తెలుగు సినిమాల్లో ఈ మధ్య చిత్రమైన వ్యవహారాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. కావాలని ఏరి కోరి మాంచి టెక్నీషియన్లను సినిమాల కోసం తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్నవాళ్లు ఎక్కువగా పలు భాషల్లో, వాళ్ల వాళ్ల ప్రొఫెషన్ లో కాస్త నిష్ణాతులై వుంటారు. ఇలాంటి ప్రొఫెనలిస్ట్ లకు మన డైరక్టర్లకు సింక్ కావడం కష్టమవుతోంది. దీంతో మధ్యలోనే మర్యాదగా తప్పుకుంటున్నారు.
కేవలం అరకొర టాలెంట్ వుండి, డబ్బుల కోసం పని చేసే వాళ్లయితే ఏదో విధంగా డైరక్టర్లతో ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోతారు. కానీ వీళ్లు ప్రొఫెషనలిస్ట్ లు. అందుకే రాజీ పడలేక, ప్రాజెక్టుల దగ్గర నుంచి తప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ అ..ఆ దగ్గర నుంచి ఇలా చాలా సినిమాలకు జరిగింది.
ఇప్పుడు లేటెస్ట్ గా నాని నటిస్తున్న ఎంసిఎ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ దివకర్ మణి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దివకర్ మణి మంచి సినిమాటోగ్రాఫర్. తొలిసారి తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమాకు పనిచేసాడు.
ఆ సినిమా సినిమాటోగ్రఫీకి మాంచి అప్లాజ్ వచ్చింది. అది చూసి నాని-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లోని ఎంసిఎ సినిమాకు ప్రత్యేకంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా డైరక్టర్ వేణు శ్రీరామ్ కు దినకర్ మణికి అంతగా సింక్ కాలేదని తెలుస్తోంది. దాంతో దినగర్ మణి సింపుల్ గా ఆ ప్రాజెక్టు నుంచి వాకవుట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.