట్రాన్స్‌పెరన్సీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది.

ఇలాంటి పరిస్థితి ఇండియా, ఫిలీప్సీన్స్‌. మాల్దీవుల్లో ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లో అవినీతి, లంచగొండితనం తారస్థాయిలో ఉన్నాయి. జర్నలిస్టుల హత్యలు కూడా ఈ దేశాల్లోనే ఎక్కువగా జరిగాయి. గత ఆరేళ్లలో ఈ దేశాల్లో అవినీతి వ్యవహారాలపై కథనాలు రాసిన 15 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అవినీతి దేశాల జాబితాలో న్యూజీలాండ్‌, డెన్మార్క్‌కు 89, 88 స్థానాలు దక్కగా, సిరియా, దక్షిణ సూడాన్‌, సోమాలియాకు 14,12,9 ర్యాంకులు దక్కాయి.

ఇవి అత్యంత అవినీతికర దేశాలన్నమాట. ఇక చైనాకు 77, బ్రెజిల్‌కు 96, రష్యాకు 135 ర్యాంకు ఇచ్చారు. అవినీతి దేశాల జాబితా తయారుచేయడానికి 0 నుంచి 100 వరకు స్కేలుగా తీసుకుంటారు. 0 అత్యంత ఎక్కువ అవినీతి. అంటే హైలీ కరెప్టడ్‌. 100 వెరీ క్లీన్‌. అంటే అవినీతి రహిత దేశమని అర్థం.