ట్రంపు.. కంపు.. అదే ఇంపు.!

ట్యాక్స్‌ ఎగ్గొట్టాడనే ఆరోపణలు.. మహిళలపై నీఛాతి నీఛమైన వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలు.. ఒకటేమిటి.? అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఏ అభ్యర్థీ ఇప్పటిదాకా ఎదుర్కోనన్ని విమర్శల్ని డోనాల్డ్‌ ట్రంప్‌ ఎదుర్కొంటున్నాడు. అమెరికా అంటే…

ట్యాక్స్‌ ఎగ్గొట్టాడనే ఆరోపణలు.. మహిళలపై నీఛాతి నీఛమైన వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలు.. ఒకటేమిటి.? అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఏ అభ్యర్థీ ఇప్పటిదాకా ఎదుర్కోనన్ని విమర్శల్ని డోనాల్డ్‌ ట్రంప్‌ ఎదుర్కొంటున్నాడు. అమెరికా అంటే ఆషామాషీ కాదు. సూపర్‌ పవర్‌ కంట్రీ. ప్రపంచాన్ని తన కనుసైగలతో నడిపిస్తున్న దేశం అమెరికా. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎలా వుండాలి.? ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించినవారంతా 'మిస్టర్‌ క్లీన్‌' అనడం సంగతెలా వున్నా, ఖచ్చితంగా పవర్‌ఫుల్‌ క్యాండిడేట్స్‌ అని చెప్పక తప్పదు. 

ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలతో సన్నిహిత సంబందాలు నడపగల, అవసరమైతే ఏ దేశంతో అయినా యుద్ధం చేయగల వ్యూహాల్ని రచించేలా అమెరికా అధ్యక్షుడి 'పవర్‌' వుంటుంది. మరి, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌లలో ఆ 'పవర్‌' ఎవరికి వుంది.? అంటే, చాలామంది ఆన్సర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే. హిల్లరీ ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్లలో ట్రంప్‌ మీద పై చేయి సాధిస్తున్నాసరే, ట్రంప్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గడంలేదు. 

ట్రంప్‌కి వ్యతిరేకంగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన చుట్టూ ఎన్ని వివాదాలున్నాసరే, ట్రంప్‌ దూకుడు మాత్రం యధాతథంగా కొనసాగుతోంది. హిల్లరీతో పోల్చితే ట్రంప్‌ అపర కుబేరుడు. అలా డబ్బు వెదజల్లి, రాజకీయాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఓ పక్క విన్పిస్తున్నా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డబ్బుతోనే పనైపోతుందనుకోవడం పొరపాటు. నిజానికి, హిల్లరీ క్లింటన్‌కి వున్నంత మీడియా పవర్‌, ట్రంప్‌కి లేదు. ఇక్కడే ట్రంప్‌కి, కొందరి నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. హిల్లరీని మీడియా వెనకేసుకొస్తూ వాస్తవాల్ని మభ్యపెడుతోందన్న ఆవేదన వున్నవారంతా ట్రంప్‌కి మద్దతుగా నిలబడ్తున్నారు. 

ఇక, ట్రంప్‌ నగ్న ఫొటోలు, వీడియోలు.. ట్రంప్‌ గత చరిత్ర.. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం, సందర్భానుసారం వెలుగు చూస్తున్నాయి. అసలే నోటి కంపుకి బ్రాండ్‌ అంబాసిడర్‌.. అన్పించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, ఆ కంపునంతటినీ ప్రత్యర్థిపైకి వెదజల్లుతున్నారు. కంపు.. అంటూ ఇక్కడ, అత్యంత దారుణమైన విమర్శలు అని అర్థం. కామ్‌గా కనిపిస్తూనే, హిల్లరీ – ట్రంప్‌కి ధీటుగానే సమాధానమిస్తున్నారు. ఓదశలో ట్రంప్‌ని మించిపోతున్నారామె. ఇక్కడే ట్రంప్‌కి ఎడ్జ్‌ దొరికేస్తోంది. 

ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంతకు ముందెన్నడూ చూడని వింత ఇది. అధ్యక్ష బరిలో నిలిచిన ఇద్దరు ప్రముఖులు ఈ స్థాయిలో తిట్ల దండకం, బూతుల దండకం అందుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్‌కి మహిళల పిచ్చి.. అని హిల్లరీ ఆరోపిస్తోంటే, క్లింటన్‌ని (హిల్లరీ భర్త బిల్‌ క్లింటన్‌) సెక్స్‌ ప్రిడేటర్‌ అనేశాడు ట్రంప్‌. ఇది విమర్శలకే పరాకాష్ట అనుకోవాల్సిందే. 

ఏదిఏమైనా, దూకుడులో ట్రంప్‌ని హిల్లరీ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచాన్ని తన కనుసైగలతో శాసించాలంటే ఆ దూకుడు అవసరమన్నది అమెరికాలోని ఓ వర్గం భావన. అదే ట్రంప్‌కి కలిసొచ్చేలా వుంది. మామూలుగా అయితే, హిల్లరీ ముందు నిలబడలేని పరిస్థితి వుందక్కడ. అంతలా మీడియా సపోర్ట్‌ ఆమెకు దక్కుతోంది. సొంత పార్టీ నుంచే తనపై వ్యతిరేకత పెరుగుతున్నా, ట్రంప్‌ నెట్టుకొస్తున్నాడంటే.. ట్రంప్‌ మామూలోడు కాదు.!