సరికొత్త సైబర్ అటాక్.. 'వాన్నా క్రై' పేరుతో ఓ వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. బ్రిటన్ ఆల్రెడీ ఈ వైరస్ దెబ్బకు విలవిల్లాడుతోంది. తాజాగా, భారతదేశంలోనూ ఈ వైరస్ జాడలు కన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలోని కంప్యూటర్లు హ్యాక్‌కి గురవడంతో పోలీస్ శాఖ ఉలిక్కిపడింది.
కంప్యూటర్‌కి సంబంధించినంతవరకు వైరస్లు సర్వసాధారణమే. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త వైరస్, కంప్యూటర్లను మింగేస్తోంది. ప్రధానంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని టార్గెట్ చేసుకుని, ఈ వైరస్‌ని సృష్టించినట్లు తెలుస్తోంది. వైరస్‌కి విరుగుడు కోసం అప్పుడే ప్రయత్నాలు జోరందుకున్నాయి. మరోపక్క, వైరస్ దెబ్బకు బలైపోతున్న కంప్యూటర్లలోని సమాచారాన్ని రాబట్టేందుకు నిపుణులు నానా తంటాలూ పడాల్సి వస్తోంది.
సంస్థలు, వ్యక్తుల పేర్లతో వచ్చే మెయిల్స్‌ని ఓపెన్ చేసే విషయంలో జాగ్రత్తగా వుండడం, ప్రస్తుత పరిస్థితుల్లో యాంటీవైరస్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ల నుంచి కంప్యూటర్లను రక్షించుకోవచ్చు. అయితే, ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లతో, అప్డేటెడ్ యాంటీ వైరస్ వున్నాసరే, కంప్యూటర్లు వైరస్ బారిన పడ్తూనే వున్నాయి.
తాజా వైరస్ దెబ్బతో, కంప్యూటర్ వినియోగదారులు, సంస్థలు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు సుస్పష్టం. వైరస్ దాడికి గురైన కంప్యూటర్ల స్క్రీన్‌పై, అన్లాకింగ్ కోసం ఫలానా మొత్తం చెల్లించాల్సిందేననే మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. పేర్కొనబడిన మొత్తం చెల్లించినా, కంప్యూటర్లో డేటాకి భద్రత లేని పరిస్థితి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి సుమారు వంద దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు విలవిల్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచం ఇప్పుడు కంప్యూటర్ వ్యవస్థ మీదనే నడుస్తోంది చాలావరకు. వంద దేశాలకు పైగా ఈ వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయంటే, ఇది ఏ స్థాయి ‘దాడి’ అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రపపంచంలోనే అతి పెద్ద సైబర్ దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు ఆ రంగ నిపుణులు.