కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఈనాటిది కాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం మునుపెన్నడూ జరగనిది. వేడెక్కడం.. చల్లారిపోవడం.. 'కావేరీ' వివాదానికి మామూలే. కావేరీ నదీ జలాల పంపకంపై ఎప్పటినుంచో వివాదాలు నడుస్తున్నా, అది దేశంలోని రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు తావిస్తున్నా, కేంద్రం చూసీ చూడనట్లే వ్యవహరిస్తోంది తప్ప, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడంలేదు.
తమిళనాడు, కర్నాటక.. దేనికదే అన్నట్లు వ్యవహరిస్తుంటాయి. వ్యవహారం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇష్టం లేకపోయినా, కష్టంగానే తమిళనాడుకి నీటిని విడుదల చేసింది కర్నాటక. దాంతో కర్నాటకలో ఆందోళనలు మిన్నంటాయి. ఆ ఆందోళనలకు ప్రతిగా 'నీరు అందుకుంటున్న' తమిళనాడు కూడా రంగంలోకి దిగింది. తామేం తక్కువ తిన్లేదంటూ ఆందోళనల్ని షురూ చేసింది. వెరసి, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కాస్తా, ఇరు రాష్ట్రాల్లోని ప్రజలు కొట్టుకునేలా చేసింది.
కావేరీ దెబ్బకి, బెంగళూరు ఆర్థికంగా తీవ్రమైన నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అయినా, తగ్గేది లేదంటోంది కర్నాటక. తమిళనాడు సంగతి సరే సరి. ఈలోగా, సర్వోన్నత న్యాయస్థానం ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు, విధ్వంసంపై కన్నెర్రజేసింది. మామూలుగా అయితే కోర్టు తీర్పు వచ్చాక, దానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగకూడదు. కానీ, ఇక్కడ జరుగుతున్నాయి. తీర్పుపై భిన్నాభిప్రాయాలుంటే, కోర్టులోనే సవాల్ చేయొచ్చుగానీ, ఈ విధ్వంసాలేంటని న్యాయస్థానం ఇరు రాష్ట్రాల్నీ ప్రశ్నించింది.
ప్చ్, అయినా లాభం లేదు. కర్నాటకలో బంద్.. ఆ తర్వాత తమిళనాడులో బంద్.. విద్వంసాలు మామూలే. ఇంతకీ, కర్నాటక – తమిళనాడు ప్రభుత్వాలు ఈ ఆందోళనల విషయంలో ఏం చేస్తున్నాయి.? అంటే, పైకి 'శాంతి.. శాంతి..' అంటూనే, తెరవెనుక విధ్వంసాల్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. తమిళనాడులో బంద్ జరుగుతోంటే, ప్రభుత్వం తెరవెనుక పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇది, కర్నాటక నేర్పిన విద్యేనన్నది తమిళుల వాదన.
ఇద్దరు ముఖ్యమంత్రులూ ఢిల్లీకి వెళ్ళి ప్రధానితో భేటీ అయి సమస్యకు పరిష్కారం వెతకొచ్చు కదా.? అంటే, అసలంటూ సమస్యని పరిష్కరించాలన్న ఆలోచన ఎవరికి వున్నా, ఈ పాటికి పరిష్కారం దొరికేదే కదా.. అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.
ఒక్కటి మాత్రం నిజం.. ప్రజల సెంటిమెంట్లతో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు ఆటలాడుతున్నాయి. పరిపాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు.. సెంటిమెంట్లను రెచ్చగొడ్తున్నాయి. అంతే తప్ప, సమస్య పరిష్కారంలో మాత్రం ఇరు రాష్ట్రాలూ చిత్తశుద్ధిని చూపడంలేదు. పరిష్కారం వెతికే క్రమంలో ఒకరికి లాభం, ఇంకొకరికి నష్టం చేస్తే.. తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.