తమ అభిమాన హీరో తెరపై 'హీరోచిత' విన్యాసాలు చేసేస్తోంటే, అదేదో నిజంగా చేసేస్తున్నాడనే భ్రమలో బతికేస్తుంటారు అభిమానులు. ఒంటిచేత్తో నలభై మంది గూండాల్ని చితక్కొట్టేయడం మామూలుగా జరిగే పనేనా.? అన్న ఆలచనే రాదు సోకాల్డ్ వీరాభిమానులకి. అందుకే, అభిమానులు వాస్తవాల్ని పట్టించుకోరు.. అసలు నేలమీద నిలబడరు.!
తెరపై హీరోలు వేరు.. రియల్ లైఫ్ హీరోలు వేరు.. సినిమా వేరు.. వాస్తవం వేరు. క్రీడా రంగంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారు, దేశాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం.. వీరే కదా రియల్ హీరోలు. దురదృష్టవశాత్తూ వీరి విషయంలోనూ సినీ అభిమానులు నోరు పారేసుకుంటుంటారు. మరీ ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో సినీ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గుడ్డిగా, తమ అభిమాన హీరోని వెనకేసుకురావడానికి క్రీడాకారులతోనూ పంచాయితీలు పెట్టేసుకుంటారు.
రెజ్లర్ యోగేశ్వర్దత్పై ఈసారి ఒలింపిక్స్‌లో చాలా అంచనాలున్నాయిగానీ, అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. దాంతో, సల్మాన్‌ఖాన్ అభిమానులు రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా యోగేశ్వర్పై అవాకులు చెవాకులు పేలారు. సినీ ప్రముఖులకు తెలుసు.. తాము రీల్ హీరోలమైతే, రియల్ హీరోలు వేరే వున్నారని. గెలిచినా, గెలవకపోయినా.. క్రీడాకారులకి సెలబ్రిటీలు ఇచ్చే గౌరవం అంతా ఇంతా కాదు.
సల్మాన్‌ఖాన్‌కి ఒలింపిక్స్ పోటీలకు భారత గౌరవ అంబాసిడర్‌గా పనిచేసే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకించడమే యోగేశ్వర్‌దత్ చేసిన తప్పట. అప్పటినుంచీ సల్మాన్‌ఖాన్ అభిమానులకీ యోగేశ్వర్దత్కీ మధ్య వైరం ముదిరి పాకాన పడింది. ఇది వన్‌సైడ్ ఫైట్. సల్మాన్‌ఖాన్ అభిమానులపై ఇప్పటిదాకా పెదవి విప్పని యోగేశ్వర్‌దత్, తాజాగా ఘాటుగా స్పందించాడు. 'మన దేశంలో కుక్కలకి మొరిగే హక్కు వుంది..' అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డాడు.
'ఒలింపిక్స్‌లో నా ప్రదర్శన నిరాశపరిచినవారందరికీ క్షమాపణలు..' అంటూనే, 'ఒకరి' అభిమానుల విషయంలో తానేమీ ఇబ్బందిపడటంలేదనీ, కుక్కలు మొరుగుతూనే వుంటాయని స్పష్టం చేశాడు. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్న యోగేశ్వర్దత్పై సల్మాన్‌ఖాన్ అభిమానుల పైత్యమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈ వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న సల్మాన్‌ఖాన్, అభిమానుల్ని ఉద్దేశించి ఓ ప్రెస్‌మీట్ పెట్టాలనుకుంటున్నాడట.
మరోపక్క, యోగేశ్వర్దత్ని కలవాలని కూడా సల్మాన్‌ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరో చెప్పినాసరే, మొరుగుతోన్న అభిమానులు ఊరుకుంటారా.? ఎందుకంటే, 'కొందరికి' అభిమానం అనేది ఓ పిచ్చి కదా.!