దేశంలో వుంటూ, దేశం అందిస్తున్న సకల సుఖాలూ అనుభవిస్తూ.. భారత్ మాతా కీ జై.. అనమంటే కొందరికి 'మతం' అడ్డు వస్తోంది. అసలు భారతమాతకీ, మతానికీ లింకేంటి.? అనడగొద్దు. అదంతే. అది మూర్ఖత్వం. అంతకు మించిన పైశాచికత్వం.
ఇక, అసలు విషయానికొస్తే, జమ్మూకాశ్మీర్‌లోని యూరి సెక్టార్లో భారత బలగాలపై దాడులకు దిగారు తీవ్రవాదులు. ఈ ఘటనలో ఇప్పటిదాకా 20 మంది సైనికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా వున్నట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి.
ఇంకోపక్క, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అణచివేయడమెలా.? అన్నదానిపై కేంద్రం, అత్యున్నతస్థాయిలో సమాలోచనలు జరుపుతోంది. ఏ క్షణాన అయినా పాకిస్తాన్‌కి దిమ్మతిరిగిపోయే 'సమాధానం' భారత్ నుంచి వెళ్ళడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, అది ఏ రూపంలో.? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఇక, అమర జవాన్లకు దేశం ఘనంగా నివాళులర్పించింది. శ్రీనగర్‌లో జవాన్ల మృతదేహాలకు సైనిక లాంఛనాలతో నివాళులర్పించాక, జవాన్ల స్వస్థలాలకు వారి పార్తీవ దేహాల్ని పంపించారు. అనంతరం, కొందరి పార్టీవదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ఓ సైనికుడి కొడుకు.. నిండా పదేళ్ళు కూడా లేని ఆ చిన్నారి, పంటి బిగువున తండ్రిని కోల్పోయిన బాధను అదిమిపట్టి, 'భారత్ మాతా కీ జై' అంటూ నినదించాడు. దాంతో, అక్కడున్న సైనికులే కాక, సామాన్యులూ దేశభక్తితో ఉప్పొంగిపోయారు.. తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. 'నేను సైన్యంలో చేరతా.. డాక్టర్‌గా సైన్యానికి సేవలందిస్తా..' అని ఆ చిన్నారి చెప్పాడు.
ఆ మధ్య కాశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఓ జవాను మృతి చెందగా, ఆ జవాను భార్య అతి కష్టమ్మీద సైనిక శిక్షణ తీసుకుని, పరీక్షలు కూడా రాసి, సైన్యానికి ఎంపికైన విషయం విదితమే. దేశం నాకేమిచ్చింది.? అని సోకాల్డ్ రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశానికి నేనేమిచ్చాను.? ప్రాణం ఇచ్చినా తక్కువే.. అని సైనికుడు భావిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులదీ అదే దారి. జై జవాన్.. అని ఒక్కసారి కాదు.. వంద సార్లు.. వెయ్యిసార్లు.. లక్ష సార్లు.. నినదించినా, అది సైనికులు దేశానికి అందిస్తున్న సేవల ముందు తక్కువే. సైనికుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. ఇంతకన్నా.!