జైలుకి వెళ్ళడమంటే నేరం చేసిన వ్యక్తుల్ని అక్కడ సంస్కరించి, తిరిగి సమాజంలోకి మంచి పరులుగా వారిని పంపించడమనే గొప్ప ఉద్దేశ్యం అందులో దాగి వుంటుంది. 'నేరము – శిక్ష'కి అర్థం ఇదే. తప్పు చేశాడు, జైలు శిక్ష అనుభవించాడు. ఇది మామూలుగా మనం చెప్పుకునేదే. కానీ, కొన్ని కేసుల్లో నేరం చేసిన వ్యక్తికి, జైల్లో శిక్ష పడుతుంది. అది మరణ శిక్ష అవుతుండడమే ఇక్కడ దారుణం. ఇందులో కొన్ని హత్యలు, కొన్ని ఆత్మహత్యలు వుంటుంటాయండోయ్.!
పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను ఏమయ్యాడు.? జైల్లో హత్యకు గురయ్యాడు. జైల్లో హత్యకు గురి కావడమేంటి.? అని అంతా ముక్కున వేలేసుకోవచ్చు. కానీ, జరిగిపోయింది. ఎలా.? అనడక్కండి. అదంతే. ఇదిగో, ఇంకో కేసు అలాంటిదే. ఈసారి జైల్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నయ్‌లో స్వాతి అనే యువతిని చంపిన కేసులో నిందితుడు రామ్‌కుమార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రేమించిన యువతి కాదన్నందుకే, రామ్‌కుమార్ – స్వాతిని చంపాడన్నది పోలీసుల వెర్షన్. ముందు ఆ హత్య చేసింది తానేనని ఒప్పుకున్న రామ్‌కుమార్, ఆ తర్వాత పోలీసులు తనను ఈ కేసులో బలవంతంగా ఇరికించారని ప్లేటు పిరాయించాడు. ఇంతలోనే, రామ్‌కుమార్ జైల్లో శవమై తేలాడు. చావు బురు చల్లగా చెప్పారు జైలు అధికారులు. జైల్లోని కరెంటు వైర్‌ని నోటితో పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడట రామ్‌కుమార్.
రామ్‌కుమార్ విషయంలో – ఓ అమ్మాయిని చంపిన వ్యక్తి, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడని ఎలా అనుకోగలం.? మొద్దు శీను విషయంలో – ఓ ఎమ్మెల్యేని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి, సింపుల్‌గా జైల్లో హత్యకు గురయ్యాడంటే, దాని వెనుక పెద్దల హస్తం లేదని ఎలా అనుకోగలం.? కొన్ని జరుగుతాయి. అంతే. ఎలా.? అని ఆరా తీస్తే, చివరికి ఏ ఆధారమూ దొరకదు.
నేరం చేశాడు.. శిక్ష అనుభవించాడు.. అని సరిపెట్టేసుకుందామా.? ఓ యువతిని కిరాతకంగా చంపాడు గనుక, రామ్‌కుమార్‌కి మరణ శిక్ష పడాల్సిందే.. కానీ, ఆ శిక్ష విధించాల్సిందెవరు.? న్యాయస్థానం కదా.! మొద్దు శీను విషయంలో అయినా అంతే. కానీ, న్యాయస్థానాల్లో చాలా కేసులు అలా అలా పెండింగ్‌లో వుంటాయంతే. అందుకే, ఇలాంటి వైపరీత్యాలు తప్పేమీ కాదన్నది కొందరి వాదన. ఏదిఏమైనా, ఇలాంటి కేసులు తెరపైకొచ్చినప్పుడే 'ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా..' అనుకోవాల్సి వస్తుంది.
విజయవాడలో అయేషా మీరా అనే యువతి దారుణ హత్యకు గురయ్యింది. పోలీసులు ఇదిగో నిందితుడు, అదిగో నిందితుడు.. అంటూ ఓ అనామకుడ్ని (శ్యాంబాబు)ని నిందితుడిగా తేల్చారు. అతడేమో, తనకు ఏ పాపమూ తెలియదన్నాడు. చావు బతుకుల్లో పలుమార్లు మీడియా ముందుకొచ్చాడు పోలీసుల సమక్షంలో శ్యాంబాబు. ఇలాంటోడికి హత్య చేసేంత సీనుందా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదో మాయ అంతే.! ఏది నిజం.? ఏది అబద్ధం.?
మొద్దు శీను ఎలా చనిపోయాడు.? రామ్‌కుమార్‌ది ఆత్మహత్యేనా.? శ్యాంబాబు హంతకుడేనా.? ఇవి ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నలే.