చంద్రబాబునాయుడు కేంద్రం మీద ‘‘ఒత్తిడి పెంచేస్తాం’’ అని పదే పదే చెబుతున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకోవడం అనే మొక్కుబడి తంతు ఇంకా మిగిలే ఉంది. ఆదివారం మొత్తం కేంద్రలోని భాజపాతో సంబంధాలపై ఎంపీలు, పార్టీ వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఒక్కటే ఆయన కార్యక్రమంగా ఉంది.
ఎన్ని భేటీలు జరిగినా సరే.. చివరికి ‘‘కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి నిర్ణయించాం..’’ అనే ఒకే ఒక పడికట్టు పదంతో చంద్రబాబునాయుడు ముగించేస్తారని… అంతకు మించి ఇన్ని భేటీల ఫలితంగా సాధించేది ఏమీ ఉండదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ‘ఒత్తిడి పెంచుతాం’ అనే పదంతో సరిపెట్టకుండా.. ఆ ఒత్తిడి పెంచడం అనేది ఎలాగో.. అందుకు ఆయన ఏం చేయదలచుకున్నారో.. ఎన్ని దశల్లో ఎంతకాలం ఎదురుచూసి ఏ రకంగా ఒత్తిడిపెంచుతారో.. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక చెబితే తప్ప ఆయన మాటలను నమ్మడం కష్టం అని పలువురు భావిస్తున్నారు.
ఇది కేవలం బడ్జెట్ కేటాయింపుల మీద కలుగుతున్న అసంతృప్తి. అంటే దీని తాలూకు అసంతృప్తి ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితం. అంటే వారి మీద వత్తిడి పెంచి.. జరిగిన పొరబాట్లను సరిదిద్దాలంటే.. కేవలం కొన్ని వారాలు, నెలల వ్యవధిలోగానే అది జరగాలి.
ఆ ఒత్తిడి ఫలితం కూడా కనిపించాలి. ఇంకా నికార్సుగా చెప్పాలంటే గనుక.. పార్లమెంటుకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించడం మాత్రమే ప్రస్తుతానికి పూర్తయింది. బడ్జెట్ ఇంకా సభ ఆమోదం పొందలేదు. సభ ఆమోదం పొందేలోగా.. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ అనుకూల నిర్ణయాలు కేటాయింపులు కొన్ని వచ్చేలాగా చేతనైతే ఒత్తిడి చేయాలి.
ఆ రేంజిలో ఒత్తిడి పెంచగలిగితే, బడ్జెట్ ను సభ ఆమోదించేలోగానే.. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా కొన్ని కేటాయింపులు అయినా వచ్చేలాగా చంద్రబాబు అండ్ కో చేయగలిగితే.. వారికి సాహో అనవచ్చు. అలా కాకుండా ఒత్తిడి పెంచుతాం.. రాష్ట్రానికి రావాల్సింది సాధిస్తాం.. ప్రజాగ్రహాన్ని కేంద్రానికి వివరిస్తాం వంటి పడికట్టు మాటలు చెప్పడం దండగ.
అందుకే కేవలం మాటలు కాకుండా.. ఒత్తిడి పెంచడానికి తమ కార్యాచరణ ప్రణాళిక ఏంటో.. ఎన్ని రోజుల డెడ్ లైన్ తో దాన్ని అమలు చేస్తారో స్పష్టంగా చెబితే మాత్రమే ప్రజలు నమ్ముతారని.. లేకుంటే మరోసారి ప్రజలు ఎదుట నవ్వుల పాలు కాక తప్పదని చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి.