తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఎందరోమంది క్రీడాకారులున్న దేశం మనది. నిరుపేద కుటుంబం నుంచి స్టార్స్ ఆవిర్భవిస్తున్నారని సంబరపడిపోవడమే కాదు, ఆ స్థాయిలో వున్న క్రీడాకారులకు ప్రభుత్వాలు చేయూతనివ్వలేకపోతున్నందుకు సిగ్గపడాల్సిన సందర్భమిది. ఒలింపిక్ గేమ్స్‌లోనూ, ఇతర అంతర్జాతీయ క్రీడల పోటీల్లోనూ సత్తా చాటుతున్న క్రీడాకారులు, తినడానికి తిండి లేక.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకునీడుస్తున్న ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగచూస్తూనే వున్నాయి. అయినా, మన పాలకులు మారరుగాక మారరంతే.!
ఇప్పుడిదంతా ఎందుకంటే, రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పతకం తీసుకురాకపోయినా, దేశం దృష్టిని ఆకర్షించింది. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ఫీట్స్ చేసి, ప్రపంచాన్ని నివ్వెరపరిచింది దీప. అందుకే ఆమెను ఒలింపిక్ స్టార్‌గా అభివర్ణిస్తున్నాం. ఆమెకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా, బీఎండబ్ల్యూ కారుని హైద్రాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బహూకరించిన విషయం విదితమే. ఒలింపిక్ విజేతలు పివి సింధు, సాక్షి మాలిక్, పీవీ సింధు కోచ్ గోపీచంద్‌లకు కూడా ఈ కార్లను బహూకరించారాయన.
అయితే, అలా తనకు దక్కిన బీఎండబ్ల్యూ కారుని మెయిన్‌టెయిన్ చేయలేకపోతోంది దీపా కర్మాకర్. వాస్తవానికి, బీఎండబ్ల్యూ కార్ల బహూకరణ సందర్భంలోనే ఈ విమర్శలు అక్కడక్కడా విన్పించాయి. ఖరీదైన కార్లను బహూకరించేకన్నా, ఆర్థిక సహాయం అందించి వుంటే బావుండేదన్న వాదనలు తెరపైకొచ్చాయి. కానీ, బహుమతి కారు రూపంలో అయితే పబ్లిసిటీ ఎక్కువ వస్తుందని చాముండేశ్వరినాథ్ అనుకున్నారో ఏమోగానీ, ఇప్పుడా బహుమతి ఆమెకు ఎందుకూ పనికిరాకుండా పోయింది.
ఈ ఎపిసోడ్‌లో ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, క్రీడాకారులకి సహాయం అందించే క్రమంలో పబ్లిసిటీ స్టంట్స్‌ని దూరంగా పెట్టాలని. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రకటించే నజరానాలు, క్రీడాకారులకు అందకపోవడమో, ఆలస్యమవడమో జరుగుతుంటుంది. అది వారిని అవమానించినట్లే భావించాలి. 'ప్రకటించేశాం..' అంటే కుదరదు కదా.! వేలంపాట తరహాలో కోటి, రెండు కోట్లు, ఐదు కోట్లు.. ఇలా బహుమతుల్ని ప్రకటించేసి, పబ్లిసిటీ పొందడం సంగతెలా వున్నా, ఆ బహుమతుల వల్ల ఆ క్రీడాకారులకి ఎలా మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలి. లేకపోతే, ఇదిగో.. ఇలాగే బహుమతులు 'వైట్ ఎలిఫెంట్స్'లా తయారవుతాయి. టాలెంట్, ఎంకరేజ్‌మెంట్‌ని కోరుకుంటుంది.. అదే సమయంలో, ఆ టాలెంట్‌కి ఆర్థిక సహాయం కూడా అవసరం. వైట్ ఎలిఫెంట్స్ లాంటి బహుమతులు కావు.!