ఆట అన్నాక గెలుపోటములు సహజమే. కానీ, కొన్ని ఓటముల్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేం. క్రికెట్లో గెలుపోటముల్ని అంచనా వేయడం కష్టం. ఒక్కోసారి గెలిచే మ్యాచ్‌ని చేజార్చుకోవాల్సి వస్తుంది.. గెలవలేని మ్యాచ్‌ని గెలిచేసుకునే ఛాన్సొస్తుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ని కైవసం చేసుకున్న టీమిండియా, రెండో మ్యాచ్‌ని చేజార్చుకుంది. తేలిగ్గా గెలిచేస్తుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా బొక్క బోర్లా పడింది. మాంఛి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో వున్న టీమిండియా, 242 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చతికిలపడ్డం అందర్నీ విస్మయానికి గురిచేసింది. కొత్త కుర్రాడు కేదార్ జాదవ్ చేసిన 41 పరుగులు మాత్రమే అత్యధిక స్కోర్ టీమిండియాకి.
తొలుత బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్ ఓ దశలో 300 పరుగుల స్కోర్‌ని అందుకుంటుందని అంతా అనుకున్నారుగానీ, చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో, 242 పరుగులకే న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ పరిమితమయ్యింది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. ముగ్గురు మినహా, టీమిండియాలో మొత్తం 8 మందీ బ్యాటింగ్ చేయగలిగేవారే.. కానీ, ఆ 8 మందీ జట్టుని విజయపథాన నడపలేకపోవడం చిత్రమే.
ఫాస్ట్ బౌలింగ్ చేయగలిగీ, బ్యాటింగ్ చేయగల హార్దిక్ పాండ్యాని ధోనీ బ్యాటింగ్ లైనప్‌లో ఎందుకు చివరి వరకూ పక్కన పెట్టేశాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. చివరిదాకా మ్యాచ్ రసపట్టులో సాగిందంటే కారణం హార్దిక్ పాండ్యా మాత్రమే. రెండు మూడు వికెట్లు పడగానే హార్దిక్ పాండ్యాని దించి వుంటే, మ్యాచ్ ఫలితం ఇంకోలా వుండేదేమో. బహుశా, ప్రయోగం చేయాలనుకున్న ధోనీ, ఇలా బోల్తా కొట్టేసి వుండొచ్చుగాక.!