నేర నిరూపణ కోసం మన దేశంలో 'న్యాయవ్యవస్థ' చాలా చిత్రంగా పనిచేస్తుంటుంది. 'వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్లేదు.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు..' ఇదీ మన సిద్ధాంతం. దురదృష్టవశాత్తూ, వందమంది దోషులూ తప్పించుకుంటున్నారు.. నిర్దోషులకూ శిక్ష పడ్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది నిజం.
దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ళ కేసునే తీసుకుందాం. ఈ కేసులో ఏళ్ళతరబడి విచారణ కొనసాగింది. చివరకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇండియన్ ముజాహిదీన్కి చెందిన తీవ్రవాదుల్ని దోషులుగా తేల్చింది. శిక్ష ఖరారవ్వాల్సి వుంది. ఆ శిక్ష ఏంటి.? మరణ శిక్షా.? లేదంటే, యావజ్జీవ కారాగార శిక్షా.? అన్నది వచ్చే సోమవారం తేలుతుంది. ఇంకో ఘటనలో, తీవ్రవాది బుర్హాన్వనీ ఎన్కౌంటర్ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం, అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించింది.
ఈ రెండు ఘటనలూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓ కేసులో దోషికి శిక్ష పడితే, ఇంకో కేసులో దోషికి 'నజరానా' ప్రకటించినట్లయ్యింది. నేరస్తుడు బుర్హాన్వనీ, ఆయన కుటుంబమేం చేసింది పాపం.? అని సరిపెట్టుకుందామా.! లేదంటే, తీవ్రవాదాన్ని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని అనుకుందామా.? అలాగైతే, రేప్పొద్దున్న దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ళ కేసులో ఉరిశిక్ష గనుక దోషులకు పడితే, వారి కుటుంబాలకీ నష్టపరిహారం ప్రకటించేయొచ్చన్నమాట.
మన దేశం ఎటువైపు పయనిస్తోంది.? దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నాం.? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన సందర్భమిది. దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ళ కేసులో ఎంతమంది చనిపోయారు.? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి.? 18 మంది చనిపోయిన ఈ ఘటనలో 131 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలది ఒక రకమైన దీనగాధ అయితే, గాయపడ్డవారి మనోవేదన వర్ణించడం ఎవరితరమూ కాదు. నేరస్తులకి ఇంకా శిక్ష పడలేదు. కానీ, బాధిత కుటుంబాలు ఇంకా ఇంకా శిక్ష అనుభవిస్తూనే వున్నాయి. కొందరికి మరణ శిక్ష, మిగతావారికి యావజ్జీవ శిక్ష.. అనుకోవాలేమో.!
ఇలాంటి ఘటనల తర్వాతైనా, పాలకుల ఆలోచనల్లో మార్పులు రావాలి. తీవ్రవాదంపై రాజకీయ కోణంలో ఆలోచిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ పోతోంటే, దేశానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు.? దేశానికి ప్రమాదకరంగా మారింతి తీవ్రవాదం మాత్రమే కాదు, ఇలాంటి రాజకీయం కూడా. దేశద్రోహులకి నజరానాలు ఇచ్చుకుంటూ పోవడం దేశద్రోహమెందుకు కాబోదు.?
చిత్రంగా, ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా నోరు మెదపడంలేదు. ఎవరి రాజకీయ అవసరాల వారివి. అందుకే, దేశమిలా రావణకాష్టంగా తగలబడ్తోంది. ఏమో, రానున్న రోజుల్లో తీవ్రవాద నేరాల్లో దోషులకు శిక్షలు కాకుండా, బహుమతులు ఇవ్వాలని పాలకులు చట్టాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎనీ డౌట్స్.?