బాబులో కాష్మోరా మళ్లీ లేచింది…!

గతంలో కేసీఆర్‌ను ఎక్కువమంది మాటల మరాఠీ అని, మాటలతో కోటలు కడతారని, కబుర్లతో గారడీ చేస్తారని విమర్శించేవారు. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముందు ఆయనకు ఎందుకూ పనికిరాడనిపిస్తోంది. చంద్రబాబు చెప్పుకుంటున్న గొప్పలు,…

గతంలో కేసీఆర్‌ను ఎక్కువమంది మాటల మరాఠీ అని, మాటలతో కోటలు కడతారని, కబుర్లతో గారడీ చేస్తారని విమర్శించేవారు. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముందు ఆయనకు ఎందుకూ పనికిరాడనిపిస్తోంది. చంద్రబాబు చెప్పుకుంటున్న గొప్పలు, అతిశయోక్తులు వింటుంటే 'బురిడీ బాబు' అనే విమర్శ సరైందేననిపిస్తోంది.

ఆయన ఏం మాట్లాడినా 'మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె' అనే సామెత గుర్తుకొస్తుంది. మాటలతో కోటలు కట్టడం ఎలాగో, జనాలకు అరచేతిలో స్వర్గం చూపించడం ఎలాగో ఈయన్ని చూసి నేర్చుకోవాలి. తాను ఎంత చిన్న పని చేసినా అద్భుతమని, అపూర్వమని, ప్రపంచంలోనే ఎవ్వరూ ఇలాంటి పని చేయలేదని డప్పు వాయిస్తుంటారు.  తాజాగా బాబులో కాష్మోరా మళ్లీ లేచింది.

కాష్మోరా అంటే ఇదేదో దయ్యం అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఆయన చెప్పుకునే గొప్పల్లో ఒకదాన్ని మళ్లీ వల్లె వేశారు. 2016లో ఒలింపిక్స్‌లో పివి సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించినప్పుడు చంద్రబాబు సహా అందరూ ఆమెను ఘనంగా ప్రశంసించారు. బాబు ఆమెకు కోట్ల రూపాయల కానుకలు, ఇళ్ల జాగా, పెద్ద ఉద్యోగం వగైరా ఇచ్చారు. ఇందుకు అభ్యంతరం లేదు.

ఈ సందర్భంగానే బాబు తాను చేయబోయే గొప్ప పని గురించి చెప్పి నవ్వుల పాలయ్యారు. అయినప్పటికీ తాజాగా అదే విషయాన్ని మరోసారి వల్లె వేశారు. ఏమిటది? 'భవిష్యత్తులో రాజధాని అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తా' అని చెప్పారు. మహానగరం హైదరాబాదు రాజధానిగా ఉన్న కేసీఆరే ఈ మాట ఎప్పుడూ అనలేదు.

కాని రాజధాని నిర్మాణంలో ఒక్క అడుగూ ముందుకు పడని బాబు ఇలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. చేయాల్సిన పని గురించి మాట్లాడాలిగాని అవుతుందో కాదో తెలియని పనుల గురించి ఎందుకు? డెబ్బయ్‌ ఏళ్లకు దగ్గరపడుతున్న ఈ నాయకుడు ఎప్పటివరకు అధికారంలో ఉంటారో తెలియదు. కాని 'నేనే ఒలింపిక్స్‌ నిర్వహిస్తా' అంటున్నారు. జన్మభూమి క్రీడలతో ప్రపంచ రికార్డు సృష్టించానని చెప్పారు. ఈ క్రీడల గురించి పక్కనున్న తెలంగాణవారికే తెలియదు. 

కాని ప్రపంచ రికార్డు సృష్టించానని చెప్పుకున్నారు. ఏ పని చేసినా ప్రపంచ రికార్డు అని, చరిత్ర సృష్టించానని, అద్భుతమని ప్రచారం చేసుకోవడం అలవాటైంది.  అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహించడమే తన ధ్యేయమని 2016 ఆగస్టులో బాబు సగర్వంగా ప్రకటించి ఆ తరువాత మరో రెండుమూడుసార్లు గట్టిగా నొక్కి చెప్పారు. అది కూడా రెండేళ్లలోనే. అంటే 2018లోనన్నమాట.

బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన ఆనందంలో బాబు ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదు. ఒలింపిక్స్‌ నాలుగేళ్లకోసారి జరుగుతాయని అందరికీ తెలిసినా బాబుకు తెలియదా? ఏఏ దేశాల్లో ఎప్పుడెప్పుడు ఒలింపిక్స్‌ నిర్వహించాలో కొన్నేళ్ల ముందే డిసైడైపోతుంది. ఇది విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెచ్చుకోవడమంత సులభం కాదు.

రియో తరువాత నాలుగేళ్లకు అంటే 2020లో ఒలింపిక్స్‌ జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతాయి. ఆ తరువాత 2024 కోసం బిడ్డింగ్‌ పూర్తయిందని తెలుస్తోంది. ఇవేవీ తెలియని చంద్రబాబు ప్రపంచంలోనే అద్భుత రాజధాని నిర్మిస్తామని చెప్పినంత తేలిగ్గా ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని ఊదరగొట్టారు. తాను ఏదైనా చేయగలనని చెప్పుకోవడం బాబుకు అలవాటు కదా…!

లక్షల కోట్లు ఖర్చయ్యే ఒలింపిక్స్‌ నిర్వహణ గురించి బాబుకున్న అవగాహన ఏమిటి? అసలు ఒలింపిక్స్‌వంటి మెగా ఈవెంట్‌ను దేశం నిర్వహిస్తుందా? రాష్ట్రం నిర్వహిస్తుందా? అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాగానే 2019 జాతీయ క్రీడలను విజయవాడలో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, కట్టుబట్టలతో రోడ్డుపై పడేశారని, డబ్బులు లేక పుట్టెడు కష్టాల్లో ఉన్నామని చెప్పుకునే బాబు మీసాలకు సంపెంగ నూనె సామెత మాదిరిగానే నేషనల్‌ గేమ్స్‌ ప్రకటన చేశారు.

రాష్ట్రస్థాయి క్రీడలనే మన పాలకులు అవకతవకలుగా నిర్వహిస్తారు. ఇక నేషనల్‌ గేమ్స్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా…! పోనీ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండి, పూర్తిస్థాయిలో వసతులు సౌకర్యాలుంటే అది వేరే విషయం. కాని అవేమీ పట్టించుకోని బాబు జాతీయ క్రీడలు నిర్వహిస్తామని మెహర్బానీగా ప్రకటించారు. కాని ఇప్పటివరకు దీనిపై ఎప్పుడైనా మాట్లాడారా? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీన్ని గురించి మాట్లాడిల్సిన బాబు ఒలింపిక్స్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా లేదా?