పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటు అయిన నిజనిర్ధరణ కమిటీ తొలిసమావేశంలో ఒకరోజు పర్వం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మేధావులు ఈచర్చల్లో పాల్గొన్నారు. అంతిమంగా.. సమావేశం పూర్తయిన తర్వాత… పవన్ కల్యాణ్ ఓ సుదీర్ఘోపన్యాసమూ తతిమ్మా ప్రముఖులు సంక్షిప్తోపన్యాసాలూ వెలువరించారు. కమిటీ తీర్మానించింది ఏమిటో జయప్రకాశ్ నారాయణ్ వెల్లడించారు. వారం రోజుల్లోగా నిజాలను ప్రజల ముందుంచుతాం అని జేపీ ప్రకటించడం కీలక విషయం.
జయప్రకాశ్ నారాయణ్ తన మాటల్లో ప్రధానంగా నాలుగు అంశాల మీద కమిటీ అధ్యయనం సాగిస్తున్నదని పేర్కొన్నారు. అవి వెనుకబడిన ప్రాంతాలు, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని అనే నాలుగు అంశాల్లో అధ్యయనం జరుగుతుంది. వెనుకబడిన ప్రాంతాల విషయంలో లోక్ సత్తా జయప్రకాశ్ కు చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి.
ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకమైన పన్ను రాయితీలు ఏర్పాటు చేయకుంటే గనుక.. భవిష్యత్తులో మరో ఏర్పాటు వాద పోరాటాలకు దారితీసిన ఆశ్చర్యం లేదని ఆయన రాష్ట్ర విభజనకంటె ముందునుంచి చెబుతూనే ఉన్నారు. ప్రత్యేకహోదా పేరిట రాష్ట్రం మొత్తానికి రాయితీలు కల్పించే వీలు లేకున్నా.. ఈశాన్యంలోని కొన్ని రాష్ట్రాల తరహాలో.. ఏపీలో ఈ రెండు ప్రాంతాలను ప్రత్యేకంగా పరిగణించాలనేది ఆయన కోరిక. దాన్ని కూడా పట్టించుకుంటున్న దిక్కు లేదు. మొత్తానికి దానిమీద కూడా కమిటీ ఏదో ఒకటి తేల్చబోతున్నది. పోలవరం, రాజధాని సంగతులు సరేసరి!
వీరు పరిశీలించబోయే నాలుగో అంశం ప్రత్యేక ప్యాకేజీ అని విన్నప్పుడే ఆశ్చర్యం కలుగుతోంది. కొండంత రాగం తీసి గోరంత పదం పాడినట్టు ఎంతో ఆర్భాటం చేసిన ఈ కమిటీ ఫైనల్ గా తేలుస్తున్నది ఇదేనా అనే చింత కలుగుతోంది.
పవన్ కల్యాణ్ తొలిరోజుల్లో ప్రత్యేకహోదా సాధించేస్తాం.. రాష్ట్రాన్ని ఏకం చేసేస్తా.. తెలుగు ఎంపీల ఇళ్ల వద్ద ఘెరావ్ లు చేసి.. వారిలో కదలిక తెస్తా.. కేంద్రం మెడలు వంచుతా అనే రేంజీలో నానా ప్రగల్భాలు పలికారు. ఆతర్వాత ఇటీవల మళ్లీ మీడియా ముందుకు వచ్చినప్పుడు హోదా కోసం నేను పోరాటం ప్రారంభించగానే.. నేను కాకినాడలో ఉండగా ప్యాకేజీ తెచ్చారు.. అంటూ అక్కడేదో తన పోరాటానికి భయపడి ప్యాకేజీ ప్రకటించినట్లుగా బిల్డప్ ఇచ్చారు. ప్యాకేజీ చాలా గొప్పది అని చంద్రబాబు గారు చెప్పారు.. అదికూడా అబద్ధమని తెలుస్తోంది అంటూ అనుమానాలు వెలిబుచ్చారు.
ప్యాకేజీ గొప్పదని చంద్రబాబు చెబితే ఆయన ఎలా నమ్మారు? పవన్ కల్యాణ్ సొంత విచక్షణ ఏమైంది?
నా తెలివి చాలదు.. నా గొంతు చాలదు అంటూ ఫాల్స్ మోడెస్టీ ప్రదర్శించే పవన్ .. తన పార్టీ మేధావుల్ని అడిగినా చెప్పేవాళ్లు కదా..?
తీరా ఇవాళ రాష్ట్రంలోని మేధావులందరినీ పోగేసి.. అదే దుష్కార్యానికి పాల్పడ్డారు. ప్రత్యేకహోదా అనే పదాన్ని పూర్తిగా మంటగలిపేశారు. తుంగలో తొక్కేశారు. దాన్ని ప్రజలు మరచిపోయేలా చేయడానికి పవన్ కల్యాణ్ మరియు ఈ మేధావుల కూటమి కొత్త కుట్రలు మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. జగన్ పోరాడుతున్నాడా లేదా అనే సంగతి పక్కన పెట్టండి. పాలకపక్షం కాకుండా. రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగిన వారందరినీ పోగుచేసి హోదా అంశాన్ని తొక్కేయడం అనేది జాతికి జరుగుతున్న ద్రోహం లాగా కనిపిస్తోంది. ఇదంతా ఒక వ్యూహాత్మక ద్రోహంగా పరిగణించాల్సి వస్తోంది.
నిజానికి పవన్ కమిటీలో ప్రత్యేకహోదా గురించి మాత్రమే మాట్లాడే చిత్తశుద్ధి ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గానీ, చలసాని శ్రీనివాస్ గానీ హోదా గురించి చాలా గట్టిగా గళం వినిపిస్తుంటారు. అలాంటి వారందరినీ పోగేసి.. హోదా అంశం లేకుండా తీర్మానాలను తయారుచేయడం అంటే.. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించి.. మేధావుల ఫైనల్ డ్రాఫ్ట్ గా తేలితే.. జాతికి ఎంత నష్టమో ఆలోచించాలి.
పవన్ కల్యాణ్ కసరత్తు అంటే.. హోదా సహా ఏది ఎలా సాధించాలా? అనే కార్యాచరణ వస్తుందని ప్రజలు ఆశించారు గానీ.. ఇలా హోదాను మరచిపోయేలా.. మిగిలిన ఊకదంపుడు అంశాలపై వ్యర్థ నివేదికల తయారీకి ఒడిగడుతుందని ఎవ్వరూ ఊహించలేదు.