సర్సికల్ స్ట్రైక్స్.. శతృదేశం పాకిస్తాన్‌పైనే కాదు.. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదంపైనే కాదు.. దేశంలో పెరిగిపోయిన నల్ల తీవ్రవాదులపైన కూడా చేయొచ్చని ప్రధాని నరేంద్రమోడీ నిరూపించారు. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎలాగైతే సైన్యం నిర్వహించిందో, ఇప్పుడు అదే తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ నల్ల కుబేరుల మీద కూడా జరిగింది. పాకిస్తాన్ ఎలాగైతే మింగలేక కక్కలేక గింజుకుందో, మన దేశంలోని నల్ల రాక్షసుల పరిస్థితి కూడా అదే.
500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. ఇకపై ఇప్పటిదాకా చెలామణీలో వున్న 500, 1000 నోట్లు పనికిరావు. వాటిని బ్యాంకుల్లో మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు. సామాన్యులకు కాస్త ఇబ్బందికరమైన విషయమే. కానీ, ఇబ్బంది తప్పదు. ఎందుకంటే అది నష్టం కలిగించే పని కాదు కాబట్టి. నల్లకుబేరుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోడానికి వీల్లేదు మరి.!
కొత్తగా 500 నోట్లతోపాటు, 2000 రూపాయల నోట్లు కూడా చెలామణీలోకి వస్తున్నాయి. అయితే, అవి బ్లాక్ మనీగా మారేందుకు చాలా సమయం పడ్తుంది. అసలు దానికి ఆ అవకాశం వుండదని కేంద్రం భావిస్తోందనుకోండి.. అది వేరే విషయం. బ్యాంకుల్లో 500, 1000 నోట్లు మార్చాలనుకునేవారికి సైతం కొన్ని షరతులు విధిస్తుండడంతో, నల్లధనానికి పూర్తిగా ఝలక్ ఇచ్చినట్లే భావించాల్సి వుంటుంది.
అంతా బాగానే వుందిగానీ, రాత్రికి రాత్రి అమలవుతున్న ఈ నిర్ణయంతో జనజీవనం ఏమయిపోతుంది.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రేపు బ్యాంకులు పనిచేయవు. రెండు రోజులపాటు ఏటీఎంలు పనిచేయవు. మరి, డబ్బులెలా వస్తాయ్.? దేశమంతా ఇప్పుడు ఇదే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెల్లారితేనేగానీ భవిష్యత్ అర్థం కాదు.
కొసమెరుపు: 500, 1000 రూపాయల నోట్ల చెలామణీ ఆగిపోయింది గనుక.. వాటిని ఎవరైనా స్వీకరించారో, అది మీ ఖర్మ.. అనేసింది ఆర్బిఐ. తస్మాత్ జాగ్రత్త.. 500, 1000 నోట్లు ఎవరన్నా ఇస్తే తీసుకునేందుకు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి.. మీరు బ్యాంకులో మార్చుకోవాలన్నా లెక్కలు చూపించి తీరాల్సిందేనేమో.!