ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ చాలకాలం తరువాత ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతున్న పరిస్థితి కనబడుతోంది. పొరుగున్న ఉన్న తమిళనాడులో జల్లికట్టు కోసం అక్కడి యువత చేసిన చేసిన, ఇంకా చేస్తూనే ఉన్న పోరాటం నుంచి స్ఫూర్తి పొందిన ప్రతిపక్షాల నాయకులు ఏపీ యువత కూడా అలా పోరాడితే హోదా తప్పకుండా వస్తుందని నమ్ముతున్నారు.
'రండి పోరాడండి. మేం మీకు మద్దతు ఇస్తాం' అంటూ ప్రేరణ కలిగిస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో యువత గుమికూడుతుందని చెబుతున్నారు. ఇదెలా జరుగుతుందో ఇప్పుడు చెప్పలేంగాని హోదాపై సినిమా ప్రముఖులు ప్రధానంగా టాప్ హీరోలు స్పందించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి తమిళ టాప్ హీరోలు మద్దతు ఇవ్వడమే కాకుండా మొత్తం సినిమా పరిశ్రమ తన కార్యకలాపాలు పూర్తిగా బంద్ చేసుకొని అండగా నిలబడింది. ఏపీలోనూ అదే పరిస్థితి రావాలని హోదా డిమాండ్ చేస్తున్నవారు కోరుకుంటున్నారు.
ప్రత్యేక హోదా సాధన సమితి అనే సంస్థ ఉంది. రెగ్యులర్‌గా టీవీ చర్చల్లో కనిపించే ఏపీ మేధావుల ఫోరం నాయకుడు చలసాని ప్రసాద్‌వంటి వారు ఈ సమితి నాయకులు. ప్రత్యేక హోదాపై మాట్లాడాలని, స్పందించాలని ఆ సమితి కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను డిమాండ్ చేసింది. వీరు టాప్ హీరోలు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులు కూడా. కాని ప్రత్యేక హోదా సాధన సమితి ఆశించినట్లు ఈ హీరోలు స్పందిస్తారా? చిరంజీవి కాంగ్రెసు పార్టీ నాయకుడు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటారేమో. బాలకృష్ణ టీడీపీ నాయకుడు కాబట్టి ఆయన ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు. ఏదైనా అభిప్రాయం చెప్పినా అది డొంక తిరుగుడుగా చెప్పాల్సివస్తుంది లేదా మౌనంగా ఉండాల్సివస్తుంది.
ఒకవేళ హోదా కోసం పోరాటం మొదలై తీవ్రంగా జరిగే పరిస్థితి ఏర్పడిందనుకుందాం. బాలయ్య దాంట్లో వేలు పెట్టే అవకాశం ఉండదు. చిరంజీవి ఎంతవరకు పాలుపంచుకుంటారో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు హీరోలకు హోదా గురించే కాదు, రాష్ట్రం గురించి ఆలోచించే తీరికే లేదు.
బాలయ్య గౌతిమిపుత్ర శాతకర్ణి, చిరంజీవి ఖైదీ నెం.150 ఘన విజయాలను ఆస్వాదించడంలో యమ బిజీగా ఉన్నారు. టీవీ ఛానెళ్లలో ఈ సినిమాలపై చర్చలే చర్చలు. ఇంటర్వ్యూలు. జనాలకు ఊదరగొట్టిపారేస్తున్నారు. చిరంజీవిని 'బాస్ ఈజ్ బ్యాక్' అని ఆకాశానికి ఎత్తుతున్నారు. బాలయ్య బ్యాక్ వెళ్లి మళ్లీ రాలేదు కాబట్టి ఆయన్ని ఏమీ అనడంలేదేమో. చిరంజీవి 151, 152 సినిమాలు కూడా ప్రకటించేశారు. దర్శకులను ఫిక్స్ చేశారు. 150 సినిమా విజయంతో ఆయనలో ఉత్సాహం ఉరకలేస్తోంది. 'గత పదేళ్లలో నా కుటుంబంలో ఉత్సాహం చూడలేదు' అని చిరు చెప్పారు. అంటే దీనర్ధం ఏమిటి? కుటుంబ సభ్యులంతా చిరు సినిమా రంగంలోనే ఉండాలని కోరుకుంటున్నారన్నమాట.
రాజకీయాల్లోకి వెళ్లి ఆయన బావుకున్నది ఏమీ లేదని వారి అభిప్రాయం. బహుశా చిరంజీవి అభిప్రాయం కూడా ఇదే అయ్యుండొచ్చు. అందుకే మరో ఆలోచనకు తావు లేకుండా రెండు సినిమాలు ప్లాన్ చేశారు. పదేళ్ల గ్యాప్ వచ్చిన తరువాత కూడా తన హోదా తగ్గలేదని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఆ హోదాను ఎంజాయ్ చేస్తున్న చిరు ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కి పోరాడతారా? ఇక బాలయ్య అధికార పార్టీ వ్యక్తి కాబట్టి హోదా గురించి ఆలోచించే అవకాశమే లేదు. వందో మైలురాయి దిగ్విజయంగా దాటడంతో యమ ఖుషీగా ఉన్న బాలయ్య మరో విజయం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేవారు వీరి నుంచి ఏమైనా ఆశించగలరా?