చైనా, మన పొరుగు దేశమే. కానీ, శతృదేశం లాంటిది. లాంటిదేంటి, శతృదేశమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, తేనె పూసిన కత్తి లాంటి శతృవన్న మాట. ఇప్పుడీ తేనె పూసిన కత్తి, విషం చిమ్ముతోంది. భారతదేశానికి హెచ్చరికలు చేస్తోంది. 'మీ బలం ఏంటో మీకు తెలుసు కదా, మీ హద్దుల్లో మీరు వుంటేనే మం చిది.. లేదంటే, గత యుద్ధకాలపు పరిస్థితులు పునరా వృతమవుతాయి..' అంటూ చైనా, భారతదేశానికి చేసిన హెచ్చరికల్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
ఎందుకంటే, పాకిస్తాన్‌తో చాలాకాలంగా స్నేహం వున్నా, ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌తో చైనా స్నేహం కనీ వినీ ఎరుగని స్థాయిలో బలపడింది. పాకిస్తాన్ మీద ఈగ వాలినా ఊరుకునే పరిస్థితుల్లో లేదు చైనా. అందుక్కారణాలనేకం. ముఖ్యమైన కారణం, పాకిస్తాన్‌ని ఉపయోగించుకుని, ఆర్థికంగా మరింత బలోపేతమవ్వాలన్నది చైనా యోచన.
ఏ అగ్రదేశానికైనా అదే బలం.!
అగ్రదేశం అన్పించుకోవాలంటే, సైనికోత్పత్తుల ఎగుమతులే ముఖ్యం.. అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఆయుధాల్ని విచ్చలవిడిగా తయారు చేసేసి, వివిధ దేశాల మధ్య కయ్యం పెట్టేసి, అందులో కొన్ని దేశాలతో సఖ్యత పెంచుకుని, ఆయుధ వ్యాపారాన్ని విస్తరించడమే అగ్రరాజ్యాల ఆలోచన. అమెరికా, రష్యా తదితర అగ్ర రాజ్యాలు ఎంతో కాలంగా చేస్తున్నది ఇదే. ఒకప్పుడు తన సైనికావసరాల కోసం చైనా, రష్యా మీద ఆధారపడేది. ఇప్పుడు ఆ అవసరం చైనాకి లేదు. సొంతంగా అత్యాధునిక యుద్ధ సామాగ్రి తయారుచేసుకునే సాంకేతిక పరిజ్ఞానం చైనా సొంతం చేసుకుంది.
అత్యాధునిక జలాంతర్గాములు, భారీ యుద్ధ నౌకలు, అమెరికాని సవాల్ చేసేలా యుద్ధ విమానాలు.. ఇలా ఒకటేమిటి, చైనా ఆయుధ సంపత్తి అభివృద్ధి చెందుతున్న తీరు ప్రపంచానికే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతలా ఆయుధ సంపత్తిని పెంచుకున్నాక, చైనా తక్షణ కర్తవ్యం ఏమవుతుంది.? ఆ ఆయుధాల్లో కొన్నింటిని, ఎవరో ఒకరికి విక్రయించాలి. విక్రయించాలంటే కొనుగోలు దారుడు కావాలి కదా.! ఆ కొనుగోలుదారుడే పాకిస్తాన్. అదీ చైనా – పాకిస్తాన్ మధ్య స్నేహానికి ముఖ్య కారణం.
చైనాకి ఇండియానే సరిజోడీ.?
చైనా తర్వాత ఆ స్థాయిలో ఆయుధ సంపత్తి కలిగి వున్నది భారతదేశమే. భారతదేశానికి, పాకిస్తాన్‌తో ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఆ సంగతి చైనాకి బాగా తెలుసు. చైనాతోనూ, భారత్‌కి సరిహద్దు గొడవలున్నాయి. గతంలో జరిగిన యుద్ధాల్లో భారతదేశం కొంత భూభాగాన్ని కోల్పోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఎలా అంటున్నామో, చైనా ఆక్రమిత కాశ్మీర్ కూడా వుంది. ఏం చేస్తాం, చైనా బలం ముందు తలొగ్గాల్సిన పరిస్థితుల్లో ఆ భూభాగాన్ని మనం కోల్పోయాం.
దీన్ని పట్టుకునే, చైనా ఇంతకాలం తర్వాత బెదిరింపులు షురూ చేసింది. అయితే, భారతదేశం ఒకప్పటిలా లేదు. చైనా ఎలాగైతే అణ్వాయుధాల్ని కలిగి వుందో, ఆ స్థాయిలో కాక పోయినా, మన దగ్గరా అణ్వాయుధాలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చైనాతో పోల్చితే మన సత్తా తక్కు వేమీ కాదు. కానీ, చైనాలా భారత్ ఎప్పుడూ యుద్ధానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించదు. దీన్ని చైనా, మన 'బలహీనత'గా భావిస్తుండడం ఆశ్చర్యకరమే. బహుశా, ఇదంతా పాకిస్తాన్‌ని మెప్పించడానికే కావొచ్చు.
అమెరికాతో స్నేహమే, చైనా కవ్వింపులకు కారణమా.?
ఒకప్పుడు భారత్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది రష్యా. కానీ, ఇప్పుడు ఆ రష్యా విషయంలో మన ఆలోచనలు చాలా చాలా మారిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అమెరికాతో సఖ్యతే మేలని మన పాలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో అమెరికాతో స్నేహం విషయమై అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం.
దాంతో, రష్యా చాలా విషయాల్లో తటస్థంగా వ్యవహరిస్తోంది. అమెరికా పైకి, భారత్‌తో స్నేహంగా వున్నట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అమెరికా వ్యూహాలు వేరు. అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధ అమ్మకందారు. వ్యాపార కోణంలోనే అమెరికా, భారత్‌కి సాయం అందిస్తుందని తెలిసినా, అమెరికాతో చైనాకున్న వైరం కారణంగా అమెరికాతో స్నేహం పెంచుకుంటున్న భారత్‌పై చైనా కస్సుబుస్సులాడుతున్నమాట వాస్తవం.
చైనాతో యుద్ధం తప్పదా.?
చైనా బలగాలు, సరిహద్దుల్లో భారత సైన్యం దురుసుగా ప్రవర్తించడం అనేది చిన్న విషయమేమీ కాదు. అలాగని, యుద్ధానికి కారణమయ్యేంత పెద్ద విషయమూ కాదు. 'ఎన్నో దశాబ్దాలుగా చైనాతో సరిహద్దు వివాదా లున్నా తూటా పేలలేదు..' అని ఓ సందర్భంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యల తర్వాత కొద్ది కాలంలోనే చైనా – భారత బలగాలపై బాహాబాహీకి దిగడం గమనార్హం. భారత్ – పాక్ మధ్యనే యుద్ధం జరిగే పరిస్థితుల్లేనప్పుడు, భారత్ – చైనా మధ్య యుద్ధం జరుగుతుందని భావించడంలో అర్థమే లేదు. యుద్ధ భయాన్ని పెంచి, పైశాచిక ఆనందాన్ని పొందాలనుకుంటోంది చైనా. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.
– సింధు