బ్యాట్స్‌మెన్‌గా ఫెయిలయ్యాడు.. కెప్టెన్‌గా సక్సెస్సయ్యాడు.. అదిరిందయ్యా కోహ్లీ.. అంటున్నారిప్పుడంతా. కెప్టెన్ అన్నాక ఒత్తిడి ఓ రేంజ్‌లో వుంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించడమంటే ఆషామాసీ వ్యవహారం కానే కాదు. బ్యాట్స్‌మెన్‌గా ఫెయిలయితేనేం, కెప్టెన్‌గా సక్సెస్సయ్యాడు గనుక, ఇప్పుడంతా విరాట్ కోహ్లీ జపమే చేస్తున్నారు. కానీ, విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ చూడాలని ఎదురుచూసిన భారత క్రికెట్ అభిమానులు మాత్రం, రెండు టెస్టుల్లోనూ నిరాశ చెందాల్సి వచ్చింది.
కాన్పూర్ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అశ్విన్, జడేజా తిప్పేశారు ఆ మ్యాచ్‌లో. అది టీమిండియాకి 500వ మ్యాచ్. ఇక, తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మరో విజయం దక్కింది. ఈ మ్యాచ్ గెలుపుతో టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అంతేనా, న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌ని కూడా గెలిచేసింది ఇంకో మ్యాచ్ మిగిలి వుండగానే.
ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వికెట్ కీపర్ సాహా గురించే. వికెట్ల వెనకాల సాహా విన్యాసాలు అద్భుతః అనే రీతిలో సాగాయనడం అతిశయోక్తి కాదేమో. వికెట్ల ముందు బ్యాట్‌తోనూ సాహా చెలరేగిపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థ సెంచరీలు చేశాడు సాహా. అందుకు, వృద్ధిమాన్ సాహాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటారు. షమి, భువనేశ్వర్.. ఇద్దరూ రెండు ఇన్నింగ్స్‌లనీ కలుపుకుంటే చెరో ఆరు వికెట్లు తీయడం గమనార్హం.