పరువు కోసం ‘శీతాకాలం’ మటాష్‌…!

పరువు సమస్య మనుషులకే కాదు ప్రభుత్వాలకూ ఉంటుంది. సమాజంలో పరువు నిలబెట్టుకోవడం కోసం సొంత పిల్లలనే హత్య చేసిన సందర్భాలున్నాయి. వీటినే 'పరువు హత్యలు' (ఆనర్‌ కిల్లింగ్స్‌) అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా…

పరువు సమస్య మనుషులకే కాదు ప్రభుత్వాలకూ ఉంటుంది. సమాజంలో పరువు నిలబెట్టుకోవడం కోసం సొంత పిల్లలనే హత్య చేసిన సందర్భాలున్నాయి. వీటినే 'పరువు హత్యలు' (ఆనర్‌ కిల్లింగ్స్‌) అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా పరువు సమస్య వచ్చిపడింది.

ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అన్న భావనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పరువు నిలబెట్టుకోవడం కోసం అసెంబ్లీ శీతాకాల సమావేశాలనే పక్కన పెట్టేసింది. అంటే ఈ ఏడాది ఈ సమావేశాలను నిర్వహించాలనుకోవడంలేదు. పార్లమెంటు, అసెంబ్లీలు ఏడాదికి మూడుసార్లు సమావేశాలు జరుపుతుండటం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం తెలంగాణలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలూ జరగాలి. గత ఏడాది డిసెంబరులోనే హైదరాబాదులో జరిగాయి. కాని ఈ ఆనవాయితీని సర్కారు బ్రేక్‌ చేసింది. ఎందుకు? అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చాలా సమయం పడుతుంది. ఇక్కడ భవనం పూర్తికాకపోతే హైదరాబాదులో నిర్వహించవచ్చు కదా. అక్కడ అసెంబ్లీ భవనం ఇంకా ఏపీ సర్కారు అధీనంలోనే ఉంది. 

నిజమే నిర్వహించుకోవచ్చు. కాని అక్కడ నిర్వహించేందుకు మొహం చెల్లదు. ఎందుకు? పదేళ్లపాటు  హైదరాబాదు ఉమ్మడి రాజధాని. అక్కడి అసెంబ్లీని వినియోగించుకునేందుకు ఏపీకి హక్కుంది కదా. కరెక్టే. కాని హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోమని, శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని గత సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. వీడ్కోలు ప్రసంగాలు చేశారు. వాస్తవానికి గత సమావేశాలే అమరావతిలో నిర్వహించాలని అనుకున్నారు. కాని అసెంబ్లీ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో మూడు రోజులపాటు హైదరాబాదులోనే నిర్వహించారు. అప్పుడే కోడెల ఓ నిర్ణయానికొచ్చారు. ఏమని? తరువాతి సమావేశాలను డిసెంబరులో అమరాతిలోనే నిర్వహించాలని. అప్పటికి అక్కడ అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తవడం ఖాయమనుకున్నారు. కాని అనుకున్నదొకటి…అయ్యింది మరొకటి అన్న సామెతలా అయింది.

హైదరాబాదులో గత అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున 'ఇక హైదరాబాదుతో బంధం తెగిపోయింది. ఇక్కడ ఇవే చివరి సమావేశాలు. వచ్చే సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయి' అని కోడెల వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  హైదరాబాదు అసెంబ్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగంతో మాట్లాడారు. కళ్లు చెమ్మగిల్లాయి కూడా. ఎన్నో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సచివాలయం తరలిపోయింది. అసెంబ్లీ అధ్యాయం ముగిసిపోయింది. సో…హైదరాబాదుతో ఏపీ బంధం తెగిపోయిందనే భావనతో నాయకుల హృదయాలు బరువెక్కిపోయాయి. వెలగపూడిలో జరిగే శీతాకాల సమావేశాల్లో  ప్రభుత్వంపై అనేక అంశాల్లో వీరలెవెల్లో దాడి చేయాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ కాచుకుని ఉంది. కాని అసెంబ్లీ భవనం పూర్తికాలేదు. మళ్లీ హైదరాబాదుకు వెళ్లాలంటే పరువు సమస్య.  వీడ్కోలు పలికేశాక మళ్లీ వచ్చారేం? అని అడిగితే జవాబు చెప్పడం ఇబ్బందిగానే ఉంటుంది.

డిసెంబరులోగా అసెంబ్లీ భవనం పూర్తయ్యే అవకాశం లేదని మీడియాలో చాలాకాలం క్రితమే కథనాలొచ్చాయి. ఇప్పుడదే నిజమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకూడదనుకుంటున్న ప్రభుత్వం దాన్ని మరోవిధంగా సమర్ధించుకుంటోంది. వింటర్‌ సెషన్‌ తప్పనిసరిగా నిర్వహించాలనే నిబంధన రాజ్యాంగంలో లేదట….! అదో ఆనవాయితేయే తప్ప నిబంధన కాదట…! కాబట్టి నేరుగా  ఫిబ్రవరిలో బడ్జెటు సమావేశాలే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ సమాయానికి అసెంబ్లీ పూర్తవుతుందని చెబుతున్నారు. అందులోనూ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా రాష్ట్రంలో లేరు. 

బ్రిటన్లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాలకు వెళ్లారు. వాస్తవానికి అసెంబ్లీలో చర్చించాల్సిన, సర్కారును నిలదీయాల్సిన అనేక ప్రజాసమస్యలున్నాయి. ప్రధానంగా డీమానిటైజేషన్‌, నగదురహితం, ప్రత్యేక ప్యాకేజీ అమలు…ఇలా ఎన్నో అంశాలపై గట్టిగా మాట్లాడాలని వైకాపా ప్లాన్‌ చేసుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు జరక్కపోవడం కూడా వైకాపాకు ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుంది. ప్రజాసమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం భయపడిందని ప్రచారం చేయొచ్చు. నిజానికి శీతాకాల సమావేశాలు జరిగినా ప్రజాసమస్యలు చర్చకు వస్తాయనే నమ్మకం లేదు. ఎప్పటిమాదిరిగానే పనికిమాలిన యుద్ధమే కదా.