రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ శిబిరంలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి.. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ శిబిరంలో ఆందోళన పెరిగిపోతోంది.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఈ ఇద్దరి మధ్యా ఈక్వేషన్లు శరవేగంగా మారిపోతున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం, హిల్లరీ భారీ మెజార్టీతో ట్రంప్‌పై విజయం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ట్రంప్‌లో మొదటినుంచీ ఒకేరకమైన కాన్ఫిడెన్స్ కన్పిస్తోంది.
మీడియా మొత్తంగా ట్రంప్‌కి వ్యతిరేకంగా పనిచేసినాసరే, హిల్లరీ తన ఇమేజ్‌ని తాను నిలబెట్టుకోలేకపోతున్నారు. గతంలో 30 – 70 అన్నట్లుగా అంచనాలుండేవి. అవిప్పుడు చాలా చాలా దగ్గరకు వచ్చేశాయి. 49 – 51 అన్నట్లుగా తయారయ్యాయి. ఇప్పటికీ 'తూకం'లో హిల్లరీకే మొగ్గు ఉన్నా, అది చాలా చాలా తక్కువ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అనూహ్య పరిణామం హిల్లరీ క్లింటన్‌కి షాకిచ్చేలానే వుంది.
ఓ రెండు నెలల క్రితం నాటి పరిస్థితులకీ, ప్రస్తుత పరిస్థితులకీ స్పష్టమైన తేడా కన్పిస్తోంది. అంతిమంగా ఓటరు ఏం తేల్చుతాడోగానీ, తాజా అంచనాలైతే అనూహ్యంగా పుంజుకుంటున్న ట్రంప్ ఇమేజ్‌ని స్పష్టం చేస్తున్నాయి. మీడియా ద్వారా ఎంత హైప్ క్రియేట్ చేసుకుంటున్నా, అనూహ్యంగా తన ఇమేజ్ పడిపోతుండడం హిల్లరీకి ఏమాత్రం రుచించని విషయమే.
అన్ని డిబేట్లలోనూ హిల్లరీదే పై చేయి అయినప్పటికీ, అమెరికన్ల ఆలోచనల్లో ఈ మార్పు అక్కడి రాజకీయ విశ్లేషకులకే షాకిస్తున్నాయట. అయితే, ఇప్పటికీ హిల్లరీ వైపే మొగ్గు వుందన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ హిల్లరీ వర్గం పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా, లోలోపల వారి మాటల్లో ఆందోళన స్పష్టంగా కన్పించేస్తోంది. నిన్న మొన్నటిదాకా పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. నేనే కాబోయే అధ్యక్షుడిని.. అంటూ ట్రంప్ కాలర్ ఎగరవేసేస్తున్నారు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.. భారతదేశం పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు.. ముస్లిం వ్యతిరేకి.. ఇలాంటి ప్రచారాలేవీ ట్రంప్ దూకుడుని ఆపలేకపోతున్నాయి.. పైగా ఈ ప్రచారాలు ఎక్కువయ్యాకే, ట్రంప్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. ఇంతకీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎలా వుండబోతోంది.? ఈ పరిస్థితుల్లో హిల్లరీ వ్యూహాలు ఎలా వుంటాయి.? తనకు పెరుగుతున్న ఇమేజ్‌ని ట్రంప్ ఎలా ఇంకా పెంచుకోగలుగుతారు.? వేచి చూడాల్సిందే.