పవర్‌స్టార్‌.. ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌

ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే నోటకొచ్చినట్లు మాట్లాడేసే రాజకీయ నాయకులు కొందరుంటారు. కాస్త ఆగి, ఆలోచించి ఆ సంఘటనపై పూర్తిస్థాయిలో అవగాహనతో స్పందించేవారు ఇంకొందరు రాజకీయ నాయకులు. ప్రస్తుత తరం రాజకీయాల్లో ఇలాంటివారు చాలా…

ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే నోటకొచ్చినట్లు మాట్లాడేసే రాజకీయ నాయకులు కొందరుంటారు. కాస్త ఆగి, ఆలోచించి ఆ సంఘటనపై పూర్తిస్థాయిలో అవగాహనతో స్పందించేవారు ఇంకొందరు రాజకీయ నాయకులు. ప్రస్తుత తరం రాజకీయాల్లో ఇలాంటివారు చాలా చాలా చాలా అరుదుగా కన్పిస్తారు. ఇక, మూడో రకం.! దొంగలు పడ్డ ఆర్నెళ్ళకి.. అన్నట్లుగా, తమకు తోచినప్పుడు ఏదో ఒకటి మాట్లాడేసి 'ప్యాకప్‌' అనేస్తారు. ఆ టైపు పొలిటీషియన్‌ని ఏమనాలి.? అంటే, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అనాలేమో.! 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ప్రస్తుతానికైతే 'ప్రత్యేక హోదా' ముగిసిన అధ్యాయం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాటల్లో అయితే చెల్లని నోటు. బీజేపీ దృష్టిలో, అది కాలగర్భంలో కలిసిపోయిన అంశం. కానీ, పవన్‌కళ్యాణ్‌ దృష్టిలో మాత్రం అది అత్యంత కీలకమైన విషయం. అఫ్‌కోర్స్‌, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే కీలకమని అంటున్నారనుకోండి.. ఆయనంటే, నిత్యం ఏదో ఒక సందర్భంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే వున్నారు. పవన్‌కళ్యాణ్‌ అలా కాదు కదా, ఆయనకు నిద్రలో ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే 'ప్రత్యేక హోదా' అని కలవరిస్తారు. తేడా అదీ.! 

రాజకీయాల్లో బహుశా పవన్‌కళ్యాణ్‌ అంతటి గాఢ నిద్ర ఇంకెవరికీ వుండదేమో. ఈయన్ని సింపుల్‌గా ఈ తరం కుంభర్ణుడు అనేయొచ్చు.. రాజకీయాలకు సంబంధించినంతవరకు. సినీ రంగంలో పవన్‌కళ్యాణ్‌కి తిరుగులేని యూత్‌ ఫాలోయింగ్‌ వుంది. తెరపై ఆయన ఓ రేంజ్‌లో చెలరేగిపోతాడు. రాజకీయాల్లోనే, మరీ బద్దకం ప్రదర్శిస్తారు. బద్దకం.. అనంటే, ఆ పదమే కాస్త సిగ్గుపడ్తుందేమో.. ఆ స్థాయి బద్ధకం పవన్‌కళ్యాణ్‌ది. 

రోహిత్‌ వేముల ఆత్మహత్య ఏనాటి ఘటన.? దాని గురించి రేపు పవన్‌కళ్యాణ్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తాడట. పెద్ద పాత నోట్ల రద్దు అంశం.. ఇదెప్పటి వ్యవహారం.? నెల రోజుల క్రితం నాటిది. అఫ్‌కోర్స్‌, ఇంకా ఆ పెయిన్‌ జనాన్ని వెంటాడుతోందనుకోండి.. అయినా, పవన్‌కళ్యాణ్‌ ఇప్పటిదాకా మౌనం దాల్చి, ఇప్పుడు హడావిడి చేస్తానంటే ఎలా.? గో వధ అంశంమైతే మరీ దారుణం. మళ్ళీ ఇప్పుడు ఈ అంశంపై పవన్‌ మాట్లాడటమంటే, కొత్తగా ఆయన వివాదాన్ని రాజేస్తున్నట్లే. 

దేశభక్తి గురించి పవన్‌కళ్యాణ్‌ చాలా చాలా చాలా గొప్పగా మాట్లాడేస్తుంటారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం, పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదం నిత్యం మారణహోమం సృష్టిస్తూనే వుంది. యురి ఘటనపైనగానీ, ఆ తర్వాత జరిగిన ఘటనలపైనగానీ కనీసం పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా కూడా స్పందించలేదు. దేశభక్తి గురించి పవన్‌ ఇప్పుడు మాట్లాడతానంటే ఎలా.? ఐదు అంశాలు.. అన్నీ దాదాపుగా ఔట్‌ డేటెడ్‌ అంశాలే. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌లో పవన్‌కళ్యాణ్‌ చాలా అప్‌డేటెడ్‌గా సినిమాల్లో కన్పిస్తారు. రియల్‌ లైఫ్‌లో అందుకు పూర్తి భిన్నం. మరీ ఛాదస్తం అన్పించేలా వుంటుందాయన తీరు. రాజకీయాల్లో మరీనూ.! 

అందుకే, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల వరకూ మాత్రం ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అనవసరం.