ఎమ్బీయస్‌: మోతీలాల్‌ నెహ్రూ తండ్రి ముస్లిమా?- 2

మెకాలే బ్రిటిషు పార్లమెంటులో 1835 ఫిబ్రవరిలో యిచ్చిన ప్రసంగం అంటూ గత ఐదారేళ్లగా ఒకటి ఫార్వార్డ్‌స్‌ లో తెగ వస్తూంటుంది. తెలుగులో దాని అర్థం ఏమిటంటే – ''నేను భారతదేశం నాలుగువైపులా తిరిగాను. ఒక…

మెకాలే బ్రిటిషు పార్లమెంటులో 1835 ఫిబ్రవరిలో యిచ్చిన ప్రసంగం అంటూ గత ఐదారేళ్లగా ఒకటి ఫార్వార్డ్‌స్‌ లో తెగ వస్తూంటుంది. తెలుగులో దాని అర్థం ఏమిటంటే – ''నేను భారతదేశం నాలుగువైపులా తిరిగాను. ఒక దొంగగాని, బిచ్చగాడు కానీ లేడు. ఇక్కడి ప్రజలు ఐశ్వర్యంతో, ఉన్నత నైతిక విలువలతో, గొప్ప నైపుణ్యంతో విలసిల్లుతున్నారు కాబట్టి వీరిని జయించడం ఎప్పటికీ సాధ్యం కాదు. జయించాలంటే దేశానికి వెన్నెముకలా నిలిచిన వీరి సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం నాశనం చేయాలి. అందువలన వారి పురాతన విద్యావిధానాన్ని మార్చి దాని స్థానంలో విదేశీయత గొప్పదని, తమ భాషల కంటె ఇంగ్లీషు మిన్నయైన భాష అని అనుకునేట్లా చేయాలి. అప్పుడు వారికి ఆత్మగౌరవం నశించి, దేశీయ సంస్కృతి పోగొట్టుకుని మనం కోరుకున్న బానిసజాతిగా మారుతుంది.''

అది చదవగానే యిది బోగస్‌దని నాకు వెంటనే తోచింది. అసలా ఇంగ్లీషే బాగా లేదు. అప్పట్లో ఇంగ్లీషు కాంప్లెక్స్‌, కాంపౌండు వాక్యాల్లో రాసేవారు. ఇది సీదాసాదాగా వుంది. కొన్ని వెర్షన్లలో పంక్చువేషన్‌ సరిగ్గా లేక మరీ దరిద్రంగా రాశారు. కాలిబర్‌ ఇంగ్లీషు స్పెల్లింగు కాకుండా అమెరికన్‌ స్పెల్లింగ్‌ రాశారు. పైగా పార్లమెంటులో ప్రసంగం అంటే ఏదో పుస్తకంలో అచ్చు వేసే వుంటారు. దాన్ని స్కాన్‌ చేసి పెట్టకుండా విడిగా టైపు చేసి, పక్కన అతని ఫోటో పెట్టి చలామణీ చేయడమేమిటి? అప్పట్లో భారతదేశంలో ముష్టివాళ్లు, దొంగలు లేకపోవడమేమిటి, పురాణకాలం నుంచి మనకు వున్నారు. మన కావ్యాల్లో, కథల్లో అడుగడుగునా తగులుతారు. పైగా మెకాలే వంటి సామ్రాజ్యవాది మనల్ని మెచ్చుకుంటాడా? నాన్సెన్స్‌! మెకాలే విద్యావిధానాన్ని తిట్టడం యీనాటి ఆరెస్సెస్‌ వారికి మహా ముచ్చటైన పని. వారెవరో యీ ప్రచారానికి దిగి వుంటారని అనుకుని పట్టించుకోలేదు. కానీ యింకా యింకా వస్తూనే వున్నాయి. 

ఇప్పుడు గంగాధర్‌ నెహ్రూ సంగతి రాగానే దాని సంగతేమిటాని పరికించి చూశాను. https://www.quora.com/Did-Lord-Macaulay-really-proclaim-in-the-British-Parliament-that-the-only-way-to-rule-India-is-to-make-the-Indian-culture-seem-inferior  లో చాలామంది విపులంగా చర్చించారు. వాటి సారాంశం చెప్పేస్తాను. 1) మెకాలే 1835లో బ్రిటన్‌లో లేనే లేడు. 1834 జూన్‌ నుండి ఇండియాలోనే నాలుగెేళ్లు వున్నాడు. అతను ఇండియాకు లా ఎడ్వైజరీ హోదాలో మద్రాసుకు వచ్చి ఊటీ వెళ్లి కలకత్తా వచ్చాడు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా వున్న ఆ రోజుల్లో భారతదేశాన్ని అతను అడ్డంగా, నిలువుగా కొలిచేశాననడం సర్వాబద్ధం. గవర్నరు జనరల్‌ కౌన్సిల్‌లో లా మెంబర్‌గా కలకత్తాలో ఆ రోజు ఎడ్యుకేషన్‌ మినిట్‌ అని సమర్పించాడు. అందువలన ఆ తారీకును వాడుకున్నారు. కానీ కలకత్తా కౌన్సిల్‌ అంటే ఘనంగా వుండదని బ్రిటిషు పార్లమెంటు అని కిట్టించారు. 2) మెకాలే వచ్చినది క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ రూపొందించడానికి ! పై స్టేటుమెంటు కరక్టయి వుంటే – దొంగతనం వంటి చిన్న నేరం కూడా జరగని దేశం తయారు చేసినందుకు ముస్లిము పాలకులను (ఎందుకంటే దేశంలో చాలా భాగం ముస్లిము సుల్తానుల ఏలుబడిలోనే వుంది) మెచ్చుకుని, యిక్కడ క్రిమినల్‌ కోడ్‌ అవసరం లేదని వెళ్లిపోయి వుండేవాడు.  కానీ దాన్ని అతను రూపొందించి 1837లో సమర్పిస్తే అతని మరణించిన ఒక ఏడాదికి 1860లో పార్లమెంటు ఆమోదించింది. 3) ఆ సందర్భంగా అతను  ఇండియా పేదదేశమనీ, శిక్ష విధించేముందు ఆ విషయం గమనించాలని వాదించాడు. ఇండియా ఐశ్వర్యంతో తులతూగిందని అతను అనే ప్రశ్నే లేదు. 1833లో పార్లమెంటులో మాట్లాడినప్పుడు బ్రిటిషు వారి రాకకు ముందు ఇండియా సంక్షోభంలో వుండేదని అతను ఉపన్యసించాడు. ఆనాటి బ్రిటిషు వారందరిదీ అదే అభిప్రాయం. 

4) అతనికి భారతసమాజంపై గొప్ప అభిప్రాయం వుందని అనుకోవడానికి ఏ రుజువూ దొరకదు. అతను భారతదేశంలోని కులవ్యవస్థను, సతీ సహగమనాన్ని దుయ్యబట్టాడు. భారతీయ భాషల్లో అతి ముఖ్యమైన సంస్కృతం పట్ల, అప్పట్లో పాలకులు గౌరవించే అరబిక్‌ భాష పట్ల అతనికి గౌరవం లేదు. ''నాకు సంస్కృతంతో కాని, అరబిక్‌తో కాని పరిచయం లేదు. వాటి అనువాదాలను మాత్రం చదివాను. తూర్పు దేశాల భాషల్లో ప్రావీణ్యం వున్నవారితో సంభాషించాను. ఇండియా, అరేబియాలో వున్న సాహిత్యమంతా కలిపినా యూరోపియన్‌ లైబ్రరీలో ఒక బీరువాలో వున్న సాహిత్యానికి సమానమవుతుందన్న నా అభిప్రాయాన్ని వారు కాదనలేదు. ప్రాగ్దేశాల విద్యావిధానాన్ని సమర్థించే కమిటీ సభ్యులు కూడా పాశ్చాత్య సాహిత్యపు ఔన్నత్యాన్ని అంగీకరించారు. (|  have never found one among them who could deny that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia. The intrinsic superiority of the Western literature is indeed fully admitted by those members of the committee who support the oriental plan of education. ఇదీ మెకాలే సొంత భాష. దీన్ని వీళ్లు చలామణీ చేస్తున్న నోట్‌తో పోల్చి చూడండి – ఇమేజి జతపరుస్తున్నాను) 5) అతను భారతీయ విద్యావిధానంలో ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టాలని అన్నది – స్థానికులను (అతని దృష్టిలో) నాగరీకులను చేయాలని తప్ప వారిని దిగజార్చాలని కాదు. (అతని దృష్టిలో వాళ్లు పాతాళంలో మసలుతూ ఉద్ధరించబడవలసిన స్థితిలో వున్నారు). అసలు ఇంగ్లీషు వారెవరూ భారతీయులను అణగదొక్కుతున్నామనీ, వాళ్ల నడుం విరుస్తున్నామనీ ఎన్నడూ అనుకోలేదు, అనలేదు. అలాటిది పార్లమెంటులో అలా మాట్లాడతాడా? అసంభవం. పైగా అలా చేస్తే మనం తప్ప వాళ్లను ఓడించలేం అన్నది తప్పు. అప్పటికే వాళ్లు దేశంలో చాలా భాగం జయించేశారు.

ఇంతకీ మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం వల్లన దేశం భ్రష్టు పట్టిపోయిందా? మన జాతి వెనకబడిపోయిందా? జాతీయవాదులమని చెప్పుకునే ఛాందసులు ఎన్నయినా చెప్పవచ్చు. నా మట్టుకు నాకు మెకాలే విధానం వలననే మన జాతి ప్రగతి సాధించిందంటాను. అంతకు ముందు వున్న గురుకుల వ్యవస్థ లేదా మరో వ్యవస్థ ఏదైనా కానీయండి, దాని వలన సమాజంలో అతి కొద్దిమంది మాత్రమే చదువుకోగలిగారు. తక్కినవారందరూ చదువుకు దూరంగానే వున్నారు. అప్పట్లో పాండిత్యం అనేది ఒకటి రెండు సబ్జక్టులకు మాత్రమే పరిమితమయ్యేది. మెకాలే విధానం వలన కాస్త సైన్సు, కాస్త హిస్టరీ, కాస్త జాగ్రఫీ, కాస్త లెక్కలు, కాస్త మాతృభాష, కాస్త యింగ్లీషు నేర్పసాగారు. వీటిలో ఏదో ఒక సబ్జక్టులో విద్యార్థికి ఆసక్తి కలిగి వుంటుంది. అప్పటివరకు దేశం ముక్కలుముక్కలుగా వుండింది. ఎవరి ప్రాంతీయభాష వారిదే. కామన్‌గా వుండే భాష సంస్కృతం మాత్రమే.  కొన్ని ప్రాంతాల్లో పాలక భాషగా పర్షియన్‌, ఉర్దూ వుండేది. చాలా ఉన్నతవర్గాలవారు మాత్రమే వాటిలో ప్రావీణ్యత సంపాదించేవారు. మెకాలే కారణంగా అన్ని ప్రాంతాల వారూ ఇంగ్లీషు నేర్చుకుని తమ మధ్య అంతరాలు తగ్గించుకున్నారు. సంబంధబాంధవ్యాలు పెంచుకుని మనమంతా భారతీయులం, కలిసి వుండాలి అనే భావన ఏర్పరచుకున్నారు. ఇంగ్లీషు నేర్చిన భారతీయులు పై చదువులకు ఇంగ్లండు వెళ్లి అక్కడ ఇంగ్లీషువారు తమ పౌరులకు యిస్తున్న స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను గమనించి, మేమూ మీ పౌరులమే కదా మాకు మాత్రం ఆ హక్కులు ఎందుకు యివ్వరు అని పోరాడారు. పోనుపోను సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని సమరం సాగించి, చివరకు సాధించారు. ఆ విధంగా ఇంగ్లీషు వారు మనకు యింగ్లీషు నేర్పించి వారి గొయ్యి వారే తవ్వుకున్నారు. 

ఇంగ్లీషు వారు ప్రపంచంలో చాలా దేశాల్లో తమ పాలన సాగించిన కారణంగా ఇంగ్లీషుకు ప్రపంచప్రాచుర్యం లభించింది. ఇంగ్లీషు నేర్చినవారికి పోనుపోను అంతర్జాతీయంగా అవకాశాలు విస్తృతంగా కలిగాయి. ఈ కంప్యూటరు యుగంలో భారతీయులు లాభపడ్డారంటే దానికి కారణం ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం. మనం ఏ ఫ్రెంచివారి వలసప్రాంతంగానో వుంటే మనకింత లాభం కలిగి వుండేది కాదు. ఇదంతా మెకాలే ఊహించలేదు. కానీ దేశవాసులకు సరైన చదువు వుండాలి, ఎక్కువమంది విద్యావంతులై వుండాలి అనే లక్ష్యం మాత్రం తప్పకుండా వుంది. ఈనాడు యింత శాతమైనా విద్యావంతులున్నారంటే ఆ విద్యావిధానం ప్రవేశ పెట్టడం చేతనే సాధ్యపడింది. లేకపోతే విద్య అనేది అతి కొద్ది వర్గాల చేతిలో మాత్రమే వుండి వుండేది. ఇప్పుడు మెకాలేని నిందించి ప్రయోజనం లేదు. భారతదేశపు గతమంతా ఘనంగా వుండేదని  మనల్ని నమ్మించడానికి అతన్ని విలన్‌ చేయవలసిన అవసరమూ లేదు. అతని పేర చలామణీలో వున్న యీ ప్రసంగాన్ని పరికించి చూస్తే వట్టి కల్పన అని తెలుస్తుంది. కానీ దీనికి ఆరెస్సెస్‌ అధికార ముద్ర కొట్టింది. ఆడ్వాణీ వంటి మేధావి తవ్‌లీన్‌ సింగ్‌ ''దర్బార్‌'' పుస్తకసమీక్ష చేస్తూ అసందర్భంగా దీన్ని కోట్‌ చేశారు. దాన్ని బిజెపి పార్టీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. http://www.bjp.org/media-resources/press-releases/shri-lk-advanijis-latest-blog-qdurbar-an-extremely-interesting-bookq.ఇవన్నీ చూసి కొంతకాలానికి యిది నిజమే అని అందరూ అనడం మొదలెడతారు. ఒక్కరు కూడా మెకాలే రాతలపై వచ్చిన పుస్తకంలోంచి సదరు పేజీని స్కాన్‌ చేసి చూపించండి అని అడగరు. మనం గొప్పవాళ్లం అనుకోవడం మనకు బాగుంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏం చెప్పినా అనుమానించకుండా నమ్మేస్తాం. కానీ మన జాతి మొదటి నుంచి బోధిస్తూ వచ్చిన సిద్ధాంతం – సత్యాన్వేషణ. మన జాతీయ నినాదం కూడా 'సత్యమేవ జయతే'. సత్యం చెప్పకపోగా అసత్యాన్ని పనిగట్టుకుని ప్రచారం చేయడానికి కొందరు కంకణబద్ధులై వున్నారని మనం గ్రహించి జాగరూకులమై వుండాలి. మన జాతి ఔన్నత్యాన్ని చెప్పడానికి అసత్యాన్ని ఆసరాగా తీసుకోవడం దుర్మార్గం. ప్రస్తుతకాలంలో డిస్‌-యిన్‌ఫర్మేషన్‌ రాజ్యమేలుతోంది. అందువలన మనం మరింత మెలకువగా సత్యాన్ని తెలుసుకోవడానికి సర్వవిధాలా కృషి చేయాలి. గుడ్డిగా దేన్నీ నమ్మవద్దు – యీ వ్యాసంతో సహా, దేన్నీ! – (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

Click Here For Archives