ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్. వాస్తవానికి, నెల క్రితం ఇంతటి సీరియస్‌గా ప్రత్యేక హోదా గురించిన చర్చ జరగలేదు. ప్రత్యేక హోదా ఆకాంక్ష వున్నా, ఆ స్థాయి ఒత్తిడి అయితే ప్రజల్లోనూ లేదు, రాజకీయ పార్టీల్లోనూ లేదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కారణమెవరు.? కాంగ్రెస్ పార్టీనా.? బీజేపీనా.? వైఎస్సార్సీపీనా.? టీడీపీనా.? ఒక్కరు అని చెప్పడం సబబు కాదు, అందరూ దీనికి కారకులే.
వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేసీ చేసీ విసిగిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేస్తూనే వుంది. కాంగ్రెస్ పార్టీనే, అనూహ్యంగా ప్రత్యేక హోదా ఉద్యమంలోకి వచ్చింది. అది కూడా కేవీపీ రామచంద్రరావు పుణ్యమే. అదో మిస్టరీ. తెరవెనుక ఏం జరిగిందో తెలియదుగానీ, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ గట్టిగానే ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానికెత్తుకుంది. అంతే సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇక్కడే, బీజేపీ అడ్డంగా బుక్కయిపోయింది. కాస్త వెనక్కి వెళితే తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి పరిస్థితులే కన్పించాయి. కాంగ్రెస్, తెలంగాణ ఇస్తామని చెప్పింది. అప్పుడు టీడీపీ కాదనేసింది. ఆ తర్వాత టీడీపీ, తెలంగాణకి అనుకూలమని ప్రకటించింది. ఇక, అక్కడినుంచి కథ కొత్త మలుపులు తిరిగింది. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది.
తెలంగాణ విషయంలో అప్పుడెలా కాంగ్రెస్ కార్నర్ అయ్యిందో, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఇప్పుడలా కార్నర్ అవుతోంది. తెలియకుండానే, ప్రత్యేక హోదా ఉద్యమానికి బీజేపీ ఆజ్యం పోస్తోంది. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ కావాలనే నాన్చింది. మన్మోహన్సింగ్ ఇప్పుడేవో కథలు చెప్తున్నారుగానీ, ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని కాదని 'ఎన్నికల షెడ్యూల్'ని ప్రకటించగలదా.? ఆ షెడ్యూల్ కేంద్రానికి ముందే తెలియదని ఎలా అనుకోగలం.? సరిగ్గా టైమ్ చూసి, ప్రత్యేక హోదాని వివాదాస్పదం చెయ్యడానికే, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, రాష్ట్రపతికి ప్రత్యేక హోదా ఆర్డినెన్స్ కోసం రిఫర్ చేసింది మన్మోహన్ సర్కార్.
బీజేపీ విషయానికొస్తే, ప్రత్యేక హోదా గురించి ఇంకా గట్టిగా మాట్లాడితే తెలంగాణ ఆగిపోతుందేమో, తద్వారా తెలంగాణలో నష్టపోతామేమోనన్న భయంతో, అప్పట్లో లైట్ తీసుకుంది. లేదంటే, పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశం కూడా చట్టంగా ఆమోదం పొంది వుండేది. సో, ఇక్కడ బీజేపీని కాంగ్రెస్ విమర్శించినా, కాంగ్రెస్‌ని బీజేపీ విమర్శించినా అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. అన్నిటికీ మించి ఈ ఎపిసోడ్లో టీడీపీ కామెడీ నవ్వులపాలైపోతోంది.
తప్పదు.. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. రాజకీయ పార్టీలు ఆడుతున్న ఈ మైండ్ గేమ్ పుణ్యమా అని, ఇప్పటిదాకా సంయమనంతో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు ముందు వీధిపోరాటాలకు సిద్ధపడ్డంలో పెద్ద వింతేమీ లేదు. అదే గనుక జరిగితే, అప్పుడు కాంగ్రెస్, ఇకపై టీడీపీ – బీజేపీ.. ఏపీ రాజకీయాల్లోంచి ఔట్ అయిపోవడం ఖాయమే.