ఆటగాడిగా అతడి మాయను చూసి ప్రపంచం సంభ్రమశ్చర్యాలకు గురైంది. ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడనే బిరుదును ఇచ్చింది. సాకర్ లో మన కాలపు మహావీరుడని ప్రశంసించింది.. ఫుట్ బాల్ ప్రపంచానికి మారడోనాను ఇచ్చిన అర్జెంటీనా అందించిన మరో ఆణిముత్యం అని మెస్సీకి తగిన పోలికను పెట్టింది… సాకర్ మైదానంలో చిరుతలా కదిలే మాయగాడు మెస్సీ రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ అభిమానులను నిరాశ పరిచే అంశమే. ఫుట్ బాల్ అంటే పెద్దగా పరిచయం కూడా లేని భారతదేశంలో కూడా మెస్సీకి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ కంపెనీలు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని తమ అమ్మకాలను పెంపొందించుకోవాలని చూశాయంటే మెస్సీ ప్రభావం ఇండియా మీద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిజమే.. ప్రపంచంలో ప్రస్తుతానికి అత్యంత క్రేజ్ ను కలిగిన ఫుట్ బాల్ ప్లేయర్, అత్యధిక స్థాయిలో డబ్బును సంపాదించే ప్లేయర్ మెస్సీనే. కానీ ఏం లాభం.. నిరాశాజనకమైన పరిస్థితుల మధ్య మెస్సీ అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్ కు సెలవిచ్చాడు. ఇక దేశం తరపున ఆడలేనని ప్రకటిస్తూ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అసలు మెస్సీ రిటైర్మెంటును ఎవ్వరూ ఊహించలేదు. కోపా అమెరికా కప్ ఆరంభానికి ముందు మెస్సీకి ఇలాంటి ఆలోచన ఉందని కూడా ఎవ్వరూ అంచనా వేయలేదు.
వాస్తవమే.. మెస్సీ ది చాలా దారుణమైన పరిస్థితి. వ్యక్తిగతంగా ప్రతిభావంతుడైనా, వందల కోట్ల రూపాయలను సంపాదిస్తున్నా.. ఫుట్ బాల్ లీగ్ లలో తను ప్రాతినిధ్యం వహించిన టీమ్ ను పలుసార్లు విజేతగా నిలిపినా.. తమ జాతీయ జట్టుకు మాత్రం మెస్సీ తగు తీపి జ్ఞాపకాలను మిగిలించలేకపోయాడు.
క్లబ్ స్థాయి విజయాలు ఎన్ని అయినా.. జాతీయ జట్టు తరపున సాధించిన విజయానికి సమానం కావు. అర్జెంటీనా నుంచి వచ్చిన మరో మారడోనా అనిపించుకున్నా, ఆ మాజీ ఆటగాడిలా తన దేశానికి ప్రపంచకప్ ను అందించలేకపోయాడు మెస్సీ. కనీసం కోపా అమెరికా కప్ ను కూడా అందించలేకపోయాడు! క్రితం ఏడాది కోపా లో కూడా ఇదే చిలీ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైంది. ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన అర్జెంటీనన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అంతర్జాతీయ వేదికలపై మెస్సీ సాధించిన గొప్ప విజయం.
2014 సాకర్ వరల్డ్ కప్ లో అర్జెంటీనా ఫైనల్లో ఓడినప్పుడే చాలా మంది మెస్సీని లక్యంగా చేసుకున్నారు. అర్జెంటీనా ఫైనల్ వరకూ వచ్చినా.. ఆ ప్రపంచకప్ కు గానూ మెస్సీని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ప్రకటించడాన్ని చాలా మంది తప్పుపట్టారు! అది సరైన ఎంపిక కాదన్నారు.
అంతేనా.. 2010 ప్రపంచకప్ అప్పుడే మెస్సీని ఫెయిల్యూర్ అన్నారు. డిగో మారడోనా అర్జెంటీనా జట్టుకు మేనేజర్ గా వ్యవహరించిన ఆ పర్యాయంలో ఆ జట్టు విజేతగా నిలవడం ఖాయమని అనుకున్నా.. అది జరగలేదు. మారడోనా- మెస్సీ ద్వయం ఫెయిలవ్వడంతో అర్జెంటీనన్లు తీవ్రంగానే నిరాశ చెందారు.
పలు పర్యాయాల్లో మెస్సీ అర్జెంటీనా ఆశలన్నింటినీ మోశాడు. అయితే తమ జట్టును విజేతగా నిలవలేకపోయాడు. ఈ సారి ఓటమితో విమర్శలు కాదు.. మెస్సీపై సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే ఏ స్టార్ ఆటగాడూ ఇలాంటి సానుభూతిని ఆశించడు.
అయినా.. పుట్ బాల్ ప్రపంచంలో తాము రారాజులుగా వెలుగొంది తమ సొంత జట్టుకు మాత్రం ఆ ఖ్యాతిని దక్కించలేకపోయిన వారు కొత్తేమీ కాదు. బ్రిటన్ మాజీ స్టార్ డేవిడ్ బెక్ హమ్, మెస్సీ సమకాలీకుడు పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వంటి వాళ్లు తమ జాతీయ జట్లను అంతర్జాతీయ విజేతలుగా నిలపలేకపోయారు. అలాంటి ఫెయిల్యూర్ స్టోరీల్లో మెస్సీదీ ఒకటయ్యింది!
-జీవన్ రెడ్డి.బి