తెలుగు టైటిల్‌ వర్సెస్‌ తమిళ టైటిల్‌..!

అక్షరాల్లో దాగున్న అందమైన భావన అంటే అది అమ్మను ఆకట్టుకునేందుకు చిన్నారి చేసే కేరింతలా ఉండాలి. సినిమాలో దాగున్న భావనను వ్యక్తం చేసే పేరు కూడా అంతే.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే కేరింతలా ఉండాలి.…

అక్షరాల్లో దాగున్న అందమైన భావన అంటే అది అమ్మను ఆకట్టుకునేందుకు చిన్నారి చేసే కేరింతలా ఉండాలి. సినిమాలో దాగున్న భావనను వ్యక్తం చేసే పేరు కూడా అంతే.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే కేరింతలా ఉండాలి. తాము విరచించిన కథలను.. చక్కగా తెరపై చూపడం ఎంత గొప్పదనమో.. తాము రూపొందించిన సినిమాలకు మంచి టైటిల్‌ పెట్టుకోవడం కూడా సృజనజీవుల గొప్పదనం. అయితే అదేం విచిత్రమో.. సినీ పరిశ్రమల్లో టైటిళ్లకు కూడా ఒక ట్రెండు ఉంటుంది! హిట్టైన సినిమా కథలను, కాన్సెప్టులను అనుసరిచండమే కాదు.. టైటిళ్ల శైలిని కూడా కాపీ కొట్టడం మనోళ్లకు రొటీన్‌ అయిపోయింది. పొడవాటి టైటిల్‌తో వచ్చిన సినిమాలు హిట్‌ అయ్యాయంటే.. అదే శైలిని అందుకొంటారు. ఇంగ్లీష్‌ తిట్లనే టైటిల్స్‌గా పెట్టుకున్న సినిమాలు బాగా ఆడాయంటే.. ఇంగ్లీష్‌ తిట్లను వెదికి పట్టుకుని వచ్చి సినిమాలకు వాటిని టైటిల్స్‌గా మార్చుకొంటారు. ప్రస్తుతం అయితే తెలుగులో టైటిల్స్‌ విషయంలో పాత పాటల పల్లవులును, చరణాలను వాడేసుకునే ట్రెండు నడుస్తోంది. ప్రత్యేకించి తాము క్లాస్‌ సినిమాలను తీస్తున్నాం అనుకుంటున్న దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలం నుంచి వచ్చిన సినిమాలను గమనిస్తే… ''ఊహలు గుసగుసలాడే'' 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'' వంటి సినిమాలెన్నో వచ్చాయి. సూపర్‌ హిట్‌ అయిన పాత పాటల నుంచి తెచ్చుకున్న లైన్సే ఈ సినిమాల పేర్లు. అయితే ఈ సినిమాల్లోని లైన్‌కు.. ఈ ఎక్స్‌ప్రెషన్లకూ ఏ మాత్రం సంబంధం లేదు! సదరు సినిమాలు హిట్‌ అయితే అయ్యుండొచ్చు గాక… ఆ సినిమా టైటిళ్లకు వాటి కథా గమనాలకూ ఏ మాత్రం సంబంధం లేదు! అయినా తెలుగులో ఇలాంటి తీరేమీ కొత్త కాదు. ఇడియట్‌ హిట్‌ అయ్యాకా.. అయినప్పటి నుంచి మొదలుపెడితే ''లోఫర్‌'' అని పెట్టుకునేంత వరకూ వచ్చింది వ్యవహారం. 

మరి సొంతంగా క్రియేటివిటీతో టైటిళ్లను.. తమ సినిమాలకు వైవిధ్యమైన టైటిళ్లను పెట్టిన దర్శకులకూ మన వద్ద కొదవలేదు. తెలుగు భాషకు భావ దారిద్య్రం ఏం లేదు.. అని నిరూపించిన వారెంతో మంది ఉన్నారు. వెర్రి మెర్రి సినిమా టైటిళ్లు పెట్టడం మొదలైన 1970ల తర్వాత చూసినా… తెలుగులో సినిమాలకు వాటి కథ, కథనాలకు సూటయ్యే టైటిళ్లను పెట్టి వావ్‌ అనిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. జంధ్యాల సినిమాలనే గమనిస్తే.. ఆయన సినిమాల పేర్లలో చాలా వరకూ వేరే పాత సినిమా పాటల నుంచి తెచ్చుకున్నవే అయినా వాటి కథ,  కథనాలకూ ఆ టైటిల్‌తో ఎక్కడో ఒక మ్యాచ్‌ అయ్యే ఉంటుంది! దర్శకుడిగా కాదు కానీ.. రచయితగా జంధ్యాల పనిచేసిన సినిమాల టైటిల్స్‌లో ఒక మెరుపు 'సీతాకోకచిలుక'. భారతిరాజా దర్శకత్వంలో రూపొందిన ఈ తెలుగు సినిమా ముందుగా తమిళంలో రూపొందింది. ముందుగా భారతి రాజా నేపథ్యాన్ని చూస్తే… సినిమా పేరుకు ప్రాణమిచ్చే మనిషి ఆయన. తను తెరపై ప్రజంట్‌ చేయదలిచిన కథా భావాన్ని ఒకే మాటలో కవితగా చెప్పినట్టుగా ఉంటాయి ఆయన సినిమా టైటిల్స్‌! తమిళంలో ఆయన రూపొందించిన 'పదహారేళ్ల వయసు' 'ఎర్రగులాబీలు' వంటి సినిమాల టైటిల్స్‌ ఆ సినిమాల కాన్సెప్ట్‌కు.. గొప్ప ఇండెక్సుల్లాంటివి. అలాంటి భారతి రాజా 'సీతాకోక చిలుక' తమిళ వెర్షన్‌కు 'అలల్‌ గళ్‌ ఒయ్‌ వత్తిల్లై' ఇంగ్లిషులో  (Waves don't cease) అని టైటిల్‌ ను పెట్టుకున్నారు. రచయిత మణివన్నన్‌ ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియలాంటి వ్యక్తి. తమిళనాడులోని తీర ప్రాంత ప్రజల జీవనశైలిని తెరపై ప్రెజెంట్‌ చేసిన ఈ సినిమాల్లో అలల ప్రస్తావన తీసుకురావడం.. ప్రేమను కెరాటాలతో పోల్చుతూ.. తమిళ కవితాయుక్తంగా పెట్టిన ఈ టైటిల్‌ను తెనుగీకరించిన తీరు నిజంగా అద్భుతమే. కులమతాల రూపంలో రంగురంగులు మిళితమైన ఈ సమాజాన్ని ''సీతాకోక చిలుక''గా అభివర్ణించారు తెలుగు రచయితలు. భారతిరాజా సృజనాత్మక టైటిల్‌తో సంబంధం లేకపోయినా.. అంతకు మించిన అర్థవంతమైన టైటిల్‌గా నిలుస్తుంది 'సీతాకోక చిలుక'. అయితే ప్రతిసారీ ఇలా సాధ్యం కాలేదు. ఇదే భారతిరాజా రూపొందించిన తమిళ సినిమా 'కడలోర కవితైగల్‌'ను (ఇంగ్లిష్‌లో Costal Poems) చిరంజీవితో ఆరాధన పేరుతో రీమేక్‌ చేశారు. కథకు తెలుగులో పెట్టిన టైటిల్‌ కూడా యాప్ట్‌ అవుతుంది కానీ… ఒక జాలరి ప్రేమకథను తమిళ టైటిల్‌ చాలా గొప్పగా రెప్రజెంట్‌ చేసింది.

తమిళ పెద్ద డైరెక్టర్ల సినిమాల టైటిళ్లను తెలుగులోకి అనువాదం చేయడంలో తెలుగు రచయితలు మాతృభాషలో చేసిన గొప్ప ప్రయోగాలు మరిన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి గణేష్‌ పాత్రో చేశారు. శరత్‌ బాబు, సుజాత, సరితలతో తమిళంలో బాలచందర్‌ రూపొందించిన 'నూళ్‌  వెల్లి' అనే టైటిల్‌ ను పాత్రో సృజనాత్మకంగా అనువాదం చేశారు. సినిమా కథాంశానికి తగ్గట్టుగా 'నూళ్‌ వెల్లి' అని టైటిల్‌ పెట్టుకున్నాడు బాలచందర్‌. దాని తెలుగు అర్థం 'దారపు హద్దు'. అయితే మన భాషలో ఒక సినిమా టైటిల్‌ విషయంలో అలాంటి పదప్రయోగం కృతకంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే పాత్రో ఆ సినిమాకు బాలచందర్‌కు 'గుప్పెడు మనసు' అనే టైటిల్‌ ను సూచించారు. బాలచందర్‌ కథాంశాన్ని చక్కగా వ్యక్తీకరించే పేరది. దీంతో ఆయన ఫిదా అయిపోయారు. తన సినిమా తెలుగు వెర్షన్‌కు ఆ టైటిల్‌ పెట్టడంతో పాటు.. చాలా సంవత్సరాల తర్వాత 'గుప్పెడుమనసు' పేరుతో సీరియల్‌ తీశారాయన. ప్రకాష్‌ రాజ్‌, గీత తదితరులు నటించిన ఆ సీరియల్‌ను తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు. 

తమిళ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసే సమయాల్లో టైటిల్స్‌ విషయంలో మనోళ్ల వైఫల్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అడ్డమైన సినిమాలనూ డబ్బింగ్‌ చేసే వాళ్లు అయితే మరీ తెగించేస్తున్నారు. ఈ మధ్య ఏవో రెండు మూడు తమిళ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి.. తమిళ టైటిళ్లనే యథాతథంగా వాడేసిన దుర్భర పరిస్థితులు కనిపించాయి. జిల్లా, మరియన్‌ వంటి సినిమాలు అవే పేర్లతో తెలుగులో విడుదలైపోయాయి! ఇక ఇంతకన్నా ఒక పై మెట్టులో నిలుస్తాయి మరికొన్ని టైటిళ్ల అనువాదాలు. తమిళ రచయితలు, దర్శకులు సృజనాత్మకంగానే టైటిల్స్‌ను పెట్టినా మనోళ్లు ఆ సినిమాలో ఏదో ఒక పాత్ర పేరుతోనో.. మరో రకమైన ఎత్తుగడతోనే టైటిల్‌ను పెట్టేస్తుంటారు. తమిళులు టైటిల్‌ విషయంలో కసరత్తు చేసిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొంటే.. మణిరత్నం సినిమాలను ప్రస్తావించుకోవచ్చు. తన సినిమాలకు భావాత్మకమైన టైటిల్స్‌ను పెట్టడంతో మణి ముందుంటారు. అలా ఆయన పెట్టిన టైటిల్స్‌లో అలైపేయుథే, కన్నథిల్‌ ముథమిట్టల్‌, ఆయ్‌ థా ఎళుతు…వంటి టైటిళ్లను ప్రస్తావించుకోవాలి. మణిరత్నం రూపొందించిన ఈ సినిమాల్లో ఎంత వైవిధ్యం ఉంటుందో.. వాటి టైటిల్స్‌ కు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. కానీ తెలుగు టైటిల్స్‌ లో ఆ భావాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం జరగలేదు. తెలుగులో సమాన సమాసం లేనప్పుడు.. మరో రకంగా ఆ భావాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం కూడా జరగలేదు!

అలైపేయుథే (ఇంగ్లిష్‌ లో Waves are flowing) ను తెలుగులో ''సఖీ'' గా అనువదించారు. కన్నథిల్‌ ముథమిట్టల్‌ సినిమాను (ఇంగ్లిష్‌ లో Apeck on the cheek)ను అమృతగా అనువదించారు. సఖి అనే టైటిల్‌ క్లాస్‌గా ఉందేమో కానీ… ఆ సినిమా కథకు తగ్గట్టుగా మణిరత్నం పెట్టుకున్న టైటిలైతే ఇది కాదు కదా! ఇక శ్రీలంకలో తమిళ కాందిశీకులకు సంబంధించిన కాన్సెప్టుతో రూపొందించిన కథను మురిపెంతో చెక్కిలిమీద ఇచ్చే ముద్దు అనే భావాన్ని వ్యక్తం చేసే టైటిల్‌తో తమిళుల ముందు పెట్టాడు మణిరత్నం. తెలుగులో మాత్రం ఆ సినిమాలో పాప పేరునే టైటిల్‌గా మార్చేసి భారాన్ని దించేసుకున్నారు. తెలుగు భాష పద సంపద విషయంలో లోటు ఉన్నదేమీ కాదు. సినిమా టైటిళ్లను సృజించడం కూడా కష్టం కాదని అనేక మంది రచయితలు నిరూపించారు. అయితే డబ్బింగ్‌ సినిమాలను ఒట్టి వ్యాపారంగా చూసే వాళ్ల వల్ల షార్ట్‌ కట్‌ టైటిల్స్‌ వస్తున్నాయని చెప్పాలి. ఇదే మణిరత్నం తమిళంలో సూర్య, మాధవన్‌ , సిద్ధార్థ్‌లతో రూపొందించిన సినిమాకు ఆయ్‌ థా ఎళుతు అని పేరు పెట్టుకున్నాడు. దానికి అర్థం 'అక్షరమే ఆయుధం'. చదుకున్న వాళ్లే రాజకీయాల్లోకి రావాలన్న భావనను వ్యక్తపరుస్తుంది ఆ సినిమాలో సూర్య చేసిన పాత్ర. దాన్ని జస్టిఫై చేస్తూ అలాంటి టైటిల్‌ ను పెట్టగలిగారు తమిళంలో. కానీ తెలుగులోకి వచ్చే సరికి మాత్రం 'యువ' అంటూ ముగించారు. యువ టైటిల్‌ బాగోలేదని ఎవరూ అనలేరు. కానీ ప్రేక్షకుడిని ఆకట్టుకునే కేరింత మాత్రం ఇలాంటి ఎన్నో టైటిల్స్‌లో లేదు!